Telangana Bjp : వాళ్లను మార్చాల్సిందే, లేదంటే.. ఎన్నికల వేళ బీజేపీకి అసంతృప్తుల సెగ

నాగర్ కర్నూల్ టికెట్ ప్రకటించిన మరుసటి రోజే.. సీఎం రేవంత్ రెడ్డిని బంగారు శృతి కలిశారు.

Telangana Bjp : వాళ్లను మార్చాల్సిందే, లేదంటే.. ఎన్నికల వేళ బీజేపీకి అసంతృప్తుల సెగ

Telangana Bjp : ఎన్నికల వేళ బీజేపీకి అసంతృప్తుల సెగ తగులుతోంది. పలువురు బీజేపీ అభ్యర్థులను కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్ అభ్యర్థులను మార్చాలని బీజేపీ క్యాడర్ పట్టుబడుతోంది. అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్న నేతలు.. హైదరాబాద్ టికెట్ మాధవీలతకు ఇవ్వడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల సైదిరెడ్డి, ఆరూరి రమేశ్ లను మార్చాల్సిందేనని బీజేపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది.

సైదిరెడ్డి, ఆరూరి రమేశ్, నగేశ్ లకు వ్యతిరేకంగా నిరసనలు..
సైదిరెడ్డి, ఆరూరి రమేశ్ లకు వ్యతిరేకంగా వరంగల్, నల్గొండ జిల్లా బీజేపీ నేతలు ఒక్కటయ్యారు. ఆదిలాబాద్ టికెట్ ను నగేశ్ కు కేటాయించడాన్ని సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు, రమేశ్ రాథోడ్ వ్యతిరేకిస్తున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ ప్రకటించిన మరుసటి రోజే.. సీఎం రేవంత్ రెడ్డిని బంగారు శృతి కలిశారు. అభ్యర్థులను మార్చకుంటే ఎన్నికల్లో సహకరించేది లేదని పార్టీ కేడర్ తెగేసి చెబుతోంది.

కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తారా?
బీజేపీలో ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి 15 రోజులు అవుతున్నా.. ఇంకా అసంతృప్తుల సెగ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి అది తీవ్రం అవుతున్న పరిస్థితి. బీజేపీలో కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి వారికే టికెట్లు ఇచ్చారనే ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో కార్యకర్తలు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చి టికెట్లు దక్కించుకున్న వారికి సహకరించేది లేదని కేడర్ తెగేసి చెబుతోంది. ఈ క్రమంలో ప్రచారంలోకి వెళ్లేందుకు అభ్యర్థులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ స్థానాల్లో అసంతృప్తుల సెగ ఎక్కువగా ఉంది.

మాపై దాడులు చేయించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన వాళ్లకు టికెట్లా?
వరంగల్ టికెట్ ను ఆరూరి రమేశ్ కు ఇవ్వడాన్ని బీజేపీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. ముందు నుంచి జెండా మోసిన నేతలకు టికెట్లు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. గతంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో మాపై దాడులు చేయించిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు? ఆయన గెలుపు కోసం మేము ఎలా పని చేయాలి? అని రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఇక నల్గొండలో సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని కేడర్ తప్పుపడుతోంది. గతంలో మాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన వ్యక్తికి ఎలా సహకరించాలి అని క్వశ్చన్ చేస్తున్నారు. ఆదిలాబాద్ లో సైతం ఈ తరహా నిరసనలే వ్యక్తమవుతున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎంపీని కాదని నగేశ్ కు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Also Read : తెలంగాణ కాంగ్రెస్‌లో ఫ్యామిలీ వార్.. వారికి టికెట్లు ఇవ్వడంపై సీనియర్ల ఫైర్