పురుషుల్లో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఇదే!

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 10:24 AM IST
పురుషుల్లో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఇదే!

Updated On : October 31, 2020 / 12:24 PM IST

మహిళల్లో కంటే పురుషుల్లోనే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువగా వస్తాయో ఓ యూరోపియన్ అధ్యయనం తేల్చేసింది. పురుషుల్లో కరోనా వైరస్ తీవ్రతకు గల కారణాలను వెల్లడించింది. అందులో పురుషుల్లోని రక్తంలో అత్యధిక స్థాయిలో ఎంజైమ్‌లు ఉండటమే ఇందుకు కారణమని గుర్తించింది. కొవిడ్-19 వైరస్ ఇన్ఫెక్షన్లకు మగవారే ఎందుకు ప్రభావితం అవుతారు అనేదానిపై అధ్యయనం వివరణ ఇచ్చింది. మగవారి జీవనశైలితో పాటు మహిళల్లో సాధారణంగా ఉండే అధిక రోగనిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు సాగాయి. 

పురుషుల్లో గుండె, కిడ్నీలు, ఇతర అవయవాల్లో Angiotensin-converting enzyme 2 (ACE2) అనే ఎంజైమ్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీని సాయంతోనే కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశిస్తున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన యూనివర్సిటీ మెడికల్ సెంటర్ (UMC) అధ్యయనంలో గుర్తించింది. ఈ ఎంజైమ్ మహిళల కంటే పురుషుల రక్తంలో అధికంగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలింది. అందువల్లే కరోనా వైరస్ ప్రభావం మగవారిలో అధికంగా ఉన్నట్లు విశ్లేషించారు. ఈ మేరకు అధ్యయనాన్ని యూరోపియన్ హార్ట్ జనరల్‌లో ప్రచురించారు. 

కొవిడ్-19తో మరణిస్తున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉండడంతో ఈ కోణంలోనూ అధ్యయనం చేయడంతో ఏసీఈ2 వల్లేనని గుర్తించామన్నారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటిస్, మూత్రపిండాల సంబంధిత వ్యాధిలో ఏసీఈ సాంధ్రతను నియంత్రించడానికి వాడే ACE ఇన్ హిబిటర్స్ లేదా Angiotensin రిసెప్టర్ బ్లాకర్లు (ARBs) అనే డ్రగ్స్‌.. కొవిడ్-19 రోగులకు ఇవ్వొచ్చని అధ్యయనంలో సూచించారు. తద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించొచ్చని అంచనా వేశారు. 

ACE2 ఎంజైమ్ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల్లో ఉంటుందని.. వీటికంటే కూడా పురుషుల వృషణాల్లో అధికంగా ఉంటుందని నెదర్లాండ్స్ లోని Groningenలో ఉన్న University Medical Center (UMC)కి చెందిన కార్డియాలజీ ప్రొఫెసర్ Adriaan Voors తెలిపారు. దీనివల్లే ఈ ఎంజైమ్ పురుషుల్లో అధికంగా ఉందని అంటున్నారు. కరోనా వైరస్ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణమవుతోందని వెల్లడించారు.

ఈ వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి కూడా ఈ ఎంజైమే కారణమవుతుందని తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. 11 యూరోపియన్ దేశాల నుంచి వేలాది మంది పురుషులు, మహిళల్లో 3,500 మందికిపైగా హార్ట్ ఫెయిలర్ పేషెంట్ల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో కూడా ACE2 ఎంజైమ్‌ పరిమాణాన్ని వూర్స్ బృందం నిశితంగా విశ్లేషించింది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరించడంతో ఇప్పటివరకూ 4 మిలియన్ల మంది బారినపడ్డారు. దాదాపు 2 లక్షల 77 వేల మంది మరణించినట్టు రాయిటర్స్ టాలీ పేర్కొంది. మహిళల్లో కంటే పురుషుల్లోనే తీవ్ర అనారోగ్య సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉందని, వారిలోని వ్యాధినిరోధకతను బట్టి తీవ్రతలో మార్పులు ఉంటాయని తెలిపింది. 

Read More:

అధిక బరువున్నవారే కరోనాతో ఎందుకు చనిపోతారంటే? 

కరోనావైరస్ కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.. కంటిలోని కణాలే ప్రధాన లక్ష్యమంటున్న సైంటిస్టులు