కల్లు దుకాణాలకు గ్రీన్ సిగ్నల్.. మద్యం అమ్మకాలకు నో పర్మిషన్

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 10:03 AM IST
కల్లు దుకాణాలకు గ్రీన్ సిగ్నల్.. మద్యం అమ్మకాలకు నో పర్మిషన్

Updated On : May 10, 2020 / 10:03 AM IST

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం షరతులతో కూడిన లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో అనేక రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. కానీ తొలి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు మద్యం అమ్మకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు. తాజాగా కేరళ ప్రభుత్వం కూడా కొన్ని లాక్ డౌన్ సడలింపులకు ఆమోదం తెలిపింది. 

దీనిలో భాగంగా కల్లు విక్రయాలకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 13వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కల్లు దుకాణాలపై ఎటువంటి పరిమితులు విధించలేదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని కల్లు దుకాణాలు తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. 

అయితే దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్, మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కల్లు గీత కార్మికులు, మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పట్లో మద్య దుకాణాలకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.