ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

కవిత అరెస్టైన రోజే.. నవ్వుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడు అంటూ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

KTR on MP Ranjith Reddy: బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి గెలిపిస్తే, పార్టీకి మోసం చేసి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. అధికారం, ఆస్తుల కోసమే బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చామన్నారు.

కవిత అరెస్టైన రోజే.. నవ్వుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదని.. తామే గొప్ప అనుకునే వారు రాజకీయాల్లో రాణించలేరని ఉద్భోదించారు. గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరూ చూశారని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్‌కు అభ్యర్థులే లేరు
కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందని.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏప్రిల్ 13న కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. కాగా, సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: దానం నాగేంద‌ర్‌తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భేటీ.. కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ!