దావూద్ ఇంటి అడ్రస్ చెప్పాం కానీ, ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటోన్న పాకిస్తాన్

దావూద్ ఇంటి అడ్రస్ చెప్పాం కానీ, ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటోన్న పాకిస్తాన్

Updated On : August 24, 2020 / 4:07 PM IST

అనుమానం నిజమైంది. పాకిస్తాన్ మళ్ళీ మాట మార్చింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ తన ప్రకటనను తానే ఖండించింది. దావూద్ ఇబ్రహీం తమ దేశం లోనే ఉన్నాడని ఆదివారం ప్రకటించిన పాకిస్తాన్ సోమవారం లేడని చెప్తోంది. పాకిస్తాన్ నాలుకకు నరం లేదని మరోసారి రుజువయ్యింది . అది ఎలాగైనా తిరుగుతుంది . ఎన్ని అబద్దాలైనా ఆడుతుంది .



పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. స్టాట్యూటరీ రెగ్యులేటరీ ఆర్డర్ విడుదల చేసింది. అందులో దావూద్ ఇబ్రహీం సహా 88 మంది ఉగ్రవాదుల పేర్లున్నాయి. వీళ్లందరి ఆస్తులు స్వాధీనం చేసుకున్నామని, బ్యాంకు అకౌంట్లు జప్తు చేశామని తెలిపింది. అదే విషయాన్నీ పాకిస్తాన్ మీడియా ప్రచురించింది. తెల్లారి మీడియాలో వార్తలు చూసి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాట మార్చింది. దావూద్ ఇబ్రహీం తమ దేశంలో ఉన్నాడని తాము అంగీకరించినట్లు వచ్చిన వార్తలు నిరాధారమని చెప్పింది.

అంతేకాక తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని చెప్పింది. విచిత్రమేంటంటే పాకిస్తాన్ విడుదల చేసిన స్టాట్యూటరీ రెగ్యులేటరీ ఆర్డర్‌లో దావూద్ ఇబ్రహీం వివరాలన్నీ ఉన్నాయి. లిస్టులో అతడి పేరు సీరియల్ నంబరు క్యూ డి 1. 135లో చూపించారు. అందులో దావూద్ వివరాలన్నీ ఉన్నాయి. అతడి పేరిట ఉన్న తొమ్మిది ఇండియన్ పాస్ పోర్టులు , అయిదు పాకిస్తానీ పాస్ పోర్టుల వివరాలున్నాయి . కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతం లో ఉన్న దావూద్ ఇంటి అడ్రెస్ సహా వివరాలన్నీ ఉన్నాయి.



దావూద్ కు ఉన్న మారు పేర్లు కూడా అందులో పొందుపరిచారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి విధించిన ఆంక్షల లిస్టులో కూడా అదే వివరాలున్నాయి. అదే జాబితాను పాకిస్తాన్ విడుదల చేసిన స్టాట్యూటరీ రెగ్యులేటరీ ఆర్డర్ లో చూపారు .

పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ వివరాలన్నీ విడుదల చేసింది. ఇప్పుడిదే పాక్ విదేశాంగ శాఖ కాదంటోంది . దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉన్నాడనేది నిజం కాదంటోంది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఏముందో చూద్దాం . ”2020 , ఆగస్టు 18 వ తేదీన పాకిస్తాన్ విదేశాంగ శాఖ రెండు స్టాట్యూటరీ రెగ్యులేటరీ ఆర్డర్ లు విడుదల చేసింది . తాలిబన్, ఐసిస్, అల్ ఖైదాపై భద్రతా మండలి విధించిన ఆంక్షలకు సంబంధించిన వ్యక్తుల పేర్లు అందులో ఉన్నాయి.



స్టాట్యూటరీ రెగ్యులేటరీ ఆర్డర్ లు విడుదల చేయడం ఒక రొటీన్ కార్యక్రమం . అంతర్జాతీయ నిబంధనలకు సంబంధించి ఇవి విడుదల చేశాం . 2019 లో కూడా ఇలాంటి స్టాట్యూటరీ రెగ్యులేటరీ ఆర్డర్ విడుదల చేశాం . ఐక్యరాజ్య సమితి జాబితాలో ఉన్న వారి పేర్లే మేము విడుదల చేసిన ఆర్డర్ లో ఉన్నాయి . ఇప్పుడు కొత్తగా మేము విధించిన ఆంక్షలంటూ ఏమీ లేవు . కొందరు వ్యక్తులు తమ దేశం లో ఉన్నట్లు పాకిస్తాన్ అంగీకరించింది అంటూ ఇండియన్ మీడియా లో వచ్చిన వార్తలు సరికాదు. నిరాధారం.

”ఇదీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన సారాంశం . అంతర్జాతీయ నిబంధనలకు సంబంధించి ఇవి విడుదల చేశాం అని చెప్పడం లో అర్ధం ఏమంటే …ఎఫ్ ఏ టి ఎఫ్ … ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్టు నుంచి తప్పించుకోడానికి ఈ వివరాలు విడుదల చేశారన్నది స్పష్టం అవుతోంది. పాకిస్తాన్ చెబుతున్న జాబితాలోనే …అంటే ఐక్యరాజ్య సమితి జాబితాలోనే దావూద్ ఇబ్రహీం పేరూ, ఊరూ అన్నీ ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ దేన్ని ఖండిస్తున్నట్లు ? ఎవరిని దద్దమ్మలుగా చూస్తున్నట్లు ? తాను విడుదల చేసిన స్టాట్యూటరీ రెగ్యులేటరీ ఆర్డర్ లోనే వివరాలన్నీ ఉంటే … ఇప్పుడు తానే ఖండిస్తుంటే పాకిస్తాన్ నాలుకకు నరం ఉందని ఎవరైనా ఎలా నమ్ముతారు ?



దావూద్ ఆ అడ్రస్ లో ఉండొచ్చని చెప్పాం కానీ అక్కడ ఉన్నాడని చెప్పలేదుగా అంటూ బుకాయిస్తూ అంతర్జాతీయ సమాజం కళ్లు గప్పే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. పాకిస్తాన్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా దాన్ని ప్రపంచదేశాలు చూస్తూనే ఉన్నాయనే విషయం మాత్రం అర్థం చేసుకోలేకపోతోంది.