Babu Mohan : సినిమాల్లోకి రాకముందు బాబు మోహన్ ఏం చేసేవాడో తెలుసా? బాలయ్య షూటింగ్ చూసి అనుకోకుండా సినిమాల్లోకి..

తాను సినీ పరిశ్రమకు రాకముందు ఏం చేసారు, సినీ పరిశ్రమలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు అని బాబు మోహన్ తెలిపారు.

Babu Mohan : సినిమాల్లోకి రాకముందు బాబు మోహన్ ఏం చేసేవాడో తెలుసా? బాలయ్య షూటింగ్ చూసి అనుకోకుండా సినిమాల్లోకి..

Babu Mohan Tells About How he Entry into Movies and his Work before Movies

Updated On : February 25, 2025 / 11:11 AM IST

Babu Mohan : ఎన్నో సినిమాలలో తన కామెడీతో నవ్వించిన బాబు మోహన్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇటీవలే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే పలు సినిమాలు ఒప్పుకుంటున్నారు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా కొన్నాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా సీనియర్ కమెడియన్, పొలిటిషియన్ బాబు మోహన్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో తాను సినీ పరిశ్రమకు రాకముందు ఏం చేసారు, సినీ పరిశ్రమలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు అని తెలిపారు.

బాబు మోహన్ మాట్లాడుతూ.. మాది ఖమ్మం. సినిమాల్లోకి రాకముందు రేషన్ షాప్స్, సివిల్ సప్లైస్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవాడ్ని. నాకు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పట్నుంచో నాకు షూటింగ్ చూడాలి అని కోరిక. నేను చిన్నప్పుడు, కాలేజీలో నాటకాలు వేసాను కానీ సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన రాలేదు ఎప్పుడూ. ఒక రోజు కృష్ణానగర్ లో షూటింగ్ జరుగుతుంది. నాకు ఆ రోజు వర్క్ అదే ఏరియాలో ఉంది. నా వర్క్ అయిపోయి వెళ్తుంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర షూట్ జరుగుతుంది. జనాలు చాలా మంది నిల్చొని చూస్తున్నారు. అక్కడ అడిగితే బాలయ్య సినిమా షూటింగ్ అన్నారు. దాంతో నేను కూడా ఓ మూలకు రాయి మీద ఎక్కి నిల్చొని షూటింగ్ చూస్తున్నాను.

Also See : 10టీవీతో బాబు మోహన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.. ఇక్కడ చూసేయండి..

అది డైరెక్టర్ కోదండరామిరెడ్డి – బాలయ్య సినిమా. డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ ని తిడుతున్నాడు.. 12 టేకులు తీసుకున్నాడు అని. మళ్ళీ ఇంకొన్ని టేకులు చేసినా అతను సరిగ్గా చెప్పకపోవడంతో చుట్టూ ఉన్న జనాల్ని ఏమయ్యా మీలో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా అని అడిగితే ఎవ్వరూ మాట్లాడలేదు. నేను ఆ షూటింగ్ చూస్తూ ఆ డైలాగ్ నేర్చుకోవడంతో చెయ్యి ఎత్తాను. అప్పుడు నువ్వు చెప్తావా అని కోదండ రామిరెడ్డి అంటే చెప్తాను అని వెంటనే డైలాగ్ చెప్పి చూపించాను. దాంతో మెచ్చుకొని ఆ ఆర్టిస్ట్ బట్టలు నాకు ఇచ్చి నాతో ఆ సీన్ చేయించారు. టేక్ లో యాక్టింగ్ చూసి అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు బాలయ్య లేరు ఆ షూట్ లో. షూట్ అయ్యాక అక్కడ జూనియర్ ఆర్టిస్టులను చూసేవాళ్ళు నా పేరు, డీటెయిల్స్ తీసుకున్నారు.

ఆ తర్వాత నేను బాగా చేసాను అని ఈ షూట్ జరిగిన కొన్నాళ్లకే ‘ఈ ప్రశ్నకు బదులేది’ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత కోడి రామకృష్ణ గారు ఆహుతి, అంకుశం సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. అంకుశంలో నా క్యారెక్టర్ బాగా పేలడంతో వరుస ఛాన్సులు వచ్చాయి. అంకుశం తర్వాత ఒకేసారి 10 సినిమాలు ఛాన్సులు వచ్చాయి. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీలో కూడా పది సినిమాలు చేస్తున్నాను అని తెలిపారు.

Also Read : Babu Mohan : మా చిరు అన్న తమ్ముడు.. వంద రెండొందలు ఫోన్స్ చేశాను.. కానీ.. పవన్ కళ్యాణ్ పై బాబు మోహన్ వ్యాఖ్యలు..

2015 లో సినిమాలకు దూరమైన బాబు మోహన్ ఇటీవల 2023లో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో కూడా కనిపించారు. త్వరలో మరిన్ని సినిమాల్లో కనిపించనున్నారు.