తెలంగాణ కాంగ్రెస్‌లో ఫ్యామిలీ వార్.. వారికి టికెట్లు ఇవ్వడంపై సీనియర్ల ఫైర్

ఒక వైపు వలసనేతల అంశం తీవ్ర దుమారం రేపుతుండగా.. మరో వైపు కుటుంబంలోని వారికే టికెట్లు ఇవ్వడమనే అంశం కూడా రచ్చరచ్చగా మారుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫ్యామిలీ వార్.. వారికి టికెట్లు ఇవ్వడంపై సీనియర్ల ఫైర్

Telangana Congress: ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములకే వాడి ఎక్కువన్నట్లు తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. గెలుపు గుర్రాల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ వలస నేతలకే పెద్ద పీట వేస్తోంది. బాగా ఆర్థికంగా డబ్బున్న వ్యక్తులను ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి మరీ టికెట్లు కేటాయిస్తోంది. మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్లమెంట్ టికెట్ రేసులో ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్‌లో ముసలం రాజుకుంటోంది. దీనిపై నేరుగా సీఎం ముందే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ టికెట్లు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కే దక్కుతున్నాయని అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? పెండింగ్ సీట్లపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది..?

ఇజ్జత్ కా సవాల్
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను ఇజ్జత్ కా సవాల్ గా తీసుకుంది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో 14 గెలిచి తీరాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ వందరోజుల పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటూ పదేపదే చాలెంజ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో.. రేసుగుర్రాలంటూ కొత్త సాంప్రదాయానికి తెర దీశారు. ఆర్థికంగా బలమైన నేతలని ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి మరీ టికెట్లు కేటాయిస్తున్నారు. ఈ విషయంలో పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నిన్నటి వరకు పార్టీని తిట్టిన వారిని.. కార్యకర్తలపై కేసులు పెట్టిన వారిని తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన పలువురు నేతలకు కాంగ్రెస్ టికెట్లిచ్చింది. చేవెళ్ల తరపున రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీలకు టికెట్ లు కేటాయించారు. ఈ విషయంలో చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేత వి.హనుమంతరావు పార్టీ వేదిక మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నేతల ఇళ్లకు వెళ్లడం సరైన సాంప్రదాయం కాదంటూ విమర్శలు గుప్పించారు.

గేట్లు తెరిస్తే దొంగలే వస్తున్నారు
ఇక వలస నేతలకు టికెట్లు ఇవ్వడం విషయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ముందే సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే అందరూ దొంగలు వస్తున్నారు అంటూ చురకలంటిచారు. చేవెళ్ల పార్లమెంట్ సమీక్షా సమావేశం సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ముందే హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి దొంగలు వచ్చి పెత్తనం చేయడం.. కాంగ్రెస్ కార్యకర్తలకు అవమానకరంగా మారింది అంటూ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ సమీక్షా సమావేశంలో నేతలు అందరి ముందు.. కేఎల్ఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.

ఒక వైపు వలసనేతల అంశం తీవ్ర దుమారం రేపుతుండగా.. మరో వైపు కుటుంబంలోని వారికే టికెట్లు ఇవ్వడమనే అంశం కూడా రచ్చరచ్చగా మారుతోంది. ఇప్పటికే నల్లగొండ పార్లమెంట్ సీటు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి, పెద్దపల్లి సీటు గడ్డం వివేక్ కుమారుడు వంశీకి కేటాయించారు. ఇందులో గడ్డం వంశీకి సీటు కేటాయింపుపై తీవ్ర దుమారం రేగుతుంది. ఇప్పటికే బెల్లంపల్లి, చెన్నూరు రెండు అసెంబ్లీ సీట్లు గడ్డం వినోద్, గడ్డం వివేక్ ఇద్దరు అన్నదమ్ములకు కేటాయించారు. ఇప్పుడు తాజాగా పెద్దపల్లి పార్లమెంట్ సీటును వివేక్ కుమారుడు వంశీకి కేటాయించడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హాట్ టాపిక్‌గా ఖమ్మం సీటు
ఇవే కాకుండా పెండింగ్ లో ఉన్న మిగతా సీట్లలో కూడా ముఖ్య నేతల ఫ్యామిలీ మెంబర్స్ బరిలో దిగాలని చూస్తున్నారు. భువనగిరి నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక ఖమ్మం సీటు అయితే హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందినికి కావాలని అడుగుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్ కు కావాలని కోరుతున్నారు. ఇలా మొత్తం మీద ఫ్యామిలీ మెంబర్స్ టికెట్ల అంశం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: కాంగ్రెస్ 8వ జాబితా విడుదల.. తెలంగాణలో మరో 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

ఒకవైపు వలసనేతల అంశం, మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ కే టికెట్లు ఇచ్చారనే అంశం చినికిచినికి గాలివానలా మరుతోంది. మరి ఈ వివాదానికి కాంగ్రెస్ అధిష్టానం ఎలా పుల్ స్టాప్ పెడుతుందనేది మున్ముందు చూడాలి.