కన్నతల్లి మృతదేహాన్ని పదేళ్లుగా ఫ్రీజర్‌లో దాచిన కూతురు, కారణం ఏంటంటే

mothers dead body in freezer for 10 years: మనిషి చనిపోయాక మృతదేహాన్ని ఏం చేస్తారు. దహనం చేస్తారు లేదా ఖననం చేస్తారు. అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతిమ వీడ్కోలు పలుకుతారు. ఇది కామన్. కానీ, ఓ కూతురు ఏం చేసిందో తెలుసా.. తన తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్ లో దాచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు ఇలా శవాన్ని ఫ్రీజర్ లో ఉంచింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఈ ఘటన జపాన్ లో జరిగింది.
టోక్యోలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 48 ఏళ్ల యుమి యోషినో అనే మహిళ మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లితో కలిసి నివసిస్తుంది. జనవరిలో రెంట్ కట్టలేదు. దీంతో ఖాళీ చేయాల్సిందిగా ఓనర్ ఆమెని ఆదేశించాడు. అయితే, ఓనర్ ఎంతచెప్పినా యోషినో వినిపించుకోలేదు. ఇంటిని వదిలి వెళ్లలేదు. దీంతో ఆమెపై ఓనర్ కి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఫ్రీజర్ లో మృతదేహాన్ని చూసి పోలీసులు, ఇంటి ఓనర్ విస్తుపోయారు. ఎందుకిలా చేశావని పోలీసులు ఆమెని అడిగారు. తన తల్లి చనిపోయాక ఆమెను విడిచి ఉండలేక పోయానని, అందుకే తనతోనే ఇలా ఫ్రీజర్ లో ఉంచుకున్నానని విచారణలో వెల్లడించింది. కాగా, మహిళ చనిపోయే నాటికి 60 ఏళ్ల వయసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రీజర్ లో దాచేందుకు యోషినో తన తల్లి మృతదేహాన్ని బెండ్ చేసింది. ఆ తర్వాత ఫ్రీజర్ లో ఉంచింది. ఈ ఘటన స్తానికులను కూడా విస్మయానికి గురి చేసింది. పోలీసులు యోషినోని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని అపార్ట్ మెంట్ నుంచి తరలించారు.