Telangana Inter Exams : నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి.. విద్యార్థులూ ఈ విషయాలు గుర్తుంచుకోండి..
Telangana Inter Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
Telangana Inter Exams
- నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు
- 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష
- ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
Telangana Inter Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read : TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఫోన్లోనే బస్ టికెట్ల బుకింగ్
నేడు ఫస్ట్ ఇయర్ పరీక్ష జరగనుండగా.. రేపటి నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9.97లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు 1,495 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు.
గతేడాది వరకు పరీక్ష సమయంలో ఒక నిమిషం నిబంధన వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక నిమిషం నిబంధనను తొలగించారు. దీంతో పరీక్ష సమయం పూర్తియిన తరువాత ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్షలు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులను 9.05 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. అయితే, విద్యార్థులు పరీక్ష కేంద్రానికి పరీక్ష ప్రారంభ సమయం కంటే అరగంట ముందే చేరుకునేలా ప్రణాళిక చేసుకోవాలని, ఆలస్యంగా వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు సూచించారు.
ఈసారి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరిగే ఛాన్స్ లేకుండా.. జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులు పూర్తి 3గంటలూ పరీక్షా కేంద్రాల్లోనే ఉండాల్సి ఉంటుంది. ముందే పరీక్ష పూర్తి చేసినా.. మధ్యాహ్నం 12గంటలు అయ్యే వరకు పరీక్షా కేంద్రంలోనే ఉండాల్సి ఉంటుంది.
మరోవైపు.. తెలంగాణ ఆర్టీసీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు అమ్మాయిలు ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. వారి హాల్ టికెట్ చూపిస్తే చాలు.. వారికి ఉచిత టికెట్ ఇస్తారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పరీక్షల సమయంలో బస్టాండ్స్ దగ్గరే కాకుండా, విద్యార్థులు ఎక్కడ ఆపినా బస్సులను ఆపాలని సూచించారు. మరోవైపు.. ఇంటర్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలు బాగా రాయాలని స్పెషల్ ట్వీట్ చేశారు.
మరోవైపు.. ఇంటర్ బోర్డు సమాధాన పత్రాల మూల్యాంకనం షెడ్యూల్ ను ప్రకటించింది. మార్చి 4వ తేదీ నుంచి సంస్కృతం పేపర్లు మూల్యాంకనం ప్రారంభమవుతుందని చెప్పారు. మార్చి 15వ తేదీ నుంచి మొదటి విడత, మార్చి 18వ తేదీ నుంచి రెండో విడత, మార్చి 20వ తేదీ నుంచి మూడో విడతలో పరీక్షా పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు చెప్పింది. ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను విడుదల చేయనున్నారు.
