Sharathulu Varthisthai : ‘షరతులు వర్తిస్తాయి’ టీజర్ రిలీజ్.. చిరంజీవి – విజయశాంతిల ప్రేమకథ..
'షరతులు వర్తిస్తాయి' టీజర్ రిలీజ్.. చిరంజీవి - విజయశాంతిల ప్రేమకథ..

Chaitanya Rao Sharathulu Varthisthai Teaser Released
Sharathulu Varthisthai : చైతన్య రావు(Chaitanya Rao), భూమి శెట్టి జంటగా నటించిన సినిమా ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకత్వంలో స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టగా ఇటీవల ఈ సినిమా నుంచి ఓ పెళ్లి సాంగ్ రిలీజ్ చేయగా అది బాగా వైరల్ అయింది.
తాజాగా షరతులు వర్తిస్తాయి సినిమా టీజర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ తో పాటు దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. టీజర్ లో హీరో తన పేరు చిరంజీవి అని, తన చుట్టూ ఉండేవాళ్ళని పరిచయం చేస్తూ చివరగా తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విజయశాంతి అని పరిచయం చేస్తాడు. టీజర్ ఆసక్తిగా ఉంది.
టీజర్ లాంచ్ అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. మామిడి హరికృష్ణ గారితో బలగం సినిమా చేసిన టైమ్ లో పరిచయం ఏర్పడింది. రవీంద్రభారతిలో సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఔత్సాహికులకు కల్చరల్ డిపార్ట్ మెంట్ ద్వారా ఇస్తున్న ట్రైనింగ్, ఇతర కార్యక్రమాల గురించి తెలిసి హ్యాపీగా ఫీలయ్యా. షరతులు వర్తిసాయి సాంగ్, టీజర్ చూశాను. చాలా బాగున్నాయి. బలగం కంటే ఎక్కువగా తెలంగాణ నేటివ్ తో తెరకెక్కించారు అని మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
డైరెక్టర్ బలగం వేణు మాట్లాడుతూ.. ఈ సినిమా డైరెక్టర్ కుమారస్వామి నాతో దాదాపు పదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాడు. రెండేళ్ల క్రితమే ఈ స్క్రిప్ట్ చదివాను. దర్శకుడు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్, చెప్పాలనుకున్న అంశాలు బాగుంటాయి. కష్టపడి కుమారస్వామి ఈ సినిమాని తెరకెక్కించాడు. మధ్య, దిగువ, వెనకబడిన ప్రజల జీవితాల్లోని లైఫ్ స్టైల్, ఎదగాలనే తపనతో తెలంగాణ నేటివిటీలో తెరకెక్కించాడు. షరతులు వర్తిస్తాయి సినిమా సమాజంలో చర్చకు దారితీసే సినిమా అవుతుంది అని అన్నారు.