Tollywood : 2022 టాలీవుడ్ రౌండప్..
2022లో కరోనా దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని, ఏదైతే అదవుతుందని ధైర్యం చేసి పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. గత రెండేళ్ల నుంచి కొవిడ్ దెబ్బకి విపరీతమైన నష్టాల్లో ఉన్న టాలీవుడ్ కి ఊపిరిచ్చిన సంవత్సరం 2022...........

2022 Tollywood roundup
Tollywood : 2022లో కరోనా దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని, ఏదైతే అదవుతుందని ధైర్యం చేసి పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. గత రెండేళ్ల నుంచి కొవిడ్ దెబ్బకి విపరీతమైన నష్టాల్లో ఉన్న టాలీవుడ్ కి ఊపిరిచ్చిన సంవత్సరం 2022. భయం భయంగానే సంక్రాంతి నుంచి కాస్త సినిమాల రిలీజ్ స్పీడప్ చేసిన టాలీవుడ్ పడుతూ లేస్తూ సక్సెస్ ఫుల్ గానే కంప్లీట్ చేసేసుకుంది. ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయనుకున్న సినిమాలు డిజాస్టర్ అయితే అసలు ధియేటర్ దాకా వస్తాయా అనుకున్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
2022 సంక్రాంతికి అతిదిదేవోభవ, 1945, రౌడీబాయ్స్, సూపర్ మచ్చి, హీరో, గుడ్ లక్ సఖి లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తండ్రీ కొడుకుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన బంగార్రాజు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బాగానే కాసుల వర్షం కురిపించి కొత్త సంవత్సరాన్ని ఫుల్ ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ చేశారు. అదే స్పీడ్ లో ఫిబ్రవరిలో రవితేజ డ్యూయల్ రోల్ లో రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఖిలాడి గ్రాండ్ గా హిందీలో కూడా రిలీజ్ చేశారు. కానీ సినిమా మాత్రం అస్సలు అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయ్యింది. కానీ ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన డి.జె టిల్లు మాత్రం అదిరిపోయే హిట్ కొట్టింది. సిద్దు, నేహాశెట్టి జంటగా విమల్ డైరెక్షన్లో తెరకెక్కిన డి.జె.టిల్లు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించింది.
అసలు సిసలు పెద్ద సినిమాల సందడి స్టార్ట్ అయ్యింది మాత్రం ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో. ఫిబ్రవరి 25న అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యింది. లాలా భీమ్లా అంటూ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రానా, పవన్ కళ్యాణ్ లీడ్ రోల్స్ లో సాగర్ చంద్ర డైరెక్షన్లో రిలీజ్ అయిన భీమ్లానాయక్ కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఫాన్స్ కి మాస్ ఫీస్ట్ ఇచ్చింది.
మార్చి 4న ఎప్పటినుంచో మాంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో వచ్చినా ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. అదే రూట్లో రాధేశ్యామ్ కూడా నడిచింది. వరల్డ్ వైడ్ గా ఎన్నో అంచనాలతో రాధేశ్యామ్ మార్చి 11న వరల్డ్ వైడ్ గా రికార్డ్ ధియేటర్లలో రిలీజ్ అయ్యింది. 300కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ ,పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ మినిమం అంచనాలని కూడా రీచ్ కాలేక, డిజాస్టర్ గా మిగిలిపోయింది. మార్చిలోనే ఎన్టీఆర్, చరణ్ లీడ్ రోల్స్ లో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో 500కోట్లకు పైగా బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిన RRR మూవీ మార్చి 25న వరల్డ్ వైడ్ గా ధియేటర్లో రిలీజ్ అయ్యింది. రాజమౌళి విజువల్ వండర్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోల అదిరిపోయే యాక్షన్ తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
మార్చి వరకూ టాలీవుడ్ పరిస్తితి బాగానే ఉంది. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తోనే చిన్న సినిమాలుకూడా ధియేటర్లోనే రిలీజ్ పెట్టుకున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ న తాప్సీ లీడ్ రోల్ లో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ తో పాటు పలు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఏప్రిల్ 8న రిలీజ్ అయిన మూవీ గని కూడా అసలు అడ్రస్ లేకుండా పోయింది. ఏప్రిల్ 29న ఆచార్య ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేసిన జనాలు తీరా సినిమా చూసి బాగా డిసప్పాయింట్ అయ్యారు. మెగా హీరోలు చిరంజీవి, చరణ్ ని ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాలో కళ్లారా చూసుకుందామని ఆశపడిన ఫాన్స్ కొరటాల శివ డైరెక్షన్ పవర్ ని మరోసారి ఎక్స్ పీరియన్స్ చేద్దామని వెయిట్ చేసిన ఆడియన్స్ ఆచార్య చూసి పెదవి విరిచారు. కనీసం మెగాఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకోలేక అనుకన్నంత సక్సెస్ కాలేకపోయింది ఆచార్య సినిమా.
మే ఫస్ట్ వీక్ లో అన్నీ చిన్న సనిమాలే రిలీజ్ అయ్యాయి. జయమ్మ పంచాయితీ, భళా తందనాన , అశోక వనంలో అర్జున కళ్యాణం లాంటిసినిమాలు రిలీజ్ అయితే వాటిలో విష్వక్ సేన్ అశోకవనంలో సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మే 12న సమ్మర్ సెగల్ని పెంచడానికే వచ్చాడా అన్నట్టు సూపర్ స్టార్ రిలీజ్ చేసిన సర్కారు వారి పాట సక్సెస్ మోత మోగించింది. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ కి కీర్తిసురేష్ జంటగా వచ్చిన మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట సినిమా సమ్మర్ సీజన్ కే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మే థర్డ్ వీక్ లో రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ పర్వాలేదనిపించింది. ఇక మే చివరి వారంలో రిలీజ్ అయిన ఫన్ ఫ్రాంచైజ్ మూవీ ఎఫ్ 3 ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.
జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మేజర్ మాత్రం వెయిట్ చేసిన దాని కన్నా ఎక్కువ సక్సెసే అందుకుంది. మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన అడవిశేష్ సినిమా ఇటు సౌత్ తో పాటు బాలీవడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జూన్ సెకండ్ వీక్ లో నాని అంటేసుందరానికి సినిమా రిలీజ్ అయ్యింది. మళయాళ హీరోయిన్ నజ్రియా జంటగా చేసిన హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ జనాలకి నచ్చినా, విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా టార్గెట్ రీచ్ కాలేకపోయింది. జూన్ 17న రిలీజ్ అయిన విరాట పర్వం కూడా జనాలని నిరాశపరిచింది. ప్రశంసలు వచ్చినా కలెక్షన్స్ రాలేదు. జూన్ 17న సత్యదేవ్ హీరోగా గాడ్సే రిలీజ్ అయినా అది ఫ్లాప్ గానే మిగిలింది. జూన్ 23న రామ్ గోపాల్ వర్మ కొండా సినిమా రిలీజ్ అయినా వర్మ సినిమాలని వదిలేసినట్టే దీన్ని కూడా జనాలు వదిలేశారు. ఇక జూన్ 24న రిలీజ్ అయిన చిన్న సినిమాలు సమ్మతమే, చోర్ బజార్, 7 డేస్, 6నైట్స్ లాంటి పలు సినిమాల్లో సమ్మతమే పర్వాలేదనిపించింది.
2022 సెకండాఫ్ లో ఫ్లాపులతోనే స్టార్ట్ అయ్యింది. ఎప్పటి నుంచో హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ జులై ఫస్ట్ న పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ చేశారు. మారుతి రొటీన్ స్టైల్ మూవీ మేకింగ్ తో ఆడియన్స్ కి బోర్ కొట్టించి మరో సారి ఫ్లాప్ అందుకున్నారు గోపీచంద్. జులై 8న లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో వచ్చిన హ్యపీ బర్త్ డే పర్వాలేదనిపించింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ సినిమాతో యావరేజ్ అనిపించిన రామ్ ఈ సారి హిట్ కోసం ట్రై చేస్తూ జులై 14న రిలీజ్ చేసిన వారియర్ కూడా డిజాస్టర్ లిస్ట్ లోనే జాయిన్ అయ్యింది. బంగార్రాజు తో హిట్ ఫామ్ లోనే ఉన్న నాగచైతన్య ఈ సారి జానర్ మార్చి జులై 22న రిలీజ్ చేసిన టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించిన థాంక్యూ డిజాస్టర్ గా మిగిలింది. మనంతో చైతన్య కు మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ ఈసారి మాత్రం థాంక్యూ తో ఆ సక్సెస్ ని కంటిన్యూ చెయ్యలేకపోయాడు. మరో వైపు ఖిలాడి తో ఫ్లాప్ అందుకున్న రవితేజ సీరియస్ సబ్జెక్ట్ తో రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాతో జులై 29న ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ రొటీన్ టేకింగ్ కావడం, కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే అవ్వడంతో రవితేజ కెరీర్ లో మరో ఫ్లాప్ గా నిలిచింది రామారావ్ ఆన్ డ్యూటీ.
జులై బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్ని మిగిల్చినా ఆగస్ట్ ఎంట్రీ తోనే బాక్సాఫీస్ మోత మోగిపోయింది. ఆగస్ట్ 5, 2022 కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ బింబిసార రిలీజ్ అయ్యింది. అండర్ డాగ్ గానే వచ్చిన బింబిసార 80 కోట్ల కలెక్షన్లతో సూపర్ హిట్ అందుకుంది. ఆగస్ట్ 5నే వచ్చిన సీతారామం సింపుల్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ దుల్కర్, మృణాల్ జంటగా 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సీతారామం హిందీలో కూడా రిలీజ్ అయ్యి 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ అయ్యింది. బింబిసార, సీతారామం దెబ్బకి ఆగస్ట్ 12న నితిన్ రిలీజ్ చేసిన రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం పర్వాలేదనిపించినా అసలు అడ్రస్ లేకుండా పోయింది. కానీ ఆగస్ట్ 13న రిలీజ్ అయిన కార్తికేయ 2 మాత్రం కంటెంట్ తో కట్టిపడేసింది. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయ్యి 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
హిట్ కోసం నానా తంటాలు పడుతున్న ఆదిసాయికుమార్ తీస్ మార్ ఖాన్ తో ఆగస్ట్ 19న ఆడియన్స్ ముందుకొచ్చి అంతే స్పీడ్ గా వెనక్కెళ్లిపోయాడు. ఆగస్ట్ 19న ఆనంద్ దేవరకొండ హైవే రిలీజ్ అయినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రెండేళ్ల నుంచి రౌడీ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ అయ్యింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్, ఎక్కువ అంచనాలు ఉండటం, విజయ్ మరీ ఓవర్ గా సినిమాని ప్రమోట్ చేయడంతో లైగర్ మూవీ అంచనాలు అందుకోలేక అట్టర్ ఫ్లాప్ అయి భారీ లాస్ మూట కట్టుకుంది. అప్పట్నుంచి విజయ్ మీడియా ముందుకి కూడా రావట్లేదు.
సెప్టెంబర్ లో మొత్తానికి మీడియం రేంజ్ సినిమాల హవానే నడిచింది. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాతో పర్వాలేదనిపిస్తే శర్వానంద్ మాత్రం సెప్టెంబర్ సెకండ్ వీక్ లో ఒకేఒక జీవితం సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ అందుకున్నాడు. సెప్టెంబర్ 16న మాత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి యావరేజ్ గా నిలిచినా నేను మీకు బాగాకావల్సిన వాడిని , శాకిని-ఢాకిని సినిమాలు రిలీజ్ అయ్యి అలాగే పోయాయి. ఇక సెప్టెంబర్ 23న రిలీజ్ అయ్యిన మరో 3 సినిమాలు కృష్ణ వ్రింద విహారి, అల్లూరి, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలలో కృష్ణ వ్రింద విహారి ఒక్కటే సాధారణ విజయం సాధించింది.
అక్టోబర్ 5న విజయదశమి సీజన్ లో రిలీజ్ అయ్యిన అన్ని సినిమాలు విజయాల్నే అందుకున్నాయి. నాగార్జున మోస్ట్ అవెయింట్ మూవీ ఘోస్ట్ మంచి సక్సెస్ అందుకుంటే, బెల్లంకొండ సాయిగణేష్ మూవీ స్వాతిముత్యం కూడా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక అదే రోజు రిలీజ్ అయిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ అందరి అంచనాల్ని అందుకుని అదిరిపోయే హిట్ అయ్యింది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన మంచు విష్ణు సినిమా జిన్నా కూడా ఈసారి పర్వాలేదనిపించినా కలెక్షన్స్ రాలేదు. విష్వక్ సేన్ ఓరిదేవుడా కూడా ఆడియన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది.
నవంబర్ స్టార్టింగ్ వీక్ లో నవంబర్ 4న రిలీజ్ అయిన సంతోష్ శోభన్ మూవీ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ డిజాస్టర్ అయితే అల్లు శిరీష్ మూవీ ఊర్వశివో-రాక్షసివో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. నవంబర్ 11న లాంగ్ గ్యాప్ తర్వాత సమంత సోలోగా చేసిన యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. 18న మసూద, 25న ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు కూడా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి.
Sai Pallavi : పుట్టపర్తిలో సాయి పల్లవి.. దైవ చింతనలో న్యూ ఇయర్ వేడుకలు..
2022 లాస్ట్ మంత్ డిసెంబర్ 2న రిలీజ్ అయిన హిట్ 2 ధియేటర్లో హార్డ్ హిట్టింగ్ సక్సెస్ అందుకుంది. అడివిశేష్ యాజ్ యూజువల్ గా తన అల్టిమేట్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఎంగేజ్ చేశారు. డిసెంబర్9న పోటీపడిన ముఖచిత్రం, పంచతంత్రం సినిమాలు పర్వాలేదనిపించాయి. డిసెంబర్ 23న రిలీజ్ అయిన నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లవ్ స్టోరీ 18 పేజెస్ అదిరిపోయే హిట్ అందుకుని ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. డిసెంబర్ 23నే రిలీజ్ అయిన ధమాకా ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి మంచి హిట్ ఇచ్చింది. ఇక డిసెంబర్ 23న టాప్ గేర్ లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయినా అంతగా ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేకపోయాయి. ఇలా 2022 బంగార్రాజుతో మొదలైన సక్సెస్ జర్నీ పడుతూ లేస్తూ ధమాకాతో మంచి ఫినిషింగ్ ఇచ్చింది.