అడిలైడ్ తొలి టెస్టు : 36 పరుగులకే కోహ్లీసేన ఆలౌట్..

Adelaide First Test- AUS vs India :అడిలైడ్ టెస్టులో టీమిండియా చెత్త ప్రదర్శనతో తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీసేన కుప్పకూలింది. 36 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ పేస్ దెబ్బకు భారత బ్యాట్స్ మెన్ చేతులేత్తేశారు. టెస్టుల్లో టీమిండియాకు ఇదే అత్యల్ప స్కోరు. ఆసీస్‌కు 90 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన నిర్దేశించింది.
కెప్టెన్ కోహ్లీ, పృథ్వీషా నాలుగు పరుగులకే పరిమితమం కాగా.. వచ్చినవారు వచ్చినట్టుగా ఆటగాళ్లంతా పెవిలియన్ చేరారు. రహానె, పుజారా డకౌట్ అయ్యారు. కనీసం రెండంకెల స్కోరు కూడా దాటలేదు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్, హేజల్ వుడ్ నిప్పులు చెలరేగి టీమిండియా పతనాన్ని శాసించారు. ప్రస్తుతానికి 89 పరుగుల లోపే టీమిండియా ఆధిక్యంలో ఉంది. ప్రత్యర్థి జట్టు ఆసీస్ కు 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆస్ట్రేలియా పేస్ దెబ్బకు భారత బ్యాట్స్ మెన్ ఒకరితరువాత మరొకరు వరుసగా పెవిలియన్ క్యూ కట్టేశారు. 19 పరుగులకే టీమిండియా 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద పృథ్వీ షా (4) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత బుమ్రా(2) తో రెండో వికెట్ కోల్పోయింది.
పుజారా(0), విరాట్ కోహ్లీ (4), మయాంక్(9), అజింక్య రహానె(0) వరసగా పెవిలియన్‌కు చేరారు. భారత్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం విరాట్ కోహ్లీ(4) ఒక బౌండరీ బాదగా చివరికి జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ తొలి ఓవర్ బౌలింగ్ నుంచి భారత వికెట్ల పతనం ఆరంభమైంది. కోహ్లీ కూడా చేతులేత్తేశాడు. అనంతరం వృద్ధిమాన్ సాహా (4) వెనుదిరిగాడు.
ఆ వెంటనే అశ్విన్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 21.2 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లు హాజిల్‌వుడ్ ఐదు వికెట్లు తీసుకున్నారు.