Israel Palestine Conflict: జంతువుల్లా ప్రవర్తించారు, అలాగే చస్తారు.. ఇజ్రాయెల్ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
గాజాలోని అల్ అహ్లీ బాప్టిస్ట్ హాస్పిటల్‌పై క్షిపణి దాడికి హమాస్, దాని మిత్రపక్షాలు బాధ్యులని ఇజ్రాయెల్ మంత్రి డిచ్టర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు టెల్ అవీవ్‌లో దిగాల్సిన రోజున ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు.

Israel Palestine Conflict: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం 14వ రోజులుగా సాగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో దాడులు చేస్తున్నారు. హమాస్‌ను సమూలంగా నిర్మూలించిన తర్వాతే యుద్ధం ఆపేస్తామంటూ ఇజ్రాయెల్ తన ఉద్దేశాలను స్పష్టంగానే చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మంత్రి ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హమాస్ సభ్యులు జంతువుల్లా ప్రవర్తించారని, వారిని కూడా అలాగే చంపేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు.
జంతువుల్లాగే ప్రవర్తించిన హమాస్‌ను ఇప్పుడు ఇజ్రాయెల్ మానవ జంతువుల్లాగే చంపేస్తుందని ఇజ్రాయెల్ వ్యవసాయ-గ్రామీణాభివృద్ధి మంత్రి ఏవీ డిచ్టర్ అన్నారు. జంతువులా ఇతరులను చంపిన హమాస్ (ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం) వంటి సంస్థపై పోరాడటానికి ఎటువంటి సమర్థన అవసరం లేదని ఆయన అన్నారు.
గాజాలోని అల్ అహ్లీ బాప్టిస్ట్ హాస్పిటల్‌పై క్షిపణి దాడికి హమాస్, దాని మిత్రపక్షాలు బాధ్యులని ఇజ్రాయెల్ మంత్రి డిచ్టర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు టెల్ అవీవ్‌లో దిగాల్సిన రోజున ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు. హమాస్ ప్రయోగించిన రాకెటే ఆస్పత్రిని ధ్వంసం చేసిందని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉత్తర ఇజ్రాయెల్‌లోకి రాకెట్లు, క్షిపణులకు ప్రతిస్పందనగా దక్షిణ లెబనాన్‌లోని అనేక హిజ్బుల్లా లక్ష్యాలపై రాత్రిపూట దాడి చేసింది. డ్రోన్ దాడిలో లెబనాన్‌లో ఒక అనుమానిత ఉగ్రవాది హతమైనట్లు ఐడీఎఫ్ తెలిపింది.