Student Beats Teacher : OMG.. అరిచాడని, టీచర్‌నే కిందపడేసి కొట్టిన విద్యార్థి
పుస్తకాలు ఎందుకు తెచ్చుకోలేదని అరిచిన టీచర్ ను పదో తరగతి విద్యార్థి కొట్టడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో బృందావన్ లో చోటు చేసుకుంది.

Student Beats Teacher : గురువంటే దైవంతో సమానం అంటారు. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుదే. ఒక వ్యక్తి పురోగతికి గురువు మార్గదర్శనం తప్పనిసరి. విద్యార్థులకు పాఠాలు బోధించి వారు సన్మార్గంలో వెళ్లేలా తీర్చిదిద్దేది గురువే. అలాంటి గురువు పట్ల ఓ విద్యార్థి ప్రవర్తించిన తీరు చర్చకు దారితీసింది. పుస్తకాలు ఎందుకు తెచ్చుకోలేదని అరిచాడని.. ఏకంగా టీచర్ నే కొట్టాడో స్టూడెంట్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో బృందావన్ లో చోటు చేసుకుంది.
స్కూల్ కి పుస్తకాలు ఎందుకు తెచ్చుకోలేదని పదో తరగతి విద్యార్థిని లెక్కల మాస్టార్ మందలించాడు. క్లాస్ రూమ్ కి పుస్తకాలు లేకుండా రావడం ఏంటని నిలదీశాడు. తన క్లాస్ నుంచి బయటకు వెళ్లిపోవాలన్నాడు. దీంతో ఆ విద్యార్థి తన బ్యాగ్ తీసుకుని బయటకు కదిలాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
అదే సమయంలో టీచర్.. విద్యార్థిపై ఓ దెబ్బ వేశాడు. అంతే, ఆ కుర్రాడు కోపంతో ఊగిపోయాడు. నన్నే తిడతావా? నన్నే కొడతావా? అంటూ ఏకంగా టీచర్ పై దాడి చేశాడు. విద్యార్థులందరి ముందు లెక్కల మాస్టార్ ని క్లాస్ రూమ్ లోనే కొట్టాడు. టీచర్ కాలర్ పట్టుకుని బెంచిపై పడేశాడు. ఇది చూసిన మిగిలిన విద్యార్థులు షాక్ తిన్నారు. వెంటనే పరుగున వెళ్లి వారిని విడదీశారు. కాగా, టీచర్ పై దాడి చేసిన పదో తరగతి విద్యార్థి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.