పిడుగులు పడి 20 మంది మృతి, ఢిల్లీ, ముంబైలో భారీ వర్షాలు

  • Published By: madhu ,Published On : July 5, 2020 / 09:47 AM IST
పిడుగులు పడి 20 మంది మృతి, ఢిల్లీ, ముంబైలో భారీ వర్షాలు

Updated On : July 5, 2020 / 9:53 AM IST

ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో భోజ్‌పూర్‌ జిల్లాకు చెందినవారు తొమ్మిది మంది ఉండగా, శరన్‌ జిల్లాలో ఐదుగురు, కైమూర్‌లో ముగ్గురు, పట్నాలో ఇద్దరు, బక్సార్‌ జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారని యూపీ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.

మృతుల కుటుంబాలకు యూపీ సర్కార్ ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం చొప్పున ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాలు పడుతున్నప్పుడు బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణ విభాగం సలహాలను పాటించాలని సూచించారు. రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు యూపీలో పిడుగుపాటుకు 130 మంది మరణించారు.

మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. ముంబైలో ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీటి మునిగిపోయాయి. ముంబైలోని హిండ్‌మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సియాన్ వంటి పలు ప్రాంతాలు అడుగు నుంచి రెండడుగుల వరకు నీరు నిలిచిపోయింది. శాంతాక్రుజ్, గొరెగావ్, మలద్, కాండివలి, బోరివలి, ఇతర పశ్చిమ ప్రాంత శివార్లలో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి.

భారీ వర్షాలతో జన జీవనం స్తంభించిపోవడంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. వర్షాలతో విరిగిపడిన చెట్లను రహదారులపై నుంచి తొలగిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీతోపాటు, ఎన్‌సీఆర్‌ పరిధిలోని చాలా ప్రాంతాల్లో గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు భారీ వర్షాలు కురవచ్చని అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాలైన హన్సీ, హిస్సార్‌, రోహ్‌తక్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌, బులంద్‌షహర్‌, పానిపట్‌, ముజఫర్‌నగర్‌, మహేందర్‌గఢ్‌, గురుగ్రామ్‌ మానెసర్‌, రెవారీ, నార్నాల్‌, మీరట్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.