రత్నం గారిని నాతో సినిమా చెయ్యమని అడిగాను.. పవన్ కళ్యాణ్..

రత్నం గారిని నాతో సినిమా చెయ్యమని అడిగాను.. పవన్ కళ్యాణ్..

Updated On : February 4, 2021 / 4:06 PM IST

A.M.Ratnam: ‘‘మనం ఇప్పుడు బహు బాషా చిత్రాలు.. పాన్ ఇండియా మూవీస్ అందిస్తున్నాం.. ఒక విధంగా ఇందుకు దశాబ్దానికి ముందే నాంది పలికిన నిర్మాత ఎ.ఎమ్.రత్నం గారు. తెలుగు, తమిళ భాషల్లో ఆయన నిర్మించిన చిత్రాలు హిందీ ప్రేక్షకులకు చేరువయ్యేలా.. ఏ భాష ప్రేక్షకులనైనా మెప్పించేలా ఉండేవి” అన్నారు ప్రముఖ కథానాయకులు, జనసేన అధ్యక్షులు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్.

‘భారతీయుడు’ సినిమాను ‘ఇండియన్’గా బాలీవుడ్‌లో విడుదల చేస్తే సంచలన విజయం సాధించి దక్షిణాది చిత్రాలు, మన దర్శకుల శైలి, మన స్టార్ హీరోల మార్కెట్ సత్తా గురించి అందరూ మాట్లాడుకున్నారు.. ఆ విధంగా తెలుగు, తమిళ చిత్రాల మార్కెట్ పరిధిని విస్తరింపచేయడంలో రత్నం గారి పాత్ర మరువలేనిది అన్నారు. గురువారం శ్రీ ఎ.ఎమ్.రత్నం జన్మదినం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్- రత్నం గారికి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.

AM Ratnam

ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు రత్నం గారితో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకొన్నారు… “ఎవరినీ కూడా నాతో సినిమా చేయమని అడగలేదు. నేను హీరోగా వచ్చిన తొలి రోజుల్లో ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగాను. ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రత్నం గారి బంధువు ఒకరు నాకు నెల్లూరులో సన్నిహిత మిత్రుడు. అలా రత్నం గారిని చెన్నైలో కలుస్తూ ఉండేవాణ్ణి. అప్పుడే అడిగాను. సినిమా చేయమని. నాకు మరచిపోలేని హిట్ ‘ఖుషీ’ ద్వారా ఆయన ఇచ్చారు.

సినిమా నిర్మాణంపట్ల ఆయనలో ఒక తపన కనిపిస్తుంది. సినిమా వ్యాపార విస్తృతి తెలిసిన నిర్మాత ఆయన. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి అందించడం ద్వారా మార్కెట్ పరిధి పెంచారు. ఆయన నిర్మించే చిత్రాల్లో ప్రేక్షకుల అభిరుచికి తగ్గ అన్ని అంశాలూ ఉంటాయి… అవి ఏ భాషవారికైనా నచ్చేలా ఉంటాయి. శ్రీ రత్నం గారు మరిన్ని విజయాలను అందుకోవాలి” అని ఆకాంక్షించారు.

AM Ratnam

ప్రస్తుతం ఎ.ఎమ్.రత్నం, క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ – రానాతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.