చిరు దేవుడిలా ఆదుకున్నారు..

లాక్‌డౌన్ నేపథ్యంలో రక్తం దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వారిని ఆదుకోవడం మన బాధ్యత అని మెగాస్టార్ చిరంజీవి పిలువునివ్వగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు స్వచ్ఛందంగా రక్త దానం చేస్తున్నారు.
ఈ సందర్భంగా గతంలో తనకు రక్తం అవసరమైనపుడు చిరంజీవి దేవుడిలా ఆదుకున్నారని, ఆయన రుణం తీర్చుకోలేనిదని టాలీవుడ్ సీనియర్ నటి హేమ గుర్తుచేసుకున్నారు. తాజాగా రక్తదానం చేసేందుకు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు కూతురితో కలిసి వచ్చిన హేమ గతంలో జరిగిన సంఘటన గురించి తెలియచేశారు.
‘పదహారేళ్ల క్రితం డెలివరీ సమయంలో నాకు తీవ్ర రక్తస్రావం జరిగింది. రక్తం అవసరమైంది. నాది అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో ఎక్కడా దొరకలేదు. అప్పుడు రాజారవీంద్రకు ఫోన్ చేస్తే.. ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చారు. రక్తం విలువ అప్పుడు అర్థమైంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆదుకోకుంటే నాకు చాలా ప్రమాదం జరిగేది. ఈ విషయంలో చిరంజీవిగారు నిజంగా దేవుడే. అందుకే నేను, నా కూతురు రక్తదానం చేసేందుకు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు వచ్చాం..’ అని హేమ తెలిపారు.