Director Shankar : దర్శకుడు శంకర్ కు బిగ్ షాక్.. రూ.10 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..
చట్టాలను శంకర్ ఉల్లంఘించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. నష్ట పరిహారంగా కోటి రూపాయలు ఇప్పించాలన్నారు.

Director Shankar : ప్రముఖ దర్శకుడు శంకర్ కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) షాక్ ఇచ్చింది. శంకర్ కు చెందిన 10 కోట్ల రూపాయల విలువైన మూడు స్థిరాస్తులను అటాచ్ చేసింది ఈడీ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆస్తులను అటాచ్ చేసింది. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది ఈడీ.
తన కథ జిగుబాను కాపీ కొట్టి శంకర్ రోబో సినిమా తీశారని రచయిత ఆరూర్ తమిళనాదన్ 2011లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాపీరైట్, ఐటీపీ చట్టాలను శంకర్ ఉల్లంఘించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. నష్ట పరిహారంగా కోటి రూపాయలు ఇప్పించాలన్నారు.
రచయిత ఆరూర్ తమిళనాదన్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ED దర్యాప్తు ప్రారంభించింది. శంకర్ బ్లాక్ బస్టర్ చిత్రం ఎంథిరన్ (రోబో) కథాంశం తన కథ జిగుబాను పోలి ఉందని తమిళనాదన్ ఆరోపించారు. చిత్ర నిర్మాత కాపీరైట్ చట్టం, 1957 భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్లను ఉల్లంఘించారని ఆరోపించారు.
ఈ సినిమాకు గాను శంకర్ రూ.11.5 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు తమ దర్యాఫ్తులో ఈడీ కనుగొంది. మరోవైపు ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) స్వతంత్ర నివేదిక కూడా శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయంది. శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్టు ఆ వివరాల ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన రోబో 2010లో విడుదలై ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read : ‘రామం రాఘవం’ మూవీ రివ్యూ.. ఏడిపించేసిన జబర్దస్త్ ధనరాజ్..
‘డైరెక్టర్ శంకర్, సన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కళానిధి మారన్, సన్ పిక్చర్స్‌పై మద్రాస్ హైకోర్టులో దాఖలైన సివిల్ దావాను పరిగణనలోకి తీసుకున్నాం. రజనీకాంత్ నటించిన అత్యంత విజయవంతమైన ఎంథిరన్ (2010) కథాంశం 1996లో తాను ప్రచురించిన జుగీబా కథ నుండి కాపీ చేయబడిందని రచయిత అరరూర్ తమిళనాదన్ కాపీరైట్ దావా వేశారు. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరారు’ అని ఈడీ అధికారి తెలిపారు.
రోబో సినిమా విషయానికి వస్తే.. ఒక సైంటిస్ట్ రోబోను సృష్టిస్తాడు. ఆ రోబో శాస్త్రవేత్త భాగస్వామితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆమెను దక్కించుకునేందుకు రోబో చేసే ఫైటింగ్స్ సీన్స్, అనంతరం పరిణామాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. రోబో సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. శంకర్ పేరు మార్మోగిపోయింది. ఇందులో రజనీకాంత్ సరసన ఐశ్వర్య రాయ్ నటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.290 కోట్లు వసూలు చేసింది.