అరగంటలో స్పాట్‌లోనే కరోనా ఫలితం, వైరస్‌ ఇతరులకు వ్యాపించదు, త్వరలో అందుబాటులోకి కొత్త కిట్ 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా 11వేలకు పైగా పాజిటివ్

  • Published By: naveen ,Published On : June 16, 2020 / 03:07 AM IST
అరగంటలో స్పాట్‌లోనే కరోనా ఫలితం, వైరస్‌ ఇతరులకు వ్యాపించదు, త్వరలో అందుబాటులోకి కొత్త కిట్ 

Updated On : June 16, 2020 / 3:07 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా 11వేలకు పైగా పాజిటివ్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా 11వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలకు కొంత సమయం పడుతోంది. నమూనాలు సేకరించడం, వాటిని ల్యాబ్ కి పంపడం, అక్కడ టెస్టులు చేయడం.. ఇలా గంటల వ్యవధి తీసుకుంటోంది. అంతేకాదు ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్టీ-పీసీఆర్‌ పద్ధతిలో శాంపిల్‌ను సేకరించి ల్యాబ్‌కు తీసుకొచ్చే క్రమంలో మధ్యలో ఇతరులకు వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో మరింత వేగంగా నిర్ధారణ పరీక్షలు చేయగల, సురక్షితమైన కిట్లపై ఐసీఎంఆర్ ఫోకస్ పెట్టింది.

యాంటిజన్‌ ఆధారిత టెస్టింగ్ కిట్‌కు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్:
తక్కువ సమయంలో ఫలితం తేల్చే కిట్‌కు ఐసీఎంఆర్‌(భారతీయ వైద్య పరిశోధన మండలి) ఆమోదం తెలిపింది. అదే స్టాండర్డ్‌ క్యూ కోవిడ్-19 యాంటిజన్‌ డిటెక్షన్‌(antigen detection) కిట్. ఈ కిట్ తో చేసే పరీక్ష ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్‌టీ-పీసీఆర్‌(రివర్స్ ట్రాన్‌స్క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌) పద్ధతి ద్వారా పరీక్ష నిర్వహించడం, శాంపిల్‌ను ల్యాబ్‌కు తీసుకురావడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతుండడం, కేసుల సంఖ్య ఎక్కువవుతున్న తరుణంలో వేగంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

మేడిన్ సౌత్ కొరియా:
ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో వైరస్‌ను గుర్తించే వీలున్న దక్షిణ కొరియాకు చెందిన SD Biosensor కంపెనీ తయారు చేసిన స్టాండర్డ్‌ క్యూ కోవిడ్-19 యాంటిజన్‌ డిటెక్షన్‌ కిట్‌కు(Standard Q Covid-19 Antigen Detection Kit)ఐసీఎంఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కిట్‌పై తొలుత ఐసీఎంఆర్, ఎయిమ్స్‌లు సంయుక్తంగా పరిశీలన చేసిన తర్వాత దేశంలో వినియోగించేందుకు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ఐసీఎంఆర్‌ జూన్ 14న కిట్‌ వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కిట్ అందుబాటులోకి వస్తే కరోనా నిర్దారణ పరీక్షలకు అయ్యే ఖర్చు కూడా గణనీయంగా తగ్గతుందని అధికారులు తెలిపారు.

ల్యాబ్ కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందే వీలు లేదు:
* దేశంలో కరోనా వైరస్‌ పరీక్షను ఆర్టీ-పీసీఆర్‌ పద్ధతిలో నిర్ధారిస్తున్నారు. 
* ఈ పద్ధతిలో లక్షణాలున్న వ్యక్తి ముక్కు లేదా గొంతు నుంచి తెమడ ద్వారా శాంపిల్‌ను సేకరిస్తారు. 
* అలా సేకరించిన శాంపిల్‌ను ల్యాబ్‌కు తీసుకొచ్చిన తర్వాత పరీక్షలు చేసి వైరస్‌ను నిర్ధారిస్తారు. 
* శాంపిల్‌ కలెక్షన్‌ మొదలు ల్యాబ్‌కు తీసుకొచ్చే వరకు సగటున 5గంటల సమయం పడుతుంది. 
* అయితే తాజాగా అందుబాటులోకి రానున్న పరికరంతో కేవలం 30 నిమిషాల్లోనే పరీక్ష నిర్వహించి ఫలితం రాబట్టొచ్చు. 
* శాంపిల్‌ సేకరించిన తర్వాత అదే ప్రదేశంలో కిట్‌ ద్వారా పరీక్ష చేసి ఫలితం ప్రకటించవచ్చు. 
* శాంపిల్‌ను ల్యాబ్‌కు తీసుకురావాల్సిన పని లేదు. దీంతో సమయం కలిసి వస్తుంది. 
* ఈ పరీక్ష కోసం శాంపిల్‌ను తీసిన వెంటనే కిట్‌లో వేయడంతో వైరస్‌ నిర్వీర్యం అవుతుంది. 
* ఫలితంగా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందే వీలు లేదు. 
* ఆర్టీ-పీసీఆర్‌ పద్ధతిలో శాంపిల్‌ను సేకరించి ల్యాబ్‌కు తీసుకొచ్చే క్రమంలో మధ్యలో ఇతరులకు వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు:
తాజాగా ఐసీఎంఆర్‌ నిర్దేశించిన స్టాండర్డ్‌ క్యూ కోవిడ్-19 యాంటిజన్‌ డిటెక్షన్‌ కిట్‌ ద్వారా కంటైన్మెంట్‌ జోన్‌లో లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. వీరితో పాటు పాజిటివ్‌తో కాంటాక్ట్‌ అయిన వారిలో దీర్ఘకాలిక జబ్బులున్నవారు, పేషంట్లకు వైద్య సేవలు అందించే వైద్యులు, సిబ్బంది, గొంతు, ముక్కుకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేసే సహాయకులకు ఈ కిట్‌ను వినియోగించి పరీక్షలు చేయొచ్చు.

భారీగా తగ్గనున్న కరోనా పరీక్షల వ్యయం:
RT-PCR పద్ధతిలో చేసే కరోనా టెస్టుకు రూ.2,500 వరకు ఖర్చు అవుతోంది. సేకరించిన నమూనాలను ఓ ప్రత్యేక ద్రావకంలో భద్రపరచడం, రవాణ చార్జీలు అదనం. మొత్తంగా ఒక్కో కరోనా టెస్టుకు రూ.4,500 వరకు వ్యయం అవుతోంది. అయితే కొత్తగా వచ్చిన యాంటిజన్ బేస్డ్ కరోనా టెస్టింగ్ కిట్ తో కరోనా పరీక్షల వ్యయం భారీగా తగ్గనుంది. కేవలం రూ.500కే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయొచ్చని అధికారులు చెప్పారు. అంతేకాదు ఈ కిట్ పోర్టబుల్. ఎక్కడికి కావాలంటే అక్కడికి చేతిలో పట్టుకుని వెళ్లొచ్చు. అంటే కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడే టెస్టులు చేసి ఫలితాలు స్పాట్ లోనే ఇవ్వొచ్చన్నమాట. అంతేకాదు ఈ కిట్ల ద్వారా 99.3 నుంచి 100 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వస్తాయని నిర్ధారించారు.