Narayan Das Narang: ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూత.. సంతాపం తెలుపుతున్న సెలెబ్రిటీలు

తెలుగు సినిమా ఇండస్ట్రలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ దాస్ నారంగ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు......

Narayan Das Narang: ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూత.. సంతాపం తెలుపుతున్న సెలెబ్రిటీలు

Noted Producer Narayana Das Narang Passes Away

Updated On : April 19, 2022 / 12:19 PM IST

Narayana Das Narang: తెలుగు సినిమా ఇండస్ట్రలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ దాస్ నారంగ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ స్టార్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అనారోగ్యం కారణంగా పరిస్థితి విషమించడంతో ఆయన మంగళవారం ఉదయం 9.04 గంటలకు కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నారాయణ దాస్ నారంగ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా.. కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఇద్దరూ కూడా నిర్మాతలుగా ఉండటం గమనార్హం.

నారాయణ దాస్ నారంగ్ పలు సక్సెస్‌ఫుల్ మూవీలను ప్రొడ్యూస్ చేశారు. అంతేగాక ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా కూడా చాలా చిత్రాలను రిలీజ్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా నారాయణ దాస్ నారంగ్ వ్యవహరిస్తున్నారు. కాగా ఏషియన్ గ్రూప్ అధినేతగా, గ్లోబల్ సినిమా స్థాపకుడిగా ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఆయన మరణవార్త గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన మృతిపై తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితరులు నారాయణ దాస్ నారంగ్ మృతిపై విచారం వ్యక్తం చేసి, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అయితే నారాయణ దాస్ నారంగ్ భౌతికకాయాన్ని ఆయన స్వగృహానికి తరలించి, ఈరోజు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నారాయణ దాస్ నారంగ్ పార్థివదేహానికి తమ నివాళులు అర్పించేందుకు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఇక నారాయణ దాస్ నారంగ్ మృతిపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ వాణిజ్య మండలి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.