ఇకపై జొమాటోలో మద్యం హోం డెలివరీ!

  • Published By: srihari ,Published On : May 7, 2020 / 02:41 AM IST
ఇకపై జొమాటోలో మద్యం హోం డెలివరీ!

Updated On : May 7, 2020 / 2:41 AM IST

ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఆల్కహాల్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో లాక్ డౌన్ అవసరాలకు తగినట్టుగా జొమాటో లిక్కర్ డెలివరీకి బ్రాంచ్ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. మద్యానికి గిరాకీ ఉండటం, భౌతిక దూరాన్ని పాటించాలనే నిబంధనల నేపథ్యంలో మద్యాన్ని హోం డెలివరీ చేస్తే ఎలా ఉంటుంది అనేదానిపై ఫుడ్ డెలివరీ కంపనీ కసరత్తు చేస్తోందని రాయిటర్స్ రిపోర్టు తెలిపింది. దీని ప్రకారం.. ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో మద్యం పంపిణీ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని రెస్టారెంట్లను మూసివేసినందున జోమాటో ఇప్పటికే కిరాణా డెలివరీలపై దృష్టిపెట్టింది. 

కరోనా భయంతో ప్రజలు ఔట్ సైడ్ ఫుడ్  ఆర్డర్ చేయడానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. మార్చి 25న దేశవ్యాప్తంగా మూసివేసిన ఆల్కహాల్ షాపులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొన్ని నగరాల్లోని కొన్ని ఔట్‌లెట్‌ల వెలుపల వందలాది మంది మద్యం షాపుల దగ్గర క్యూల్లో నిలబడుతున్నారు. భారీగా క్యూల్లో నిలబడటాన్ని నియంత్రించేందుకు న్యూఢిల్లీ అధికారులు రిటైల్ ఆల్కహాల్ ధరల పైన 70 శాతం ‘స్పెషల్ కరోనా ఫీజు’ను ప్రవేశపెట్టారు. మరోవైపు ముంబైలో మాత్రం మద్యం దుకాణాలను తిరిగి తెరిచిన రెండు రోజుల్లోనే మూతపడ్డాయి. 

భారతదేశంలో ఆల్కహాల్‌ను హోం డెలివరీ చేయడానికి ప్రసుత్తం ఎలాంటి చట్టపరమైన నిబంధనలు లేవు. పారిశ్రామిక విభాగమైన International Spirits and Wines Association of India (ISWAI) జోమాటో ఇతరులతో కలిసి ఆల్కహాల్ హోండెలివరీకి సంబంధించి పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. మద్యం సేవించడానికి చట్టబద్దమైన వయస్సు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. 18 నుండి 25 సంవత్సరాల మధ్య తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మద్యం కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంటుంది.

ఈ నేపథ్యంలో జోమాటో కొవిడ్-19 ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాలను మాత్రమే హోం డెలివరీ చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు గుప్తా ఏప్రిల్ మధ్యలో ISWAIకి ఒక పత్రాన్ని సమర్పించినట్టు రాయిటర్స్ పేర్కొంది. దీనికి సంబంధించి జోమాటా నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధనా బృందం IWSR Drinks Market Analysis తాజా గణాంకాల ప్రకారం.. భారతదేశ ఆల్కహాల్ డ్రింక్స్ మార్కెట్ 2018లో దాదాపు విలువ 27.2 బిలియన్ డాలర్లు వరకు ఉంది. 

Also Read | రాష్ట్రంలో మద్యం హోం డెలివరీ.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?