దంచికొట్టిన ధావన్.. అయ్యర్ హాఫ్ సెంచరీ..!

  • Published By: sreehari ,Published On : October 14, 2020 / 09:42 PM IST
దంచికొట్టిన ధావన్.. అయ్యర్ హాఫ్ సెంచరీ..!

Updated On : October 14, 2020 / 9:52 PM IST

DC vs RR : ఐపీఎల్ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ దంచి కొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ (33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) 57తో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్) 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీని సాధించాడు.



ఢిల్లీ జట్టులో ధావన్, అయ్యర్ మినహా మిగతా ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన మొదటి ఓవర్‌లో మొదటి బంతికే పృథ్వీ షా డకౌట్‌ అయ్యాడు. సున్నా పరుగుకే ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది.

Dhawnass

రహానే ఆర్చర్‌ బంతులను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. రెండో ఓవర్‌ వేసిన ఆర్చర్‌ మూడో బంతికి రహానేను అవుట్‌ చేశాడు. 10 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన ఆర్చర్‌ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.



రహానే అవుట్‌తో క్రీజులోకి వచ్చిన అయ్యర్‌తో కలిసి ధావన్ చెలిరేగిపోయాడు. 11 ఓవర్ లో గోపాల్ బౌలింగ్‌లో త్యాగికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అయ్యర్ త్యాగి బౌలింగ్‌లో ఆర్చర్ క్యాచ్ ఇచ్చి తాను కూడా వెనుతిరిగాడు.



మిగతా ఆటగాళ్లలో మరో ఓపెనర్ పృథ్వీషా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా.. రహానె (2), స్టెయినీస్ (18), కరే (14), పటేల్ (7), అశ్విన్ (0 నాటౌట్)గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది.



దీంతో ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ కు 162 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ ఏకంగా మూడు వికెట్లు తీసుకోగా, ఉనద్కత్ రెండు, త్యాగి, గోపాల్ తలో వికెట్ తీసుకున్నారు.