Today HeadLines : సోనియా, చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల

వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారని విరుచుకుపడ్డారు. సోనియా, చంద్రబాబు కలిసి జగన్ ను జైలుకు పంపారని అన్నారు.

Today HeadLines : సోనియా, చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల

11PM Headlines

సోనియా, చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్ అయ్యారు. సోనియా, చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అన్నారు. వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారని విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ ను తిట్టిన షర్మిల తన పార్టీని అందులోనే విలీనం చేశారని మండిపడ్డారు. సోనియా, చంద్రబాబు కలిసి జగన్ ను జైలుకు పంపారని అన్నారు. షర్మిల కొడుకు నిశ్చితార్ధానికి వెళితే జగన్ కు మర్యాద ఇవ్వలేదన్నారు.

అందుకే.. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడారు
లక్షల కోట్ల సంపద దోచుకున్న బీఆర్ఎస్ కు దిమ్మతిరిగే జవాబు చెబుతామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారు ఉండాలనే ఉద్దేశంతోనే ధర్నా చౌక్ ను తెరిపించామని తెలిపారు.

మళ్లీ అక్కడి నుంచే పోటీ చేయనున్న రాహుల్‌ గాంధీ
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం నుంచే పోటీ చేస్తారని ఎంపీ కె.మురళీధరన్ అన్నారు. ఇప్పటివరకు ఉన్న వివరాల ప్రకారం ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. ఇందులో ఎటువంటి మార్పులూ ఉండకపోవచ్చని తెలిపారు.

చంద్రబాబు విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌ను ఎలా రక్షించుకోవాలో చెప్పడానికే తాను ఇవాళ ఉరవకొండకు వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. రా.. కదలిరా.. బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ-జనసేన గాలి వీస్తోందని అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో గెలుస్తామని చెప్పారు. ఓటమి ఖాయమని తెలిసే సీఎం జగన్‌ మాటల్లో తేడా వచ్చిందని అన్నారు. అందుకే ఆయన సీఎం పదవి నుంచి హ్యాపీగా దిగిపోతానని అన్నారని చెప్పారు.

ఇండియా కూటమిలో చివరకు మిగిలేది ఆయనే..
ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిలో చివరికు మిగిలేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్కరేనంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ తిరుగుతున్నారని, కాంగ్రెస్ మిత్రపక్షాలేమో రాహుల్ ఛోడో అని వదిలి వెళుతున్నాయంటూ చురకలంటించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ బహిరంగ సభ..
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. విశాఖ జిల్లా భీమిలిలో జగన్ పర్యటించారు. ఉత్తరాంధ్ర రీజియన్ వైసీపీ బహిరంగసభలో జగన్ పాల్గొని ప్రసంగించారు. పార్టీ శ్రేణులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. బిహార్‌లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకునే యత్నంలో సీఎం నితీశ్ కుమార్ ఉన్నారు. దీంతో బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కార్యాలయంలో చర్చలు జరుగుతున్నాయి.

పోట్తెత్తిన భక్తులు ..
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం కావడం, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. అంజన్న దర్శనానికి గంటకుపైగా సమయం పడుతుంది. వందలాది వాహనాలతో ఘాటు రోడ్డు, ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. మేడారం జాతరకు ముందు అంజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

బిహార్ పరిణామాలపై చర్చ
ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. బిహార్ రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. బిహార్ లో జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు, జేడీయుతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం వంటి అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. బిహార్ లో ప్రభుత్వ ఏర్పాటు.. బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై బీజేపీ అగ్రనేతల చర్చలు జరుపుతున్నారు. సమావేశంలో పాల్గొన్న జేపీ నడ్డా, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నాురు.

టీమిండియా ఆలౌట్ ..
ఇండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 436 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే జడేజా (87) ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన బుమ్రా వెంటనే ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి సిరాజ్ వచ్చాడు. అయితే, 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 436 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తొలి ఇన్నింగ్స్ లో భారత్ 190 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఉస్మానియా లేడీస్ హాస్టల్ లో కలకలం..
హైదరాబాద్ లోని ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ లోకి ముగ్గురు వ్యక్తులు వెళ్లడం కలకలం రేపింది. హాస్టల్ బాత్రూమ్ లోకి ఇద్దరు దండుగులు చొరబడ్డారు. తమకు రక్షణ లేదంటూ విద్యార్థినులు కళాశాల గేట్లు మూసేసి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడ చేరుకొని వారిని వారించే ప్రయత్నం చేశారు. విద్యార్థునులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి గోడదూకి హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడ్డారు. అయితే, పోలీసులు ఒక దుండగుడిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

తిరుమల సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటల సమయం పట్టనుంది. నిన్న (శుక్రవారం) శ్రీవారిని 71,664 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.37కోట్లు సమకూరింది.

ధరణి కమిటీ సమావేశం..
ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానుంది. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకానున్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొన్ని వివరాలు సేకరించిన కమిటీ.. రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా అటవీ భూములు, సరిహద్దులకు సంబంధించి ధరణిలో ఉన్న వివరాలు, పోర్టల్‌తో కలిగిన ప్రయోజనం, లోపాలు ఏవైనా ఉన్నాయా? వంటి వివరాలను కమిటీ చర్చించనున్నది.