Passenger Ship Services : చెన్నై నుండి నాలుగు ప్రాంతాలకు త్వరలో అందుబాటులోకి నౌకాయానం

ప్రజారవాణాలో నౌకాయానం కీలక భూమిక పోషించేలా కేరళ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.

Passenger Ship Services : చెన్నై నుండి నాలుగు ప్రాంతాలకు త్వరలో అందుబాటులోకి నౌకాయానం

Ship

Updated On : July 20, 2021 / 11:16 AM IST

Passenger Ship Services : వాయుకాలుష్య నివారణకు తీర ప్రాంత రాష్ట్రాలు జలరవాణా వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే కేరళ రాష్ట్రం ఆదిశగా చర్యలు చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తుండగా, తాజా తమిళనాడు రాష్ట్రం జలరవాణా వైపు అడుగులు వేస్తుంది. రోడ్డు మార్గం వినియోగం ద్వారా వాహనాల సంఖ్య పెరిగి గాలిలో కాలుష్య ఉద్గారాల శాతం పెరిగిపోతుంది. ఈ నేపధ్యంలో చెన్నై నుండి నాలుగు ప్రాంతాలకు నౌకాయానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్టాలిన్ సర్కారు ఏర్పాట్లు చేస్తుంది.

చెన్నై నుండి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు తొలి విడతగా నౌకాయాన ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. నౌకాయాన రవాణాకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. చెన్నై నుండి కడలూరు, నగపట్టణం, పుదుచ్ఛేరి, కారైక్కాల్ ప్రాంతాలకు నౌకల ద్వారా ప్రజా రవాణాకు శ్రీకారం చుట్టనున్నారు.

ప్రజారవాణాలో నౌకాయానం కీలక భూమిక పోషించేలా కేరళ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. నౌకయానం ద్వారా ప్రజా రవాణాను ప్రోత్సహించటం వల్ల రోడ్డు రవాణాలో చాలా మేర రద్దీని తగ్గించగలగటంతోపాటు, వాయు కాలుష్య నివారణకు ఇది దోహద పడింది. బ్రిటీష్ హయాంలో సముద్రం తీరం వెంబడి రాష్ట్రాలైన గుజరాత్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఒరిస్సా జలరవాణాపైనే ఎక్కవగా అధారపడేవారు. అయితే ఆతరువాత కాలంలో అది కనుమరుగైంది. జలరవాణా సాధనాన్ని సరుకు రవాణా కోసం మాత్రమే పరిమితం చేశారు.

ప్రజా రవాణా వ్యవస్ధలో నౌకాయానాన్ని కీలకంగా మార్చటం ద్వారా ఆర్ధికంగా లబ్ధిపొందే ప్రణాళికలను తమిళనాడు ప్రభుత్వం రూపొందిస్తుంది. నౌకాయానం వినియోగించుకోవటం ద్వారా పర్యాటక ప్రాంతాలకు విదేశీ, స్వదేశీ ప్రయాణికులను ఆకట్టుకోవచ్చన్న అంచనాతో ఉన్నారు. ఇది సత్ఫలితాలనిస్తే రానున్న రోజుల్లో చెన్నై నుండి ఇతర రాష్ట్రాలకు నౌకాయానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. దీనితోపాటు శ్రీలంకలోని గాంగేశన్ హార్బర్ కు సరుకు రవాణా ప్రారంభించాలన్న యోచనలో స్టాలిన్ సర్కారు ఉంది.