TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఫోన్లోనే బస్ టికెట్ల బుకింగ్
ప్రయాణికులు దూర ప్రయాణాలు, ఇంటర్సిటీ బస్ టికెట్లను కూడా డిజిటల్‌గా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
TGSRTC Representative Image (Image Credit To Original Source)
TGSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం మరో సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రయాణికులు మీ సేవ మొబైల్ యాప్‌లో కూడా ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ యాప్ బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఆర్టీసీ బస్ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చామని, దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.
రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొత్త మీ సేవ మీ టికెట్ మొబైల్ యాప్‌ను సెక్రటేరియట్ లో ఆవిష్కరించారు. రవాణశాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ నాగిరెడ్డి, మీ సేవ కమిషనర్ రవికిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ ఓపీఆర్ఎస్ (OPRS) సేవలను కూడా అనుసంధానించారు. దీంతో ప్రయాణికులు దూర ప్రయాణాలు, ఇంటర్సిటీ బస్ టికెట్లను కూడా డిజిటల్‌గా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
యాప్ ద్వారా మొత్తం 1,710 OPRS సేవలు, 450 ఏసీ సేవలు, 1,260 నాన్ ఏసీ సేవలు, రోజువారీగా బుకింగ్ ఆయ్యే సీట్లు 13వేలు బుకింగ్ చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 5 రకాల బస్ పాస్‌లు పొందే సౌకర్యం ఈ యాప్ ద్వారా కల్పిస్తున్నారు.
