ముంబైలో నటి అనుపమ ఆత్మహత్య

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతుండగా.. లేటెస్ట్‌గా భోజ్‌పురి నటి అనుపమ పాథక్(40) ఆత్మహత్య చేసుకుంది. ఆగస్టు 2 న ఆమె దహిసార్ లోని తన అపార్టుమెంట్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అనుపమా ఆత్మహత్య చేసుకునే ముందు 10 నిమిషాల నిడివి గల వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీనిలో, ఆమె ఎందుకు ఆత్మహత్య చర్యలు తీసుకోవలసి వచ్చింది అనే విషయాలను వివరించారు. అనుపమ పాథక్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ఒక రోజు ముందు అనుపమ పాఠక్ ఫేస్ బుక్ లైవ్ లో కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. అంతేకాదు రెండు కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు సూసైడ్ నోట్‌లో వెల్లడించారు. మే నెలలో లాక్‌డౌన్ సమయంలో మనీష్ ఝా అనే వ్యక్తి నా ద్విచక్ర వాహనాన్ని తీసుకున్నాడు. నేను తిరిగి ముంబైకి వచ్చాక మనీష్ వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు.
రెండవ కారణం, నేను విజ్‌డమ్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే నిర్మాణ సంస్థలో పది వేల రూపాయలు పెట్టుబడి పెట్టానని అనుపమ చెప్పారు. నా స్నేహితుల్లో ఒకరి కోరిక మేరకు పెట్టుబడి పెట్టాను. నిబంధనల ప్రకారం డిసెంబర్ 2019లో ఆ కంపెనీ రావాల్సిన డబ్బును తిరిగివ్వాలి. కానీ ఇవ్వకుండా కంపెనీ ఇబ్బంది పెడుతోందని ఆమె రాసుకొచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి మరిచిపోకముందే, నటుడు సమీర్ శర్మ కూడా ముంబైలోని తన ఫ్లాట్‌లో చనిపోయాడు. ఈ క్రమంలోనే అనుపమా పాథక్ చనిపోవడంతో బాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. అనుపమ పాథక్ చాలా టీవీ సీరియళ్లలో చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.