Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ రివ్యూ.. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్.. ఫ్యాన్స్ కు యాక్షన్ ఫీస్ట్..
బాలయ్య బాబుపై ఫ్యాన్స్ కి కావాల్సినన్ని ఎలివేషన్స్ ఇచ్చారు.

Balakrishna Daaku Maharaaj Movie Review and Rating
Daaku Maharaaj Movie Review : బాలకృష్ణ(Balakrishna) హీరోగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేద్కర్, చాందిని చౌదరి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నిన్న జనవరి 12న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. కృష్ణమూర్తి(సచిన్ ఖేద్కర్) మదనపల్లి దగ్గర ఓ స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ తన ఫ్యామిలీతో కలిసి అదే ఊళ్ళో ఉంటాడు. అతని టీ ఎస్టేట్ లీజుకు తీసుకున్న లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు(రవిశంకర్), అతని తమ్ముడు మనోహర్(సందీప్ రాజ్) వల్ల కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవి(చైల్డ్ ఆర్టిస్ట్) ఇబ్బందుల్లో పడుతుంది. ఈ విషయం తెలిసి మధ్యప్రదేశ్ పోలీసుల దగ్గర్నుంచి డాకు మహారాజ్(బాలకృష్ణ) తప్పించుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్ నానాజీగా జాయిన్ అవుతాడు. అప్పట్నుంచి వైష్ణవిని కాపాడుకుంటూ ఉంటాడు.
కానీ బలవంత ఠాకూర్(బాబీ డియోల్)కి ఇక్కడ జరిగే విషయం తెలిసి తన మనుషులను కృష్ణమూర్తి కుటుంబం మొత్తాన్ని చంపడానికి పంపిస్తాడు. అదే సమయంలో ఓ స్పెషల్ పోలీస్(షైన్ టామ్ చాకో) పోలీసుల నుంచి తప్పించుకున్న డాకు మహారాజ్ ని పట్టుకోవడానికి వస్తాడు. అసలు డాకు మహారాజ్ కి, ఆ పాపకి ఉన్న సంబంధం ఏంటి? స్పెషల్ పోలీస్ ఆఫీసర్ డాకు మహారాజ్ ని పట్టుకున్నాడా? డాకు మహారాజ్ కి – బల్వంత్ ఠాకూర్ కి ఉన్న పాత గొడవలు ఏంటి? డాకు మహారాజ్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? సివిల్ ఇంజనీర్ సీతారామ్ డాకు మహారాజ్ గా ఎందుకు మారాడు? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత బాలయ్య డాకు మహారాజ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్, ఇందులో బాలయ్య లుక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ సినిమా చూస్తుంటే బాలయ్య సమరసింహా రెడ్డి, చిరంజీవి ఇంద్ర, కొన్ని పాత సినిమాలు గుర్తొస్తాయి. ఫస్ట్ హాఫ్ లో డాకు మహారాజ్ జైలు నుంచి తప్పించుకొని పాపని కాపాడటానికి వీళ్ళింట్లో డ్రైవర్ గా చేరి పాప మీద దాడికి వచ్చినప్పుడల్లా యాక్షన్ సీక్వెన్స్ లతో ఆమెని కాపాడుతూ ఉంటాడు. ఇంటర్వెల్ కి డాకు మహారాజ్ ఇక్కడ ఉన్నాడని పాత విలన్స్ కి తెలియడంతో, ఇతని కథేంటి అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో సివిల్ ఇంజనీర్ సీతారామ్ డాకు మహారాజ్ గా ఎందుకు మారాడు? ఈ పాపని ఎందుకు కాపాడటానికి వచ్చాడు? పాత శత్రువులు డాకు కోసం తిరిగి రావడం చూపిస్తారు.
సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా తీయడం చాలా ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ పాపతో ఎమోషన్ నడిపిస్తూనే యాక్షన్ సీక్వెన్స్ లు అదరగొట్టారు. ఇక సెకండ్ హాఫ్ లో ఒక మంచి ఎమోషన్ ని పండించి యాక్షన్ సీక్వెన్స్ లతో కూడా మెప్పించారు. ప్రీ క్లైమాక్స్ లో పాప గురించి వచ్చే ట్విస్ట్ అయితే ఎవరూ ఊహించలేరు. క్లైమాక్స్ మాత్రం రొటీన్ హీరో వర్సెస్ విలన్ అన్నట్టు ఉంటుంది. బాలయ్య బాబుపై ఫ్యాన్స్ కి కావాల్సినన్ని ఎలివేషన్స్ ఇచ్చారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. బాలకృష్ణ ఇటీవల డ్యూయల్ రోల్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇందులో ఒక పాత్రే అయినా నానాజీ, సీతారామ్, డాకు మహారాజ్ మూడు వేరియేషన్స్ లో అదరగొట్టారు అని చెప్పొచ్చు. ప్రగ్య జైస్వాల్ చిన్న పాత్రే అయినా కనపడిన కాసేపు మెప్పించింది. శ్రద్ధ శ్రీనాథ్ కూడా కీలక పాత్రలో మెప్పించింది. నెగిటివ్ రోల్ లో బాబీ డియోల్ క్రూరత్వం బాగానే పండించాడు. వైష్ణవి పాత్రలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తన క్యూట్ నటనతో మెప్పించింది. డైరెక్టర్ సందీప్ రాజ్ మనోహర్ గా నెగిటివ్ పాత్రలో కాసేపు కనిపించి బాగానే నటించాడు. సచిన్ ఖేద్కర్, చాందిని చౌదరి, షైన్ టామ్ చాకో, సత్య, ఊర్వశి రౌటేలా, దివి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజయినప్పుడే అందరూ సినిమాటోగ్రఫీ విజువల్స్ గురించి మాట్లాడుకున్నారు. తమిళ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్, నైట్ సీన్స్ అయితే మరింత అందంగా చూపించారు. ఇక బాలయ్య అనగానే తమన్ తన బ్యాక్ గ్రౌండ్ తో రెచ్చిపోతాడని తెలిసిందే. ఈ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ లో అదిరిపోయే BGM ఇచ్చి, ఎమోషన్ సీన్స్ లో హృదయానికి హత్తుకునేలా బ్యాక్ గ్రౌండ్ ఇచ్చి అదరగొట్టాడు తమన్. పాటలు కూడా బాగున్నాయి.
ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయుధాలు, చంబల్ సెటప్ కోసం బాగానే కష్టపడ్డారు. బాలయ్య డాకు మహారాజ్ గెటప్ కాస్ట్యూమ్స్ కూడా బాగా డిజైన్ చేసారు. ఇక డైరెక్టర్ బాబీ పాత కథనే తీసుకున్నా చాలా కొత్తగా, ఎవరూ ఊహించలేని ఓ ట్విస్ట్ తో సరికొత్తగా చెప్పాడు. నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు నిర్మాతలు.
Also Read : Mazaka Teaser : సందీప్ కిషన్ ‘మజాకా’ టీజర్ వచ్చేసింది.. తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రేమలో పడితే..
మొత్తంగా ‘డాకు మహారాజ్’ సినిమా జనాల కోసం ఓ సివిల్ ఇంజనీర్ డాకు మహారాజ్ గా ఎందుకు మారాడు, పాప కోసం ఎందుకు నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషన్ పండించారు. డాకు మహారాజ్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్.. ఫ్యాన్స్ కు యాక్షన్ ఫీస్ట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.