ఊరట : కేన్సర్ మందుల ధరలు తగ్గాయి

కేన్సర్ వ్యాధి..ఈ వ్యాధి నుండి బయటపడాలంటే సామాన్యుడికి తలకు మించిన భారం అవుతుంది. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా. ఈ వ్యాధికి ఉపయోగించే మందుల ధరలు అలా ఉంటాయన్నమాట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని NPPA కేంద్ర ఔషధ ధరల నియంత్రణ సంస్థ సంస్కరణలు చేపట్టింది. కేన్సర్ మందుల ధరల తగ్గింపుపై చర్యలు తీసుకుంది. రెండింతల నుండి తొమ్మిదింతల వరకు ధరలు తగ్గించింది. ఈ మేరకు మే 15వ తేదీ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
మే 01వ తేదీ నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చిన్నట్లు ప్రకటించింది. ప్రైవేటులో మందులకు ఏటా రూ. 80 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం వల్ల లక్షలాది మంది కేన్సర్ రోగులకు ఔషధ ధరలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టెట్ కేన్సర్‌లలో ఉపయోగించే ఔషధాల ధరలను తగ్గించింది.
ధరల తగ్గింపు (రూ.ల్లో) : –
మందు పేరు | సంఖ్య | ఏ కేన్సర్‌కు | గత ధర | తగ్గింపు ధర (శాతాల్లో) |
ఎవెరొలిమస్ 0.5 ఎంజీ | 10 | రొమ్ము, ఊపిరితిత్తులు | 1452 | 739 (49.01) |
ఎవెరొలిమిస్ 0.25 ఎంజీ | 10 | రొమ్ము, ఊపిరితిత్తులు | 726 | 406 (44.08) |
ఎపిరుబిసిన్ 10 ఎంజీ ఇంజక్షన్ | 1 | రొమ్ము | 561 | 276 (50.66) |
ఎపిరుబిసిన్ 50 ఎంజీ ఇంజక్షన్ | 1 | రొమ్ము | 2662 | 960 (63.94) |
లియూప్రొలైడ్ ఎసిటేట్ 3.75 ఎంజీ ఇంజక్షన్ | 1 | ప్రోస్టేట్ | 3900 | 2650 (33.58) |
ఎర్లోటినిబ్ 100 ఎంజీ | 10 | ఊపిరితిత్తులు | 6600 | 1840 (72.12) |
ఎర్లోటినిబ్ 150 ఎంజీ | 10 | ఊపిరితిత్తులు | 8800 | 2400 (72.73) |
పెమోట్రైక్సెడ్ 100 ఎంజీ ఇంజక్షన్ | 1 | ఊపిరితిత్తులు | 7700 | 800 (89.61) |
పెమోట్రైక్సెడ్ 500 ఎంజీ ఇంజక్షన్ | 1 | ఊపిరితిత్తులు | 22000 | 2880 (86.91) |
కొందరు రోగులకు నెలనెలా ఇంజక్షన్లు, మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని వైద్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేన్సర్ రోగులకు పెద్ద ఊరటగానే చెప్పవచ్చని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.