భారత్‌లో చైనా ఫోన్లకు లాక్‌డౌన్..? టాప్ బ్రాండ్లపై ఎఫెక్ట్!

దునియా ముట్టిమే.. అంటూ చైనా మొబైల్ ఫోన్స్ ప్రపంచాన్ని చుట్టేశాయి. దేశంలో పెరిగిన సమాచార విప్లవంతో.. ప్రతి ఇంటికి… కాదుకాదు… ప్రతి వ్యక్తి చేతికి ఫోన్ అందుబాటులోకి వచ్చింది. పెరిగిన సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. మనదేశంలోనూ మొబైల్స్ పోటెత్తాయి. పిల్లలు, పెద్దలు, ఉన్నవాడు, లేనివాడన్న తేడాలేకుండా అందరికీ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొబల్స్ ప్రపంచ మార్కెట్‌లో భారత్ అగ్రస్థానంలో ఉంది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
మొబైల్ రంగంలో చైనా ఫోన్‌లదే హవా నడుస్తోంది. ముఖ్యంగా మార్కెట్‌లో టాప్‌సేల్స్‌లో ఉన్న డజన్‌కుపైగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చైనాకు చెందినవే. అయితే చైనాలో కరోనా వైరస్ పుట్టుకతో మొదలైన లాక్‌డౌన్… మొత్తం మొబైల్ మార్కెట్‌ను డీలాపడేసింది. నిత్యం కస్టమర్స్‌తో కళకళలాడే మొబైల్ మార్కెట్స్ ఇప్పుడు బోసి పోతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా చైనా నుంచి దిగుమతులు లేకుండా పోయాయి. మొబైల్ మార్కెట్‌గా అండగా ఉన్న హైదరాబాద్‌లోని జగదీష్ మార్కెట్‌లో ఇప్పుడు అమ్మకాలు తగ్గిపోయాయి. లాక్‌డౌన్‌కు ముందు జరిగిన అమ్మకాల్లో ఇప్పుడు 10 శాతం కూడా మొబైల్ అమ్మకాలు జరగడంలేదని వాపోతున్నారు.
అసలే లాక్‌డౌన్‌తో బిజినెస్‌లేని మొబైల్ మార్కెట్‌పై భారత్ -చైనా బోర్డర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పిడుగులా పడింది. సైనికుల మరణంతో దేశ వ్యాప్తంగా చైనాపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భారత మార్కెట్‌లో రాజ్యమేలుతోన్న చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిత్తులమారి డ్రాగన్‌కు గట్టిగా బుద్దిచెప్పాలంటే… ముందు చైనాకు ఆర్థికంగా ఆయువుపట్టుగా ఉన్న భారత మార్కెట్‌ను దూరం చేయాలని కోరుతున్నారు. చైనా వస్తువులకు వ్యతిరేకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయ్యింది. మరోవైపు ప్రజలు కూడా పెద్ద ఎత్తున చైనా వస్తువులకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. దీంతో ఇండియా మొబైల్ రంగంలో రాజ్యమేలుతోన్న చైనా మొబైల్ బ్రాండ్‌లపై తీవ్రప్రభావం చూపనుంది.
ప్రస్తుత స్మార్ట్ మొబైల్లో… యాపిల్, శాంసంగ్, ప్యానాసోనిక్ ఇలా ఓ నాలుగైదు కంపెనీలు మినహాయిస్తే.. మిగతావన్నీ చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్సే. చైనాకు చెందిన షియోమీ, ఎంఐ , రెడ్‌మీ, వన్‌ప్లస్, వివో, ఒప్పో, రియల్‌మీ, లెనోవా, మియాజు, కూల్‌ప్యాడ్ జోపో మొబైల్, డజనుకుపైగా చైనా కంపెనీల ఫోన్‌లో ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్‌లో టాప్‌ప్లేస్‌లో ఉన్నాయి. చైనా వస్తువుల బాయ్‌కాట్ మూవెంట్ సక్సెస్ అయితే మాత్రం చైనా మొబైల్స్ కంపెనీలకు గడ్డుపరిస్థితి తప్పదు.