Wildfire: హృదయాన్ని కలచివేసే దృశ్యాలు.. మండుతోన్న అడవులు.. 42 మంది మృతి

ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగగా.. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 42 మంది చనిపోయారు.

Wildfire: హృదయాన్ని కలచివేసే దృశ్యాలు.. మండుతోన్న అడవులు.. 42 మంది మృతి

Fire

Updated On : August 11, 2021 / 10:50 AM IST

Forest fires: ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగగా.. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 42 మంది చనిపోయారు. వీరిలో 25 మంది సైనికులతో పాటు 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. విపరీతంగా మంటలు విస్తరించగా పరిస్థితులు తీవ్రంగా తయారయ్యాయి. అయితే, సైనికులు సుమారు వంద మందిని రక్షించారు. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు సైతం చనిపోయారు.

అల్జీరియాలో 17 రాష్ట్రాల్లో కార్చిచ్చు వ్యాపిస్తోంది. 100కు పైగా ప్రాంతాల్లో మంటలు ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో శాయశక్తుల సాధారణ ప్రజలను కాపాడేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన సైనికులు, పౌరులకు ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్‌ మాజిద్‌ టెబ్బౌనే నివాళులు అర్పించారు. అనేక గ్రామాల్లో పూర్తిగా మంటలు వ్యాపించడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సైనికులు. అడవుల్లో పశువులు, పక్షులు మంటలకు ఆహుతై హృదయాన్ని కలచివేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

మంటలు కారణంగా భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లినట్లుగా అధికారులు వెల్లడించారు. కొంతమంది దుండగులు కావాలని నిప్పు పెట్టడం వల్లే ఈ మంటలు చెలరేగినట్లు దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కమెల్‌ బెల్డ్‌జౌద్‌ ఆరోపణలు చేశారు. ప్రధాని సైతం ఇదే రకమైన అనుమానాలను వ్యక్తం చేశారు. మంటలు చెలరేగుతున్న తీరు చూస్తుంటే కచ్చితంగా నేరస్థులే ఈ దుశ్యర్యకు పాల్పడినట్లు అర్థం అవుతోందని న్యూస్ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి.