Hourse Gram : ఆరోగ్యానికి మేలు చేసే ఉలవలు

ఉలవల కషాయం తీసుకుంటే దగ్గు, ఉబ్బసం క్రమేపి తగ్గుతాయి. జ్వరంతో ఇబ్బంది పడుతున్నవారు ఉలవల కషాయంతో తయారుచేసుకున్న పెసరకట్టును కలిపి తీసుకోవాలి.

Hourse Gram : ఆరోగ్యానికి మేలు చేసే ఉలవలు

Kulthi Dal

Updated On : January 12, 2022 / 5:31 PM IST

ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పూర్వ కాలం నుండి మన పెద్దలు ఉలవల్ని ఆహారంలో బాగం చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత మారిన జీవన విధానంలో ఉలవల్ని ఆహారంగా తీసుకునే వారే కరువయ్యారు. ఉలవల్లో అనేక పోషకాలు ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. ఉలవల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు మంచి పోషకాహారం. ఇందులో ఐరన్ తోపాటు ఖనిజపదార్ధాలు అధికంగా ఉంటాయి.

స్ధూలకాయం ; ఉలవలను ఆహారంలో బాగం చేసుకుంటే స్ధూలకాయం తగ్గుతుంది. ఒక కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్ళు కలిపి కుక్కర్ లో ఉడికించాలి. ఇలా తయారైన ఉలవకట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే సన్నగా నాజుగ్గా మారతారు. శరీరంలో మంట అనిపిస్తే మజ్జిగ తీసుకోవటం మర్చిపోవద్దు.

లైంగికశక్తి ; ఉలవలను , కొత్త బియ్యానీ సమంగా తీసుకొని జావలాగా తయారుచేసి పాలతో కలపి కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి పెరుగుతుంది. దీనిని ఉపయోగించే సమయంలో మలబద్దకం లేకుండా చూసుకోవాలి.

కాళ్లు, చేతుల్లో వాపులకు ; ఉలవలను ఒక పిడెకెడు తీసుకుని పెనం పై వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకుంటే కాళ్ళు, చేతుల వాపులు, నొప్పులు తగ్గిపోతాయి.

శరీరంలో వ్రణాలకు ; పావుకప్పు ఉలవలను చిటికెడు పొగించిన ఇంగువను , పావు టీస్పూన్ అల్లం ముద్దను, పావు టీస్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్ని తగినంత నీటిని కలిపి ఉడికించి , తేనె కలిపి కనీసం నెలరోజుల పాటు తీసుకుంటే వ్రణాలు, అల్సర్లు తగ్గిపోతాయి.

మూత్రంలో చురుకు, మంట ; ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సరఫరా మెరుగవుతుంది.

సెగగడ్డలు ; ఉలవ ఆకులను మెత్తగా నూరి కొద్దిగా పసుపు పొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మంపై వచ్చే సెగగడ్డలు పగిలి, నొప్పి అసౌకర్యం తగ్గుతాయి.

విరేచనాలు ; ఒక టీస్పూన్ ఉలవ ఆకు రసానికి అరటి పండు కలిపి రోజుకు 2 నుండి 3సార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.

మొలల నొప్పి ; మొలల మీద ఉలవల ఆకు ముద్దను లేపనంగా రాస్తే వాపు, నొప్పి , దురదలు తగ్గిపోతాయి.

ఉలవలను కొద్దిగా వేయించి , పొడిచేసి చర్మం మీద రుద్దుకోవాలి. దీనిని నలుగు పిండిగా వాడుకోవచ్చు. ఉలవలు, ర్యాడిష్ దుంపల పొడి వంటివి ఆహారంలో తీసుకుంటే దద్దుర్ల నుండి విముక్తి లభిస్తుంది. ఉలవలతో సూప్ తయారు చేసుకుని తీసుకుంటే వాపులతో కూడిన కీళ్ల నొప్పి తగ్గిపోతుంది.

ఉలవల కషాయం తీసుకుంటే దగ్గు, ఉబ్బసం క్రమేపి తగ్గుతాయి. జ్వరంతో ఇబ్బంది పడుతున్నవారు ఉలవల కషాయంతో తయారుచేసుకున్న పెసరకట్టును కలిపి తీసుకోవాలి. ఉలవల వల్ల చెమటపట్టి జ్వరం త్వరగా తగ్గిపోతుంది. ఉలవల ఖషాయాన్ని సక్రమైన రీతిలో పులియబెట్టి, సైంధవలవణం , మిరియాల పొడి కలిపి తీసుకంటే కడుపునొప్పి తగ్గిపోతుంది