Sheep Thinks A Dog: కుక్కలతో పెరిగిన గొర్రెపిల్ల.. చివరికి కుక్కలా మారిపోయింది!
కుక్కలు, పిల్లితో కలిసి పెరిగిన ఓ గొర్రె పిల్ల ఇప్పుడు తన గొర్రె లక్షణాలను మరచి కుక్కలా ప్రవర్తిస్తుందట. తన తల్లి దగ్గర తనని వదిలినా భయపడి దూరంగా వచ్చేస్తుందట. తినే తిండి నుండి కుక్కలా రాత్రి వేళల్లో కాపలా కాయడం వరకు కుక్క చేసే పనులన్నీ ఈ గొర్రె పిల్ల చేస్తుందట.

Sheep Thinks A Dog
Sheep Thinks A Dog: ఒకవ్యక్తితో కొద్ది రోజులు సావాసం చేస్తే వారి లక్షణాలు మనకి వచ్చేస్తాయని వింటుంటాం. అది మంచైనా చెడైనా ఎంతోకొంత మనపై ప్రభావితం చూపిస్తుందని దాని అర్ధం. ముఖ్యంగా చెడు సావాసాలు చేసే యువతీ యువకులను ఉద్దేశించి పెద్దవారు ఈ సామెత చెప్తుంటారు. అంటే ఈ సృష్టిలో ఒక జీవి మరొక జీవిని ప్రభావితం చేయడం అనేది సాధారణ విషయం. ఇది మనుషులలోనే కాదు పశువులు, జంతువులలో కూడా అప్పుడప్పుడు జరుగుతుండడం చూస్తుంటాం. ఏదైనా జంతువు మరో జంతువుతో కలిసి పెరిగితే తన లక్షణాలను మరచి తనతో పెరిగిన జంతువు లక్షణాలను అలవరుచుకుంటుంటాయి. అలానే మేక పాలు తాగిన పులి కూన సాధుజంతువుగా మారిపోవడం.. గోమాతతో స్నేహబంధం పెంచుకున్న పులి రోజూ రాత్రి వేళల్లో వచ్చి తనను చూసి వెళ్లడం వంటి కథనాలు గతంలో మనం చూసేఉన్నాం. ఇప్పుడు మీరు చదివే స్టోరీ కూడా అలాంటిదే.
కుక్కలు, పిల్లితో కలిసి పెరిగిన ఓ గొర్రె పిల్ల ఇప్పుడు తన గొర్రె లక్షణాలను మరచి కుక్కలా ప్రవర్తిస్తుందట. తన తల్లి దగ్గర తనని వదిలినా భయపడి దూరంగా వచ్చేస్తుందట. తినే తిండి నుండి కుక్కలా రాత్రి వేళల్లో కాపలా కాయడం వరకు కుక్క చేసే పనులన్నీ ఈ గొర్రె పిల్ల చేస్తుందట. యూకేలోని కుంబ్రియా నగరంలో గిల్లీ చిప్పెండేల్ అనే వ్యక్తి వద్ద వెయ్యికి పైగా గొర్రెలు, ఐదు కుక్కలు, ఒక పిల్లి ఉన్నాయట. సహజంగా గొర్రెల మందలో నుండి కొన్ని పిల్లలు దూరమవుతుంటాయి. యజమాని గిల్లీ వాటిని కొద్దిరోజులు కుక్కలు, పిల్లతో పాటు పెంచి మళ్ళీ తిరిగి గొర్రెల మందలో కలుపుతుంటారు. అలానే ఓ గొర్రె పిల్ల కూడా తల్లికి దూరమవగా గిల్లీ దాన్ని కుక్కలతో పాటు పెంచసాగింది. అయితే.. ఆ గొర్రె పిల్లకి రెండేళ్ల వయసు వచ్చేసరికి గొర్రెలా కాకుండా కుక్కలా ప్రవర్తించడం ఆ యజమానిని ఆశ్చర్యపోయేలా చేసిందట. చివరికి ఆ గొర్రె పిల్లని తన తల్లి దగ్గర వదిలి పెట్టినా మళ్ళీ తిరిగి ఆ కుక్కల వద్దకే వెళ్తుంది కానీ తనని తాను గొర్రెలా ఫీల్ అవడం లేదట.
దీంతో ఆ గొర్రెపిల్లకి టెక్సిల్ అని పేరు పెట్టిన ఆ యజమాని కుటుంబం ఓ పెంపుడు కుక్క మాదిరే ఆ గొర్రె పిల్లని ట్రీట్ చేస్తున్నారట. సహజంగా గొర్రెలు గడ్డి, ధాన్యం వంటివి తింటాయి. కానీ టెక్సిల్ మాత్రం వాటితో పాటు బిస్కెట్స్ కూడా తింటుంది. రాత్రి వేళల్లో కుక్కలతో కలిసి గొర్రెల ఫామ్ కు కాపలా కాస్తుంది. యజమాని గొర్రెల ఫామ్ లో పనిచేస్తుంటే కుక్కలతో పాటు టెక్సిల్ కూడా ఫామ్ మొత్తం రౌండ్స్ వేస్తుంది. కానీ గొర్రెల మందలో మాత్రం కలవనే కలవదు. యజమాని గిల్లీ టెక్సిల్ ను మందలో కలపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా అది వాటికి దూరంగా వెళ్లిపోతుందట. దీంతో ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా మానుకున్నారట. కుక్కలతో పాటు యజమాని గిల్లీ పిల్లలతో బాగా కలిసిపోయిన టెక్సిల్ ఇంట్లో వంటగది కూడా బెడ్ రూమ్ వరకు తెగ చక్కర్లు కొడుతూ అచ్చంగా ఓ పెంపుడు కుక్క మాదిరిగా మారిపోయిందట. గిల్లీ మనవరాళ్లు కూడా ఈ గొర్రెకి పెంపుడు కుక్క మాదిరే డ్రెస్సింగ్ చేయడం.. స్నానం చేయించడం చేసి తెగ మురిసిపోతున్నారట. తనని తాను గొర్రెగా మర్చిపోయి కుక్కలా ఊహించుకుంటున్న టెక్సిల్ దినచర్యను యజమాని గిల్లీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అవుతుంది.