దలైలామా వారసుడి పేరును ప్రకటించకపోవడానికి కారణమిదే.. 1995లో ఆరేళ్ల బాలుడి పేరును ప్రకటిస్తే చైనా అపహరించి ఏం చేసిందంటే?
"గోల్డెన్ ఉర్న్" అంటే ఏంటి? చైనా ఎందుకు ప్రతిపాదిస్తోంది?

ప్రస్తుతం ఉన్న దలైలామా తర్వాత 15వ దలైలామా ఎవరు? ఈ ప్రశ్నకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది బౌద్ధులతో పాటు, చైనా ప్రభుత్వం కూడా సమాధానం కోసం ఎదురుచూస్తోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ, 14వ దలైలామా నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. తన పునర్జన్మ ఉంటుందని, అయితే తన వారసుడిని ఎంపిక చేసే అధికారం చైనాకు ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు.
ఈ ప్రకటన ఉద్దేశం కేవలం ఆధ్యాత్మిక వారసత్వ పోరు మాత్రమే కాదు.. 30 ఏళ్ల క్రితం మాయమైన ఒక బాలుడి కథ, ఒక దేశం ఆధిపత్య పోరు కూడా దాగి ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది?
దలైలామా ప్రకటనలో కీలక అంశాలు ఏమిటి?
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామా మాట్లాడుతూ.. రెండు కీలక విషయాలను స్పష్టం చేశారు.
పునర్జన్మ ఉంటుంది: 500 ఏళ్ల బౌద్ధ పరంపర కొనసాగుతుందని, తాను చివరి దలైలామాను కాబోనని ఆయన స్పష్టం చేశారు.
చైనాకు అధికారం లేదు: తన పునర్జన్మను గుర్తించే అధికారం తాను స్థాపించిన స్వచ్ఛంద సంస్థకే ఉంటుందని, చైనా ప్రభుత్వానికి కాదని తేల్చి చెప్పారు.
ఈ ప్రకటన, టిబెటన్ బౌద్ధమతంపై పట్టు సాధించాలని చూస్తున్న చైనాకు ఒక ప్రత్యక్ష సవాల్.
30 ఏళ్ల నాటి కిడ్నాప్ మిస్టరీ
దలైలామా తన వారసుడిని నేరుగా ఎందుకు ప్రకటించడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం “గేడున్ చోకీ న్యిమా” స్టోరీ తెలుసుకోవాల్సిందే.
ఎవరీ గేడున్?: టిబెటన్ బౌద్ధంలో “దలైలామా” తర్వాత అత్యున్నత స్థానం “పంచెన్ లామా”. 1995లో కేవలం ఆరేళ్ల వయసున్న గేడున్‌ను అనే బాలుడిని 14వ దలైలామా 11వ పంచెన్ లామాగా గుర్తించారు. ఈ ప్రకటన వెలువడిన కేవలం 3 రోజులకే, 1995 మే 17న చైనా ప్రభుత్వం గేడున్‌ను, అతని కుటుంబాన్ని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి వారి ఆచూకీ లేదు.
గేడున్‌ను అపహరించిన కొన్ని రోజులకే చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా “గైన్‌చైన్ నోర్బు” అనే మరో బాలుడిని పంచెన్ లామాగా ప్రకటించింది. దీంతో, ఇప్పుడు కూడా తన వారసుడి విషయంలో చైనా ఇలాగే జోక్యం చేసుకుంటుందనే భయంతోనే దలైలామా ఇంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. గేడున్‌కు పట్టిన గతే తన వారసుడికి పట్టకూడదన్నది ఆయన ఉద్దేశం.
ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన రాజకీయ ఖైదీ గేడున్
ఇప్పుడు ఎక్కడ?: గత 30 ఏళ్లుగా, “గేడున్ ఎక్కడ?” అన్న ప్రశ్నకు చైనా దాటవేత ధోరణిలోనే సమాధానం చెబుతోంది. “ఆయన చదువు పూర్తి చేసుకుని, సాధారణ జీవితం గడుపుతున్నారు. వారి కుటుంబం గోప్యతను కోరుకుంటోంది, వారిని ఇబ్బంది పెట్టొద్దు” అని చెబుతున్నారే తప్ప, ఇప్పటివరకు గేడున్‌కు సంబంధించిన ఒక్క ఫొటోగానీ, వీడియోగానీ విడుదల చేయలేదు.
గేడున్ బతికున్నారా? లేదా? అనేదానిపై కూడా స్పష్టత లేదు. పలువురు ప్రపంచ నాయకులు, మానవ హక్కుల సంఘాలు గేడెన్ విడుదల కోసం ఇప్పటికీ ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి.
“గోల్డెన్ ఉర్న్” అంటే ఏంటి? చైనా ఎందుకు ప్రతిపాదిస్తోంది?
దలైలామా ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. దలైలామా పునర్జన్మను గుర్తించాలంటే, అది తప్పనిసరిగా చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలని పేర్కొంది.
దీనికోసం వారు “గోల్డెన్ ఉర్న్” (బంగారు కలశం) అనే పాత పద్ధతిని ముందుకు తెస్తున్నారు. ఇది 18వ శతాబ్దపు క్వింగ్ రాజవంశం నాటి పద్ధతి. దీని ప్రకారం, అర్హులైన అభ్యర్థుల పేర్లను చీటీలపై రాసి ఒక బంగారు కలశంలో వేస్తారు. లాటరీ ద్వారా ఒక పేరును తీసి, వారినే వారసుడిగా ప్రకటిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ (చైనా) పర్యవేక్షణలో జరగాలి.
ఈ పద్ధతి ద్వారా తమకు అనుకూలమైన వ్యక్తిని 15వ దలైలామాగా నియమించుకోవచ్చని చైనా వ్యూహం. కానీ, దలైలామా ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నారు.
ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వారసత్వ పోరు కాదు. ఇది ఒక సంస్కృతి, ఒక మతం, ఒక జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి దలైలామా చేస్తున్న పోరాటం. మరోవైపు, టిబెట్‌పై తన సంపూర్ణ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చైనా పన్నుతున్న వ్యూహం. దలైలామా తాజా ప్రకటనతో ఈ ఆధ్యాత్మిక-రాజకీయ పోరు మరింత తీవ్రరూపం దాల్చింది.