మీటూ : ఆ నిర్మాత నాతో అసభ్యంగా ప్రవర్తించాడు

సినీ రంగంలో గత ఏడాది మీటూ ఉద్యమం సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. పత్రికా రంగంతో సహా దేశవ్యాప్తంగా లైంగిక వేధింపులకు గురైన మహిళలందరూ ధైర్యంగా తమ గళం విప్పి తాము అనుభవించిన బాధను బయటపెట్టారు. ఇప్పుడు ఈ సెగ బెంగాలీ చిత్ర పరిశ్రమను తాకింది. ప్రముఖ బెంగాలీ బుల్లి తెరనటి రూపంజన మిత్రా తనను దర్శకుడు అరిందం సిల్ లైంగికంగా వేధించాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పటంతో సంచలనం గా మారింది.
రూపంజన మిత్రా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘భూమికన్యా’ సీరియల్ నిర్మాత అరిందమ్ సిల్ ఆఫీసులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. ‘ఈ సీరియల్ మొదటి ఎసిసోడ్ కోసం స్క్రిప్ట్ చదవాలంటూ అరిందమ్ సిల్ కలకత్తాలోని తన ఆఫీసుకు రమ్మని చెప్పాడు. నేను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆఫీసుకు వెళ్లాను. లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. నేను, ఆయన మాత్రమే ఉన్నాము.
నేను లోపలికి వెళ్లిన కాసేపటికీ ఆయన నా తల నుంచి వీపుకు వరకు చేతితో తడమడం మొదలు పెట్టాడు. ఎవరైనా వచ్చి నన్ను అక్కడి నుంచి బయటపడేస్తే బాగుండనకుంటూ దేవుడికి ప్రార్థించాను. అతని వికృత చేష్టలు భరించలేక స్క్రిప్ట్ గురించి చెప్పండి అన్నాను. ఆయన ఎత్తుగడలు నాదగ్గర పనిచేయవని ఆయనకు అర్ధం అయి… ఆ తర్వాత స్క్రిప్ట్ గురించి వివరించడం మొదలు పెట్టాడు.
కొద్ది సేపటికి ఆయన భార్య ఆఫీసులోకి వచ్చింది. ఇక నేను హమ్మయ్యా.. బతికిపొయాననుకొన్నాను. నా ప్రార్థన విన్న దేవుడికి మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాను. ఆ సీరియల్ ప్రసారమయ్యే ఛానల్ తో నాకు ఒప్పందం ఉన్నందున నేను ఆవిషయాన్ని అప్పట్లో బయటకు చెప్పలేక పోయాను. ఛానల్ పరువుకు నష్టం కలిగించే పనులు చేయకూడదని కాంట్రాక్ట్ లో ఉండటంతో మాట్లాడలేకపోయానని ఆమె వివరించింది.
కాగా… నిర్మాత అరిందమ్ సిల్ అలాంటిదేం లేదని, రూపంజన నేను పాత స్నేహితులమంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశాడు. అమె ఇలా ఎందుకు చెప్పిందో నాకు తెలియదు, మేమిద్దరం మంచి స్నేహితులం అని అన్నారు. రూపాంజన మిత్రా బెంగాలీ బుల్లి తెర పాపులర్ నటి. సిందూర్ ఖేలా’, ‘సోతి’, ‘ఏక్‌ఆకాష్’ వంటి సీరియల్‌లో నటించిన రూపంజన మిత్రా బెంగాలీ బుల్లితెర నటులలో ఒకరుగా మారారు. ఇక దర్శకుడు, నటుడైన అరిందమ్ సిల్ ‘హర్ హర్ బ్యోమకేష్’, ‘ఈగోలర్ ఛోఖ్’, ‘దుర్గా సోహాయ్’ వంటి ప్రముఖ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ‘