Respiratory Problems : చలికాలంలో శ్వాససంబంధిత సమస్యలు బాధిస్తుంటే?..
శ్వాస సంబంధిత సమస్యలు కనుక డయాబెటిస్, ఒబిసిటీ, వృద్ధులు, రెస్పిరేటరీ సమస్యలు ఉన్న వాళ్ళకి వస్తే మరింత ప్రమాదకరం. పిల్లలలో నాసిక రంధ్రాలు మూసుకుపోయి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

Winter
Respiratory Problems : చలికాలం వచ్చిందంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ఈ కాలంలో చాలా మంది దగ్గు, జలుబు, తల నొప్పితో బాధ పడుతూ ఉంటారు. వీటికి తోడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శ్వాస ఆడకపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఇలాంటివి చాలా మందికి ఎదురయ్యే సమస్యలు. శ్వాస సమస్య వచ్చినప్పుడు సరిపడినంతగా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు. నొప్పిగా ఉంటుంది. రెస్పిరేటరీ సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆస్తమా, ఇన్ఫెక్షన్స్, హృదయ సంబంధిత సమస్యలు వల్ల సైతం శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి.
శ్వాస సంబంధిత సమస్యలు కనుక డయాబెటిస్, ఒబిసిటీ, వృద్ధులు, రెస్పిరేటరీ సమస్యలు ఉన్న వాళ్ళకి వస్తే మరింత ప్రమాదకరం. పిల్లలలో నాసిక రంధ్రాలు మూసుకుపోయి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చలి కారణంగా రక్తపోటు ఉండే వ్యక్తులకు చెమట బయటకు రాకపోవడంతో బిపి పెరిగే అవకాశాలు ఉన్నాయి. గుండె, శ్వాసకోశ సమస్యలు ఉన్న వ్యక్తులకు చలికాలంలో మరింత ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయట పడటానికి చక్కటి చిట్కా ఎంతో దోహదపడుతుంది. దీని ద్వారా జలుబు, దగ్గు, కఫం సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ వాము, 10 పుదీనా ఆకులు, రెండు కర్పూరం బిళ్ళలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. ఈ నీరు బాగా మరుగుతున్నప్పుడు పొయ్యి మీద నుంచి దించాలి, ఆ తర్వాత ఆవిరిని కొంతసేపు ముక్కుతో, కొంతసేపు నోటితో పీల్చడం వల్ల శ్వాస నాళాలు శుభ్రపడి ఊపిరితిత్తుల్లో కఫం బయటకు వచ్చేస్తుంది. జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి ఈ వాము మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తొలగిపోతుంది. అస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇలా చేయటంతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటించటం ముఖ్యం. చలికాలంలో ఎక్కువగా బయటకు తిరగకుండా ఉండటం మంచిది. చిన్న పిల్లలను చల్లగాలిలో ఎక్కువ సమయం గడపకుండా చూడాలి. శరీరాన్ని ఎల్లవేళలా వెచ్చగా ఉంచే స్వెట్టర్లు , స్కార్ప్ , టోపీలు, గ్లౌజులు, సాక్స్ లను ధరించడం మంచిది. జలుబు, గొంతు నొప్పి సమస్యలు ఉంటే ఆవిరిపట్టడం మంచిది. వెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని పుక్కిలించాలి. తరచూ వేడినీటిని తాగాలి.