Oxygen Spray : మార్కెట్లోకి పాకెట్ ఫ్రెండ్లీ ఆక్సిజన్ స్ర్పే బాటిల్.. సృష్టికర్త ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్ధి
ఈ స్పిన్ నానోటెక్ ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన డాక్టర్ సందీప్ పాటిల్ దీనిని రూపొందించాడు. దీనికి అతను పెట్టిన పేరు ఆక్సిరైజ్. దీని ధర 499 రూపాయలుగా నిర్ణయించారు.

పాకెట్ ఫ్రెండ్లీ ఆక్సిజన్ స్ర్పే బాటిల్
Oxygen Spray : మనిషితోపాటు సృష్టిలోని సమస్త ప్రాణికోటి జీవించాలంటే ఆక్సిజన్ అవసరం ఎంతో ఉంది. ఒకప్పుడు ఆక్సిజన్ గురించి పెద్ద గా చర్చించేవారు. కాని కరోనా పుణ్యమా అంటూ ఆక్సిజన్ ప్రాధాన్యత, అవశ్యకత బాగా పెరిగింది. సరైన సమయంలో ఆక్సిజన్ అందక ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలా దేశాలు ఆక్సిజన్ కోసం పడని పాట్లులేవు. ప్రధానంగా భారత దేశంలో ఆక్సిజన్ కొరతతో చాలామంది మృత్యువాత పడ్డారు. అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు స్వచ్ఛంద సంస్ధలు భాగస్వాములయ్యాయి. విమానాల్లో సైతం ఆక్సిజన్ ను తరలించాల్సిన పరిస్ధితి తలెత్తింది.
ప్రస్తుతం కరోనా పరిస్ధితులు తగ్గుముఖం పట్టినా, కరోనా మూడోదశ భయం అందరిని వెంటాడుతూనే ఉంది. ఏ క్షణంలో థర్డ్ వేవ్ ముంచుకొస్తుందో అర్ధంకాక సతమతమౌతున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే వేవ్ ను ఎదుర్కొనేందుకు, ఆక్సిజన్ అందరికి అందించేందుకు ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి పాకెట్ ఫ్రెండ్లీ ఆక్సిజన్ కిట్ ను రూపొందించాడు. చేతిలో ఇమిడిపోయే సెంట్ బాటిల్ సైజులో ఉండే ఈ ఆక్సిజన్ బాటిల్ అత్యవసరసమయంలో బాగా ఉపయోగపడుతుంది. ఆకస్మాత్తుగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన సందర్భంలో ఆసుపత్రికి వెళ్ళేలోపు ఆక్సిజన్ షాట్స్ దీని ద్వారా అందించవచ్చు.
ఈ స్పిన్ నానోటెక్ ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన డాక్టర్ సందీప్ పాటిల్ దీనిని రూపొందించాడు. దీనికి అతను పెట్టిన పేరు ఆక్సిరైజ్. దీని ధర 499 రూపాయలుగా నిర్ణయించారు. దీనిని ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకునేందు అందుబాటులో ఉంచాడు. నోట్లో స్ర్పే చేసుకుంటే ఆక్సిజన్ విడుదలౌతుంది. సందీప్ దీనిని కంపెనీ వెబ్ సైట్ swasa.inలో విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం రోజుకు వెయ్యి బాటిల్స్ తయారవుతుండగా రానున్న రోజుల్లో దీనిని ఉత్పత్తిని మరింత రెట్టింపు చేయనున్నారు. థర్డ్ వేవ్ వచ్చేలోగా దీనిని క్షేత్రస్ధాయిలోకి తీసుకువెళితే బాధితులకు ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆలోచనతో సందీప్ ఉన్నాడు.
ఆక్సిరైజ్ బాటిల్ కోవిడ్ బాధితులకు అత్యవసర సమయాల్లో బాగా ఉపయోగపడుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. మాస్కు, శానిటైజర్ తోపాటు, ఆక్సిరైజ్ బాటిల్ ను కూడా వెంట ఉంచుకుంటే మంచిదని అంటున్నారు. 10లీటర్ల ఆక్సిజన్ వాయువును నిల్వచేసే సామర్ధ్యం ఇది కలిగి ఉండటంతో అత్యవసరసమయంలో దీనిని ఉపయోగించుకునేందుకు వీలుంటుంది.