Sitting too long : ఎక్కువ సమయం కూర్చుంటే.. ఆరోగ్యానికి ప్రమాదమే!

గంటలకొద్దీ కదలకుండా కూచోవాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారైనా కుర్చీలోంచి లేచి కాస్త అటూఇటూ తిరగాలి.

Sitting too long : ఎక్కువ సమయం కూర్చుంటే.. ఆరోగ్యానికి ప్రమాదమే!

Prolonged Sitting

Updated On : March 5, 2022 / 12:54 PM IST

Sitting too long : మారుతున్న జీవనశైలి, పని పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివన్నీ మనిషిని కదలనీయకుండ, ఒకేచోట కూర్చునే ఉంచుతున్నాయి. దీంతో గంటల తరబడి కదలకుండా కూర్చోవటం అలవాటుగా మారుతోంది. ఇటీవలి కాలంలో చాలామంది రోజులో ఎక్కవ సమయంలో కూర్యొనే గడుపుతున్నారు. ఇలా ఎక్కువసేపు కూచోవటం అనేది గుండెజబ్బులు, అధిక రక్తపోటు, స్థూలకాయం, టైప్‌2 మధుమేహం, గుండెపోటు, కొన్నిరకాల కాన్సర్లకు దారి తీస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. వ్యాయామం చేస్తున్నప్పటకీ ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వారిలో కొన్ని రకాల ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి.

ఒకేచోట కదలకుండా 60 నిమిషాల సేపు ఉంటే గుండెజబ్బులు, క్యాన్సర్‌ బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. ఒకేచోట కూర్చుని ఉండటం వల్ల శరీరంలోని లైపోప్రోటీన్‌ లైపేజ్‌ (ఎల్‌పీఎల్‌) అనే ఎంజైమ్‌ పనితీరు మందగిస్తుంది. వాస్తవానికి ఇది వ్యాక్యూమ్‌ క్లీనర్‌లా పనిచేస్తూ.. రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌ను పీల్చుకొని కండరాల రూపంలోకి మారుస్తుంది. కదలకుండా కూచుంటే ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, తదితర భాగాల్లో పేరుకుంటుంది. బరువు పెరగటం, పొట్ట భాగంలో పేరుకునే ఈ కొవ్వు చాలా ప్రమాదకరమైంది. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచే హర్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తుంది. రక్తనాళాలు పూడుకుపోవటం, స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటికీ దారితీస్తుంది.

ఎక్కువసేపు కూర్చోవటం వల్ల వెన్నెముక, భుజాలు, తుంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. భుజాలు, మెడ, నడుంనొప్పులకు దారి తీస్తుంది. ఆఫీసుల్లో కంప్యూటర్‌ టేబుళ్లు, కుర్చీల ఆకారం, ఎత్తు సరిగా లేకపోయినా వెన్నెముక దెబ్బతింటుంది. మెడ, వీపు, ఛాతీ, భుజాలు, చేతుల్లోని కండరాలు, నాడులపైనా ప్రభావం చూపుతుంది.

గంటలకొద్దీ కదలకుండా కూచోవాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారైనా కుర్చీలోంచి లేచి కాస్త అటూఇటూ తిరగాలి. ప్రతిరోజు కనీసం 45 నిమిషాల నడక అలవాటు చేసుకోవాలి. భుజాలు విశ్రాంతి పొందేందుకు వీలుగా అప్పుడప్పుడు భుజాలను పైకి లేపుతూ ఉండాలి. ఫోన్‌ వచ్చినపుడు లేచి నిలబడి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే కారిడార్‌లో పచార్లు చేస్తూ సంభాషించటం మేలు. వీలైనప్పుడు శ్వాసను వదులుతూ కడుపును లోపలికి పీల్చుకొని 10 అంకెలు లెక్కబెడుతూ అలాగే ఉండండి. ఇది పొట్ట కండరాలు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. వీలైనంతవరకు కార్యాలయంలో లిఫ్ట్‌ని వాడకుండా మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాలి.