World Tribal Day 2023 : ఆదివాసీల ఆహారంలో ఎర్ర చీమల చట్నీ..
ఆదివాసీల ఆహారపు అలవాట్లలో అత్యంత కీలకమైనది..నిరంతరం వైరల్ గా ఉండేది చీమల చట్నీ. ఎర్రచీమలతో తయారు చేసే చట్నీ. ఈ చట్నీ చాలా చాలా ఫేమస్. ఎర్రచీమలతో తయారు చేసే ఈ చట్నీ శరీరానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుందట..

World Tribal Day
World Tribal Day 2023 : ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం. భారతదేశ వ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీలల్లో వందలాది తెగలున్నాయి. ఆనాటికి ఆదివాసీలు మౌలిక వసతులకు నోచుకోకుండా జీవనం సాగిస్తున్నారు. అటువంటి ఆదివాసీల కోసం ఓ రోజు ఉండాలని ఐక్యరాజ్యసమితి భావించింది. 1982, ఆగస్టు 9న జెనివాలో అటవి వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై 26 మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్‌ల సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కమిటీ కోరగా, ఆదివాసుల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది.
ఈ కమిటీ 1992 నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించి 1994 నుండి 2014 వరకు ఆ మధ్య కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా పరిగణించి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవంగా ప్రకటించింది. అటువంటి ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఆదివాసీల ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం.వారి జీవనశైలి..ఆహారపు అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అడవి తల్లిమీదనే ఆధారపడి జీవించే ఆదివాసీలో అడవిలో లభ్యమయ్యేవాటితోనే ఎక్కువగా కడుపు నింపుకుంటారు. అత్యంత సహజంగా లభించే ఈ ఆహారాలే వారిని ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు.
ఆదివాసీల ఆహారపు అలవాట్లలో అత్యంత కీలకమైనది..నిరంతరం వైరల్ గా ఉండేది చీమల చట్నీ. ఎర్రచీమలతో తయారు చేసే చట్నీ. ఈ చట్నీ చాలా చాలా ఫేమస్. ఎర్రచీమలతో తయారు చేసే ఈ చట్నీ శరీరానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుందట..
ఉప్మా పెసరట్టుతో అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్.. ఇడ్లీతో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అదిరిపోయే కాంబినేషన్.. పొంగిన పూరీలోకి బొంబాయి చట్నీ కేక పుట్టిస్తుంది. మరీ చీమల చట్నీ ఎందులోకి బాగుంటుందో తెలుసా..! అది ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కరెక్ట్‌గానే విన్నారు.. అది చీమల చట్నీయే..! ఒడిశా, చత్తీస్‌గఢ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎర్రచీమల చట్నీ బాగా ఫేమస్.ఈ చట్నీ మన శరీరానికి ఓ ఔషధంగానూ పని చేస్తుందట.

red ant chutney
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లోనూ, ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోనూ.. ఎక్కువగా ఈ చీమల చట్నీకి డిమాండ్ ఉంది. మనమైతే చీమల్ని చూడగానే..దూరం జరగడం కానీ, ఊడ్చేయడం గానీ చేస్తుంటాం. కానీ గిరిజనులు మాత్రం చీమల్ని చూడగానే పండుగ చేసుకుంటారు. వెంటనే వాటిని సేకరించి పచ్చడి చేసేసుకుంటారు. ఈ ఎర్రచీమల పచ్చడిని స్థానికంగా చాప్ డా అని పిలుస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అడవుల్లోని సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలు గూళ్లు పెడతాయి. స్థానిక గిరిజనులు ఆ చెట్లెక్కి, ఈ చీమలను సేకరిస్తారు. ఈ చట్నీ తయారుచేసేందుకు ముందుగా వాటిని రుబ్బుతారు. ఆ పేస్ట్‌కు ఉప్పు, కారం కలిపితే చట్నీ సిద్ధమవుతుంది. కొందరు అల్లం, వెల్లుల్లి కూడా కలుపుతారు. అక్కడి వారంతా ఈ చీమల చట్నీని ఎంతో ఇష్టంగా తింటారు.
వలస ఆదివాసీలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు ఆశ్రయం ఇస్తున్నాయి. వలస ఆదివాసీల్లో అనేక తెగలు ఉండగా, వీరిలో 90 శాతం మంది రోడ్డు, నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి. సాధారణంగా స్థానికంగా లభించే ఆహారాలనే ఎక్కువగా తింటారు. కానీ కొన్ని కాలాల్లో వారికి ఆహార దొరకటం కష్టంగా మారుతుంది.అటువంటి సమయాల్లోనే చీమల్ని తింటారట.
ఆహారంగానే కాదు.. వైద్యానికి చీమలే
ఆకు రాలే కాలం మొదలైన తర్వాత వసంతం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియాగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడమేకాక ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు.
చీమల చట్నీకి జీఐ ట్యాగ్..
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఆదివాసీలు తమ ఆహారంలో చీమల చట్నీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రచీమలతో తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. చీమల చట్నీకి జీఐ టాగ్ సైతం లభించడం గమనార్హం.
అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, తలనొప్పి, జ్వరంగా అనిపించినా చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పేసుకుని చీమల గూడును శరీంపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా.. మంట పుట్టి వేడికి ఒళ్లంతా చెమటలు వస్తాయి. రెండు, మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని ఆదివాసీలు నమ్ముతారు.
ఇదేనా అభివృద్ధి అంటే..అడవిబిడ్డలకు ఆమడదూరంలో వైద్యం
ఇంకా చెప్పాలంటే ఇటువంటి నాటు వైద్యాలనే ఈనాటికి వారు అనుసరిస్తున్నారు అంటే వారికి అందుబాటులో వైద్యసౌకర్యాలు లేకపోవటం కూడా కారణంగా చెప్పుకోవాలి. ఆదివాసీల ఆడబిడ్డలు ప్రసవం కోసం నాగరిక ప్రపంచంలోకి రావాలంటే ఈనాటికి కూడా డోలీలను తయారు చేసుకుని గర్భిణులను కిలోమీటర్లు కిద్దీ మోసుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. ఇది వర్షాకాలంలో అయితే మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఒక్కోసారి గర్భిణి ప్రాణాలే పోతాయి. తల్లీ పిల్లలు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. దీనికి కారణం వారు నిసించే తండాల ప్రాంతాలకు రోడ్లు సౌకర్యాలు లేకపోవటమే. అంబులెన్స్ సర్వీసులు ఉన్నా ..వాటికి సమాచారం వెళ్లి రావాలన్నా రోడ్డు సౌకర్యాలు లేకపోవటం వల్ల తండాల వరకు వెళ్లే పరిస్థితి లేదు.
75 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో ఆదివాసీలకు అందని అభివృద్ధి ఫలాలు
దీంతో కంప్యూటర్ యుగమని..స్వాత్రంత్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాల కావస్తున్న ఈనాటికి గిరిజన, ఆదివాసీల జీవన గతులు మాత్రం మారలేదు. వారికి మెరుగైన జీవితాలను ఏ ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి. భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని పాలకులు ఎంత గొప్పగా చెప్పినా ఈనాటికి గిరిజన, ఆదివాసీల జీవితాలు మాత్రం కష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఆదివాసీల దినోత్సవాలు జరపటం కాదు ఏ ఉద్ధేశ్యంతో అయితే ఈ రోజు ఏర్పడిందో అది అమలు జరిగితేనే అసలైన అర్థం..పరమార్థమూను..ఈ విషయాన్ని పాలకులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..