రోడ్డుపై ఆకుకూరలు అమ్ముకుంటున్న ఏకగ్రీవంగా ఎన్నికైన మహిళా సర్పంచ్‌

రోడ్డుపై ఆకుకూరలు అమ్ముకుంటున్న ఏకగ్రీవంగా ఎన్నికైన మహిళా సర్పంచ్‌

Updated On : February 5, 2021 / 4:15 PM IST

tribal woman Sarpanch sales vegetables : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం లక్షల రూపాయలు గుమ్మరించి ఖర్చు చేస్తున్నారు. కానీ పదవి వచ్చిన తరువాత కాంట్రాక్టులు అవీ ఇవీ అంటూ పంచాయతీ నిధులన్నీ స్వాహా చేస్తుంటారు. గ్రామ అభివృద్ధి పేరుతో సొమ్ములన్నీ కాజేస్తుంటారు. పంచాయతీ ప్రెసిడెంట్ పదవితో ఏకంగా కోట్లకే పడగలెత్తుతున్నారు చాలామంది. కానీ ఓ పంచాయతీయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన ఓ మహిళ మాత్రం తన కుటుంబాన్ని పోషించుకోవటానికి రోడ్డు పక్క ఆకుకూరలు అమ్ముకుంటోంది.

మహబూబాబాద్‌ జిల్లా రేగడి తండా గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ గుగులోతు లక్ష్మీ రామచంద్రు. పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన లక్ష్మీ ఇప్పుడు ఆకుకూరలు అమ్ముకుంటు కుటుంబాన్ని పోషించుకుంటోంది. తన కుటుంబానికి ఉన్న కొద్దిపాటి భూమిలో కష్టపడి ఆకు కూరలు పండించి వాటిని ప్రతీరోజు ఉదయం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు వాటిని తీసుకొచ్చి అమ్ముకుంటోంది.

పంచాయతీ ప్రెసిడెంట్ అయి ఉండీ ..అదేంటనీ అడిగితే లక్ష్మీ చిరునవ్వు నవ్వుతుంది. ఊరికి పెద్ద అయితే ఏంటీ..కష్టపడి పనిచేసుకోవటంలో తప్పేంటీ అని ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ గా అందుకునే అరకొర జీతం నా బండి పెట్రోల్‌ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. ఇక నా కుటుంబాన్ని ఏం పెట్టి పోషించుకోవాలి? అందుకే మన పని మనం చేసుకుంటే తప్పేముందని చెబుతుంది లక్ష్మి.

పంచాయతీ వార్డు మెంబర్లే ఏదో కార్పొరేట్లలా బిల్డప్ ఇస్తున్న ఈరోజుల్లో తన కుటుంబం కోసం ప్రతీరోజు ఆకు కూరలు అమ్ముకుంటున్న లక్ష్మి నిజంగా ఆదర్శవంతమైన మహిళ అనటంలో సందేహం లేదు. అలాగే పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల్ని ప్రభుత్వం సక్రమంగా అందించాల్సిన బాధ్యతా..గ్రామాల అభివృద్ధి కోసం ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారు? అని చూడాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉందనే విషయాన్ని గుర్తెరిగితే మంచిది. అలా జరిగినప్పుడే బాపూజీ కలలు కన్న గ్రామాలు అభివృద్ధి జరుగుతుంది.