ధారవిలో వైరస్‌ విస్ఫోటం తప్పదా? మురికివాడపై కరోనాకు కన్ను కుట్టిందా?

  • Published By: sreehari ,Published On : April 4, 2020 / 11:18 AM IST
ధారవిలో వైరస్‌ విస్ఫోటం తప్పదా? మురికివాడపై కరోనాకు కన్ను కుట్టిందా?

Updated On : April 4, 2020 / 11:18 AM IST

ధారవి.. ముంబైలోని ఓ మురికివాడ…. అలా అని అదేదో చిన్న ప్రాంతంలా ఉందనుకుంటే పొరపాటే.. పది లక్షల మంది ఆవాసం ఉండే ప్రాంతం.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అక్కడ అలజడి రేగుతోంది. ఇరుకుగా ఉండే ఆ ప్రాంతంలో కరోనా వైరస్‌ బద్దలైంది. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఏమాత్రం తేడా వచ్చినా వైరస్‌ విస్ఫోటం తప్పదా?

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడలోకి కరోనా వైరస్ ప్రవేశించింది. ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే దాదాపు పది లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ధారావిలో వైరస్‌ వ్యాప్తి చెంది అక్కడుంటున్న ఓ వ్యక్తి చనిపోవడంతో మిగతా వారంతా భయాందోళన చెందుతున్నారు. ధారావి అంటేనే ఇరుకు సందులు.. మరింతగా ఇరుకుగా ఉండే గుడిసెలు.. ఇళ్లు.. మరి ఇలాంటి ప్రాంతంలో కరోనా బయటపడిందంటే పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పది లక్షల మందిలో ఎంత మందికి ఈ వైరస్‌ సోకిందో? ఏం కాబోతుందోనన్న భయం అక్కడ కనిపిస్తోంది.

10లక్షల మందిలో ఎంతమందికి సోకిందో?
ధారావి.. ఒక మురికివాడగా చాలా మందికి తెలిసిందే. కానీ, అక్కడ పదిలక్షల మంది వరకూ జీవనం సాగిస్తున్నారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ మురికివాడ చాలా పాపులర్‌ అయ్యింది. మన దేశానికి వచ్చిన విదేశీ టూరిస్టులు ఎవరూ తాజ్‌మహల్ చూడకుండా వెళ్లరు. తాజ్ మహల్ బ్యాక్డ్రా ప్‌లో తప్పనిసరిగా ఓ ఫొటో తీసుకుంటారు. ఇండియన్ టూరిజానికి తాజ్‌మహల్ ఒక ఐకాన్‌గా నిలిచింది. అలాంటి తాజ్‌మహల్‌కు పోటీ ఇస్తోంది ధారావి మురికివాడ. ముంబై నగరంలోని ఈ మురికివాడను చూసేందుకు ఇండియా వచ్చిన టూరిస్టులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తేలింది. తాజ్‌మహల్‌ కంటే దీనిని చూసేందుకు మక్కువ చూపిస్తున్నారు.

593 ఎకరాల్లో విస్తరించి ధారావి స్లమ్‌ :
ముంబై నగరంలో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతుండటంతో పేదవారే కాదు మధ్య తరగతికి చెందిన చాలా మంది ఇక్కడకు వలస వచ్చారు. ఇక్కడ ప్రజలు దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకుంటున్నా అక్కడ కనీస వసతుల గురించి ఎవరూ ఆలోచించలేదు. దీంతో ధారావి ప్రాంతం 1947 నాటికే దేశంలోనే అతి పెద్ద మురికివాడగా మారింది. ఎటు చూసినా కిటకిటలాడుతున్న జనం. నడవడానికి వీల్లేని ఇరుకు రోడ్లు. కాస్తంత జాగా కనిపిస్తే ఇళ్ల నిర్మాణం మొదలైంది. నియమాలు, నిబంధనలు ఏమీ ఉండవు. అడిగే వాళ్లే లేరు. ఓ పద్ధతీ పాడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇళ్లు కట్టేశారు.

చిన్నపాటి ఇంట్లో పాతిక మంది దాకా సర్దుకోవాల్సిన పరిస్థితులు. ఇళ్లైతే కట్టారు కానీ కనీస వసతులను ఏమాత్రం పట్టించుకోలేదు. ధారావిలోని మెజారిటీ ఇళ్లల్లో టాయిలెట్ సౌకర్యం అనేదే ఉండదు. పబ్లిక్ టాయిలెట్స్‌పై ఆధారపడటాన్ని జనం అలవాటు చేసుకున్నారు. దీంతో చాలాసార్లు అంటువ్యాధులు విజృంభించాయి. చాలా మంది మృత్యవాత పడ్డారు. ఇప్పుడు అక్కడ కరోనా వైరస్‌ ప్రవేశించింది. ప్రజలను కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా లక్షల మంది ప్రమాదంలో చిక్కుకోవడం ఖాయం. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం ఉపక్రమించింది.

Also Read | క్యూబా ఫార్మూలా ఇదే : ప్రాణాలు తీసే ఆయుధాల కంటే.. ప్రాణం పోసే వైద్యమే ముఖ్యం!