Tirupati By Election: పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!

Tirupati By Election: పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!

Tirupati By Election

Updated On : April 17, 2021 / 12:13 PM IST

Tirupati By Election: సహజంగానే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు సహజం. కానీ.. అసలే జరిగేది బై ఎలక్షన్. ఒకరికి గెలుపు అవసరమైతే మరొకరికి ఉనికి అవసరం. మధ్యలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి కాస్త చోటు దక్కదా అని ఎదురుచూపులు. వీటన్నటికి వేదికైంది తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న బై ఎలక్షన్. మొన్నటివరకు జరిగిన ఎన్నికల ప్రచారంలోనే మాటల యుద్దాన్ని తలపించిన ఈ ఉప ఎన్నిక ఇప్పుడు అంతకు మించి ఒకరిపై మరొకరు మాటల దాడిని తలపిస్తుంది. ఒకవైపు ఎన్నికలు జరుగుతూండగానే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగనోట్లు వేసేందుకు అధికార వైసీపీ నేతలు ప్రయత్నించారని ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర విమర్శలకు దిగారు. బీజేపీ నేతలు కూడా ఇదే వాదనకు దిగగా స్థానికంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 5 వేల మంది వైసీపీ మద్దతు దారులు పిఎల్ఆర్‌ క‌ళ్యాణ‌మండపంలో మ‌కాం వేసి దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తుంటే టిడిపి నాయ‌కులు అడ్డుకున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదే విషయంపై పూతలపట్టు నాయుడుపేట హైవేపైమల్లవరం జంక్షన్ నందు టిడిపి నాయకుల నిరసనకు దిగారు. దొంగనోట్లు వేసేందుకు వైసీపీ నేతలు తిరుపతి పార్లమెంటు చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి బస్సుల్లో, లారీల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు.

ఇక ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలకు దిగారు. పెద్దిరెడ్డి పుంగనూరు వీరప్పన్ అని.. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్లే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరప్పన్ ఎర్రచందనం దుంగలు దొంగిలిస్తే.. ఈ పుంగనూరు వీరప్పన్ దొంగనోట్ల మాఫియాకు తెరలేపారని దుయ్యబట్టారు. దొంగనోట్ల వెనుక స్వయంగా పెద్దిరెడ్డి ఉండి నడిపిస్తున్నారని విమర్శలకు దిగారు. బయట నుండి మనుషులను బస్సుల్లో, లారీల్లో తరలించి దొంగనోట్లు వేయిస్తున్నా ఎన్నికల సంఘం స్పందించకపోవడం దారుణమని లోకేష్ విమర్శించారు.