Bootcut Balaraju : ‘బూట్‌కట్ బాలరాజు’ రివ్యూ.. అసలు ఈ బూట్ కట్ కథేంటి?
బూట్‌కట్ బాలరాజు తన ప్రేమ కోసం ఊరిపెద్దతో ఛాలెంజ్ చేసి ఎలా గెలిచాడు అనే కథని కామెడీ, ఎమోషనల్ గా చూపించారు.

Bigg Boss Fame Sohel BootCut Balaraju Movie Review and Rating
Bootcut Balaraju : బిగ్‌బాస్(Bigg Boss) తో ఫేమ్ తెచ్చుకున్న సోహెల్(Sohel) హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన సినిమా ‘బూట్‌కట్ బాలరాజు’(BootCut Balaraju). మేఘలేఖ హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్(Sunil), ఇంద్రజ(Indraja), అవినాష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. మొదట గతంలో.. పటేలమ్మ(ఇంద్రజ) తండ్రి(సుమన్)కి ఇచ్చిన మాట కోసం భర్తని కూడా వదిలేసి ఊరిపెద్దగా మారుతుంది. పటేలమ్మ కూతురు మహాలక్ష్మిని(మేఘలేఖ) చిన్నప్పట్నుంచి అందరూ గౌరవంగా, భయంగా చూస్తారు కానీ దగ్గరకు ఎవరు రారు. స్కూల్ లో కూడా అదే పరిస్థితి. ఆ సమయంలో బాలరాజు(సోహెల్) మహాలక్ష్మిని కూడా అందరిలాగే ట్రీట్ చేయడంతో మహాలక్ష్మి బాలరాజుతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అక్కడ్నుంచి ప్రస్తుతానికి కథని తీసుకొస్తారు.
బాలరాజు తన ఫ్రెండ్స్(అవినాష్, సద్దాం)..తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ, కాలేజీ చదువుకుంటారు. అదే కాలేజీలో సిరి(సిరి హనుమంతు) బాలరాజుని ప్రేమిస్తుంది. చిన్నప్పట్నుంచి బాలరాజుతో క్లోజ్ ఫ్రెండ్ గా పెరిగిన మహాలక్ష్మి అనుకోకుండా బాలరాజుతో ప్రేమలో పడుతుంది. సిరి తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నప్పుడే మహాలక్ష్మి తన ప్రేమని బాలరాజుకు చెప్పేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో ఉంటారు. ఒకరోజు మహాలక్ష్మి ఇంట్లో ఎవరూ లేనప్పుడు బాలరాజు వెళ్తాడు. వీళ్ళిద్దరూ కౌగలించుకొని ఉన్నప్పుడు పటేలమ్మ మహాలక్ష్మికి ఇంకో సంబంధం మాట్లాడి వచ్చి వీరిద్దర్నీ చూస్తుంది.
దీంతో బాలరాజు పేరెంట్స్ ని పిలిపించి సోహెల్ ని కొట్టి ఊరు వదిలి వెళ్ళిపోవాలి అంటుంది. మాట మాట పెరిగి బాలరాజు కూడా పటేలమ్మని అందరూ ఓట్లు వేస్తే నువ్వు సర్పంచ్ అవ్వలేదు మీకు మీరే అనుకున్నారు అని ఎదిరిస్తాడు. దీంతో నా మీద గెలిచి సర్పంచ్ అయితే తన కూతురిని బాలరాజుకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంది. దీనికి బాలరాజు ఛాలెంజ్ విసిరి ఓకే అంటారు. మరి ఊళ్ళో మంచి పేరు లేని బాలరాజు సర్పంచ్ అయ్యాడా? తన ప్రేమ దక్కిందా? పటేలమ్మ ఇచ్చిన మాట ఏమైంది? సర్పంచ్ అవ్వడం కోసం బాలరాజు పడ్డ కష్టాలేంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. డబ్బులేని అబ్బాయి, డబ్బున్నోళ్ల కూతురిని ప్రేమించి ఆమెని దక్కించుకోవడానికి ఏదో ఒక ఛాలెంజ్ చేసి గెలవడం అనేది గతంలో చాలా సినిమాల్లో చూసాము. ఈ బూట్‌కట్ బాలరాజు కూడా ఇంచుమించు అలాంటి సినిమానే. మొదటి హాఫ్ అంతా పటేలమ్మ గురించి, మహాలక్ష్మి, బాలరాజు స్నేహం, ప్రేమలో పడటం, బాలరాజు అతని ఫ్రెండ్స్ చేసే కామెడీతో సాగిపోతుంది. ఇంటర్వెల్ కి బాలరాజు, మహాలక్ష్మి కౌగలించుకొని ఉన్నప్పుడు పటేలమ్మ చూడటంతో ఏం జరుగుతుందా అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో బాలరాజు సర్పంచ్ అవ్వడానికి ఏం చేసాడు అనే కథనంపైనే సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా మొదట అంతా కామెడీగా చూపించినా చివర్లో ప్రేమ ఎమోషన్ ని వర్కౌట్ చేశారు. ఇక బాలరాజు బూట్ కట్ అని సల్మాన్ ఖాన్ ప్యాంట్స్ చూసి పెట్టుకున్నాను అని చిన్నప్పుడే చెప్పడం గమనార్హం. ఆ పాయింట్ తోనే సినిమాకు బూట్ కట్ బాలరాజు అని పేరు పెట్టడం అంతా కన్విన్సింగ్ గా అయితే అనిపించదు. చివర్లో ఎన్నికల్లో తనకు బూట్ కట్ ప్యాంట్ గుర్తు పెట్టుకోవడం విశేషం. సినిమాలో కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు.
Also Read : Jimmy Donaldson : 1000 మంది అంధులకు సాయం చేసిన యూట్యూబర్.. చివరికి తనకు
నటీనటులు.. బిగ్ బాస్ తో మెప్పించిన సోహెల్ ఈ సినిమాలో హైపర్ యాక్టివ్ గా ఉండే కుర్రాడిగా, ఫుల్ కామెడీ చేస్తూ మెప్పించాడు. చివర్లో ఎమోషన్ కూడా పండించాడు సోహెల్. ఇక హీరోయిన్ మేఘలేఖ పద్దతిగల పల్లెటూరి అమ్మాయిలా చాలా క్యూట్ గా నటించింది. పటేలమ్మగా ఇంద్రజ అదరగొట్టిందనే చెప్పాలి. మహాలక్ష్మి ఫ్రెండ్ గా సిరి హన్మంతు, పటేలమ్మ భర్త పాత్రలో రాజీవ్ కనకాల, బాలరాజు ఫ్రెండ్స్ గా అవినాష్, సద్దాం, ఓ ముఖ్య పాత్రలో సునీల్.. ఓకే అనిపిస్తారు.
సాంకేతిక విషయాలు.. సినిమా అంతా తెలంగాణలోని ఓ పల్లెటూళ్ళో జరుగుతుంది. పల్లెటూరిలో వాతావరణం కెమెరా విజువల్స్ లో చక్కగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. రెండు పాటలు మాత్రం వినడానికి, చూడటానికి బాగుంటాయి. మిగిలినవి ఓకే అనిపిస్తాయి. కథ పాతదే అయినా దర్శకుడిగా శ్రీనివాస్ కోనేటి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలి. సోహెల్ కాస్ట్యూమ్స్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మిగిలిన అందరివి కూడా కథకి తగ్గట్టు సెట్ చేశారు.
మొత్తంగా బూట్‌కట్ బాలరాజు తన ప్రేమ కోసం ఊరిపెద్దతో ఛాలెంజ్ చేసి ఎలా గెలిచాడు అనే కథని కామెడీ, ఎమోషనల్ గా చూపించారు. ఈ సినిమాకు రేటింగ్ 2.5 ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.