బాలకృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు..

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ సినిమా వాళ్లందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరూ షూటింగ్‌లకు వెళ్లే సాహసం చేయడం లేదు. ప్రభుత్వాలు అనుమతులను ఇచ్చినా, పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా.. ఇప్పట్లో షూటింగ్స్‌కు వెళ్లకుండా ఉండటమే బెటర్ అనుకుంటున్నారు. అయితే ఇంట్లో ఉన్నా కూడా కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. దీనిలో భాగంగా నందమూరి నటసింహం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌లోని అందరికీ ముందు జాగ్రత్త చర్యలుగా కరోనా నిరోధానికి సంబంధించిన హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్‌ను పంపిస్తూ.. గొప్ప మనసు చాటుకుంటున్నారు.
ఈ విషయాన్ని తాజాగా సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ తెలిపారు.
వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. ‘‘ముందు జాగ్రత్తగా కరోనా నిరోధానికి హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్‌ను నాకు బసవతారకం హాస్పిటల్ ద్వారా నందమూరి బాలకృష్ణగారు పంపించారు. నాకే కాదు ఈ మెడిసిన్‌ను ఆయన 24 క్రాఫ్ట్స్‌కు చెందిన అందరికీ పంపిస్తున్నారు. నన్ను గుర్తుపెట్టుకుని మరీ పంపినందుకు బాలకృష్ణగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ..’’ అని అన్నారు.