Kara Review : ‘కర’ మూవీ రివ్యూ.. దొంగ పాత్రలో ధనుష్.. సినిమా ఎలా ఉందంటే..?
Kara Review in Telugu: ధనుష్ ఇటీవల ఎమోషనల్, సెంటిమెంట్ సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. (Kara Review)
Dhanush Kara Movie Review Telugu
Kara Review in Telugu: తమిళ్ స్టార్ హీరో ధనుష్, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘కర’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐషరి కె గణేష్ నిర్మాణంలో విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలపై సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ విడుదల చేసారు. కర సినిమా నేడు ఏప్రిల్ 30న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల అయింది.
కథ విషయానికొస్తే..
కరస్వామి(ధనుష్) ఒక దొంగ. తన చివరి దొంగతనం చేసి మానేయాలి అనుకుంటాడు. తనతో పాటు తన ఫ్రెండ్ ని దొంగతనానికి తీసుకువెళ్తాడు. అదే సమయానికి ఇంట్లో వాళ్ళందరూ రావడంతో కరస్వామిని వదిలేసి ఫ్రెండ్ పారిపోతాడు. కరస్వామిని పోలియులకు అప్పచెప్తారు. డిఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి ఈ కేసు వస్తుంది. భరతన్ రిటర్మెంట్ దగ్గరలో ఉండటంతో తన పేరు బాగా పాపులర్ అవ్వాలని కరస్వామిపై చేయని దొంగతనాలు, లేనిపోని కేసులు అతనిపై పెట్టాలని ప్లాన్ చేస్తాడు. దీంతో కరస్వామి అతనిని కొట్టి పారిపోతాడు.
ఆ తర్వాత కరస్వామి తన ప్రియురాలు మల్లి(మమిత బైజు)ని పెళ్లి చేసుకొని ఎవరికీ తెలియకుండా దూరంగా ఒక హోటల్లో పని చేస్తూ ఉంటాడు. సంపాదించే డబ్బులు సరిపోకపోవడం, మల్లి కష్టం చూడలేక ఒక హోటల్ పెడదామనుకొని డబ్బుల కోసం బ్యాంక్ కి వెళ్తే ఏదైనా షూరిటీ ఉంటేనే డబ్బులు ఇస్తామనడంతో తన సొంతూరులో ఉన్న పొలం కాగితాలు తెచ్చుకుందామని 16 ఏళ్ల తర్వాత సొంతూరుకి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లాక పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు ఉన్నాయని, తండ్రి(కేఎస్ రవికుమార్) అప్పుల్లో ఉన్నాడని తెలుస్తుంది. కర స్వామి డబ్బుల కోసమే తిరిగివచ్చాడని తెలియడంతో బాధతో తండ్రి చనిపోతాడు. తండ్రి శవాన్ని పొలంలోనే పూడ్చి పెట్టాలనే ఆయన కోరిక తీర్చాలనుకుంటే బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టలేదని, పొలంలో ఏమి చేయకూడదు అని కోర్టు నోటీసు తెస్తారు. దీంతో తన తండ్రి శవాన్ని పొలంలో పూడ్చడానికి, లోన్ తీర్చడానికి డబ్బులు కావాలని మళ్లీ దొంగతనం చేయాలనుకుంటాడు కర. ఏ బ్యాంకు అయితే తండ్రికి అప్పిచ్చి లోన్ తో ఇబ్బంది పెడుతుందో అదే బ్యాంకులో దొంగతనం చేయాలని అనుకుంటాడు. మరి కర మళ్ళీ దొంగతనం చేస్తాడా? డిఎస్పీ భరతన్ కరని పట్టుకుంటాడా? తండ్రి శవాన్ని పొలంలో పూడ్చిపెడతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : ధనుష్ ‘కర’ సినిమా ఫస్ట్ రివ్యూ.. దొంగగా ధనుష్.. మళ్ళీ హిట్ కొడతాడా?
సినిమా విశ్లేషణ..
ధనుష్ ఇటీవల ఎమోషనల్, సెంటిమెంట్ సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాయన్, ఇడ్లీ కొట్టు, తేరే ఇష్క్ మేన్.. ఇలా వరుసగా సినిమాల్లో యాక్షన్ ఉన్నా ఎక్కువగా సెంటిమెంట్ తోనే నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ కర కూడా అలాగే తెరకెక్కించారు.
ఫస్ట్ హాఫ్ అంతా ధనుష్ పాత్ర, తండ్రి సెంటిమెంట్, ధనుష్ దొంగతనాలు ఆపేసి బతకాలనుకోవడం, మళ్ళీ దొంగతనానికి వెళ్లడంతో సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంక్ దొంగతనం సీన్ అదిరిపోతుంది. దాంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ కాస్త సస్పెన్స్, మళ్ళీ బ్యాంక్ దొంగతనాలతో నడిపించి చివర్లో మళ్ళీ తండ్రి ఎమోషన్, రైతుల ఎమోషన్ తో ముగించారు.
ఈ డైరెక్టర్ ఫస్ట్ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అదిరిపోతుంది. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ మార్క్ కంటే కూడా ధనుష్ మార్క్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవలే ధనుష్ ఇడ్లి కొట్టు సినిమాలో తండ్రి ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టించాడు. మళ్ళీ వెంటనే తండ్రి ఎమోషన్ తో సినిమా చేయడం గమనార్హం. అయితే ఫస్ట్ హాఫ్ లో ఆ తండ్రి ఎమోషన్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది.
ఇక కర పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఏంటి? 16 ఏళ్లకే ఇంట్లోంచి పారిపోయిన కర ఏం చేసాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. మొదట పారిపోయిన ఫ్రెండ్ మళ్ళీ ఎందుకు వచ్చాడు, కర కి ఎందుకు హెల్ప్ చేసాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. మమిత బైజు పాత్ర గురించి, అసలు వీళ్లిద్దరి ప్రేమ కథేంటి అనేది కూడా చూపించలేదు. సినిమా అంతా కర పాత్ర దొంగతనం, తండ్రి ఎమోషన్, పోలీస్ కరని పట్టుకోడానికి వేసే స్కెచ్ లతోనే సాగుతుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ సింపుల్ గా నిదానంగా సాగినా ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా పరిగెడుతుంది. అయితే సినిమాలో బ్యాంక్స్ ని చాలా నెగిటివ్ గా చూపించారు. బ్యాంకులో లోన్స్ తీర్చలేకపోతే బ్యాంకులన్ని దోచుకోవాలి అని నెగిటివ్ గా చూపించడం గమనార్హం. సినిమా చూస్తే దర్శకుడికి బ్యాంకులపై పర్సనల్ గా కోపం ఉందేమో అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
ధనుష్ ఎప్పట్లాగే తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఇన్నాళ్లు క్యూట్ గా కనిపించిన మమిత బైజు ఈ సినిమాలో కాసేపే కనిపించినా డీ గ్లామరేజ్ రోల్ లో చాలా బాగా నటించింది. తండ్రిగా కెఎస్ రవికుమార్ ముసలి పాత్రలో అదరగొట్టేశాడు. జయరాం బ్యాంక్ మేనేజర్ పాత్రలో పర్వలేదనిపించారు. పోలీస్ పాత్రలో సూరజ్ వెంజర్మూడు నెగిటివ్ షేడ్స్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. కరుణాస్, పృథ్వీ రాజన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.
Also Read : Dhanush : మోకాళ్ళ మీద కూర్చొని.. స్టేజిపై ధనుష్ లేడీ ఫ్యాన్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. జీవి ప్రకాష్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. రెండు పాటలు బాగుండగా మిగిలిన బిట్ సాంగ్స్ మాత్రం అంతగా మెప్పించలేదు. సినిమా అంతా 90స్ బ్యాక్ డ్రాప్ లో జరగడంతో దాని తగ్గట్టు ఆర్ డిపార్ట్మెంట్ బాగానే పని చేసింది. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది. రైతుల కష్టాలు, బ్యాంకు లోన్లు అనే పాత కథ తీసుకొని దానికి దొంగ, నాన్న ఎమోషన్ లను కలిపి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో రాసుకొని బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. డైరెక్టర్ మొదటి సినిమాకి దీనికి సంబంధం ఉండదు. అసలు ఆ డైరెక్టరేనా ఈ సినిమా తీసింది అనిపిస్తుంది. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై బాగానే కనిపిస్తుంది.
మొత్తంగా ధనుష్ మరోసారి తండ్రి ఎమోషన్ తో పాటు దొంగతనాల సస్పెన్స్ కథాంశంతో ‘కర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
