Dhoom Dhaam : ‘ధూం ధాం’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

థియేటర్ కి వెళ్లి ఫుల్ గా నవ్వుకొని ఎంటర్టైన్ అవ్వాలంటే 'ధూం ధాం' సినిమా చూసేయండి.

Dhoom Dhaam : ‘ధూం ధాం’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

Chetan Hebah Patel Dhoom Dhaam Movie Review and Rating

Updated On : November 8, 2024 / 6:54 PM IST

Dhoom Dhaam : చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ప్రవీణ్, నవీన్, వినయ్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్, హర్షిణి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ధూం ధాం సినిమాను తెరకెక్కించారు. స్టార్ రైటర్ గోపీ మోహన్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ధూం ధాం సినిమా నేడు నవంబర్ 8న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. కార్తికేయ(చేతన్ కృష్ణ) అంటే వాళ్ళ నాన్న(సాయి కుమార్)కు ప్రాణం. అతనే అన్నిట్లో బెస్ట్ గా ఉండటానికి ఏదైనా చేస్తాడు. కార్తికేయ దగ్గరకు ఓ రోజు సడెన్ గా సుహాన(హెబ్బా పటేల్) వచ్చి అతను బాగా తెలిసినట్టు మాట్లాడుతుంది. కార్తికేయ ఆమె ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కార్తికేయ వెకేషన్ కు పోలాండ్ వెళ్తే సుహాన అక్కడికి కూడా వచ్చేస్తుంది. అక్కడ సుహాన అతన్ని ప్రేమలో పడేస్తానని బెట్ కట్టిన విషయం తెలిసి పోలాండ్ లో ఉన్న ఓ తెలుగమ్మాయి(హర్షిణి)తో పెళ్లి సంబంధం కోసం ట్రావెల్ అవుతాడు. కాని ఆ అమ్మాయి తనకు కరెక్ట్ కాదని, సుహాన ప్రేమ నిజమని తెలిసి మళ్ళీ సుహానతో కార్తికేయ ప్రేమ వ్యవహారం నడుపుతాడు.

అయితే సుహాన వాళ్ళ నాన్న మహేంద్ర భూపతి(వినయ్ వర్మ), అతని అన్నయ్యలు భూపతి బ్రదర్స్ ఎవరో తెలిసి కార్తికేయ, అతని ఫ్రెండ్స్ షాక్ అవుతారు. ఇది తెలియక కొడుకు కోసం కార్తికేయ తండ్రి సుహాన వాళ్ళింటికి వెళ్తే దారిలోనే సుహాన తండ్రి, బాబాయ్ అతన్ని కొడతారు. సుహాన అక్కతో కార్తికేయ కజిన్ సుహాస్(వెన్నెల కిషోర్)తో పెళ్లి నిశ్చయమవుతుంది. ఇది తెలియక కార్తికేయ, అతని ఫ్రెండ్స్ సుహాస్ పెళ్ళికి వెళ్లి అక్కడ సుహాన, భూపతి బ్రదర్స్ ని చూసి షాక్ అవుతాడు. అసలు సుహాన తండ్రిని, భూపతి బ్రదర్స్ ని చూసి కార్తికేయ అతని ఫ్రెండ్స్ ఎందుకు భయపడుతున్నారు? భూపతి బ్రదర్స్ కార్తికేయ నాన్నను ఎందుకు కొట్టారు? అసలు వీళ్లకు ఉన్న వైరం ఏంటి? సుహాస్ పెళ్లి జరిగిందా? పెళ్ళిలో కార్తికేయ, అతని ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితులు చూసారు? కార్తికేయ – సుహాన ప్రేమను భూపతి బ్రదర్స్ ఒప్పుకున్నారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Appudo Ippudo Eppudo : ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ.. రుక్మిణి వసంత్ ఫస్ట్ తెలుగు సినిమా ఎలా ఉందంటే..

సినిమా విశ్లేషణ.. ఎక్కువగా శ్రీను వైట్ల సినిమాలకు రచయితగా పనిచేసిన స్టార్ రైటర్ గోపి మోహన్ ఈ సినిమాకు కథ అందించడంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ముందే ఫిక్స్ అయ్యారు. అయితే గతంలో రెడీ, ఢీ.. లాంటి పలు సినిమాల్లో లాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది. హీరో, హీరోయిన్ ప్రేమించుకోవడం, హీరో, అతని తండ్రికి హీరోయిన్ ఫ్యామిలీతో ఏదో విబేధాలు ఉండటం, చివర్లో ఓ పెళ్ళిలో అందరితో కామెడీ జనరేట్ చేస్తూ హీరో హీరోయిన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడంతో కథ ముగుస్తుంది. ఇలాంటి పాయింట్ లో చాలా సినిమాలు వచ్చినా తండ్రి కొడుకుల ప్రేమ చుట్టూ ఇలాంటి కథ రాసుకోవడం ఇదే మొదటిసారి. తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి చేసిన ఓ పనితో కథ మలుపులు తిరుగుతుంది.

ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టర్, హీరో – హీరోయిన్ ప్రేమతో సాగుతుంది. ఇంటర్వెల్ ముందు హీరోకు – హీరోయిన్ ఫ్యామిలీకి ఉన్న వైరం చూపించి ట్విస్ట్ ఇస్తారు. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ పెళ్ళికొడుకు హీరో కజిన్ అవ్వడంతో హీరో, అతని ఫ్రెండ్స్, ఫ్యామిలీ హీరోయిన్ ఇంట్లో పెళ్ళికి రావడం అక్కడ భయం భయంగా ఉండటం, వీళ్ళను పెళ్లి కొడుకు కాపాడటం ఫుల్ కామెడీతో నడిపించారు. ఫస్ట్ హాఫ్ లోనే కొంత కామెడీ పర్వాలేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం పడి పడి నవ్వుకోవాల్సిందే. వెన్నెల కిషోర్ అయితే తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టి నవ్విస్తాడు. సంగీత్ లో మంగ్లీ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి ఓ సాంగ్ తో దుమ్ము దులిపేస్తుంది. క్లైమాక్స్ మాత్రం రెగ్యులర్ గా అనిపిస్తుంది.

Image

నటీనటుల పర్ఫార్మెన్స్.. గతంలో బీచ్ రోడ్ చేతన్, ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాలతో మెప్పించిన చేతన్ కృష్ణ మొదటి సారి కమర్షియల్ సినిమాలో బాగానే నటించాడు. హెబ్బా పటేల్ కూడా చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా మెప్పించింది. వెన్నెల కిషోర్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. భూపతి బ్రదర్స్ గా గోపరాజు రమణ రాజు, వినయ్ వర్మ, బెనర్జీ బాగా నటించారు. హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ గా ప్రవీణ్, నవీన్, బిగ్ బాస్ రతిక.. పలువురు మెప్పించారు. సాయి కుమార్ తండ్రి పాత్రలో మంచి ఎమోషన్ పండించారు. హర్షిణి సంప్రదాయంగా కనిపించి వావ్ అనిపిస్తునే మోడ్రన్ గా కనిపించి షాక్ ఇస్తుంది. పృథ్వీ రాజ్, గిరిధర్.. మిగిలిన నటీనటులు కూడా బాగా నటించి మెప్పించారు. మంగ్లీ సాంగ్ లో తన స్టెప్పులతో అదరగొట్టింది. చివర్లో మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సరదాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. పాటలు బాగున్నాయి. మంగ్లీ పాడిన సాంగ్ అయితే అదిరిపోయంది. త్వరలో తెలంగాణ పెళ్లిల్లో ఈ పాట బాగా వినిపిస్తుంది. పోలాండ్ లొకేషన్స్ అందంగా చూపించారు. కథ, స్క్రీన్ ప్లే రెగ్యులర్ అయినా దానికి తండ్రి – కొడుకు ఎమోషన్ జతచేసి కొత్తగా చూపించారు. కామెడీ డైలాగ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. దర్శకుడు సాయి కిషోర్ అంతమంది ఆర్టిస్టులను బాగానే మేనేజ్ చేసి పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. ఇక చిన్న హీరో అయినా, ఎక్కువ మంది ఆర్టిస్టులు, విదేశాల్లో షూట్.. వీటన్నికి బాగానే ఖర్చుపెట్టి నిర్మాతలు మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు.

మొత్తంగా ‘ధూం ధాం’ సినిమా థియేటర్ కి వెళ్లి ఫుల్ గా నవ్వుకొని ఎంటర్టైన్ అవ్వాలంటే చూసేయండి. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.