Niroj Pucha : అలాంటి హీరోలే నాకు స్పూర్తి

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గోపీచంద్ లాంటి హీరోలే తన రోల్స్ మోడల్స్ అని భారతీయన్స్ చిత్ర హీరో నిరోజ్ పుచ్చా తెలిపారు.

Niroj Pucha : అలాంటి హీరోలే నాకు స్పూర్తి

Niroj Pucha

Updated On : July 29, 2023 / 8:31 PM IST

Niroj Pucha : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, గోపీచంద్ లాంటి హీరోలే తన రోల్స్ మోడల్స్ అని భారతీయన్స్ చిత్ర హీరో నిరోజ్ పుచ్చా తెలిపారు. టెన్నిస్ ఆట‌గాడైన నిరోజ్ కొంద‌రు స్నేహితుల ప్రోద్భలంవల్ల నటుడిగా మారారు. జాతీయ స్థాయిలో సైతం నిరోజ్ టెన్నిస్ ఆడిన‌ట్లు అత‌డి తండ్రి పుచ్చా రమణమూర్తి తెలిపారు.

వాస్త‌వానికి సినిమా రంగంలోకి రావాలన్న కోరిక తనకు కూడా ఉండేదని, ఆ కోరికతోనే తను చెన్నై వెళ్లి ఫిలిం ఇన్స్ స్టిట్యూట్ లో చేరే ప్రయత్నం చేశాన‌ని ర‌మ‌ణ‌మూర్తి చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి తనకు సీనియర్ అని తెలిపారు. అయితే.. కానీ కొన్ని కారణాల వల్ల తన ప్రయత్నాలు అన్నింటిని మానుకుని వెనక్కి వ‌చ్చేశాన‌న్నారు. ఇప్పుడు తన కొడుకు ఆ రంగంపై ఆసక్తి చూపడంతో ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.

నిరోజ్ పుచ్చా మాట్లాడుతూ.. ఎంతో ఇష్టంతోనే ఈ రంగంలోకి అడుగుపెట్టాన‌ని, క‌ష్ట‌ప‌డితే ఆ హీరోల్లాగానే ఎద‌గ‌వ‌చ్చున‌నే న‌మ్మ‌కంతోనే న‌టుడిగా మారిన‌ట్లు చెప్పారు. అవకాశం వస్తే హీరోగానే కాకుండా విలన్‌గా కూడా న‌టించేందుకు సిద్ద‌మ‌న్నారు. ఇక‌ భారతీయన్స్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలో తొలి అవకాశం రావడం నిజంగా త‌న అదృష్టమన్నారు. షార్ట్ ఫిలింతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన‌ట్లు చెప్పుకొచ్చారు.

Chachhinaa Chaavani Premidi Lyrical : దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ‘సందేహం’ నుంచి ‘చచ్చినా చావని ప్రేమిది’ లిరికల్

మొదట్లో బిజినెస్ మీద దృష్టి పెట్టి మిస్టర్ పులావ్ పేరుతో ఫ్రాంచైజీ బిజినెస్ నెల‌కొల్పాను. ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టాను. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా నటుడిగా ఎదగడానికి తోడ్పడింది. దర్శకుడు దీనరాజ్ భారతీయన్స్ సినిమాలో ఎంపిక చేయడం, ఎంతో కష్టపడి ఆ పాత్ర చేయడం కెరీర్ కు ఎంతో ఉపయోగపడింది అని నిరోజ్ తెలిపారు.

సినిమా రంగంలో ఎలా అడుగుపెట్టారు? అవకాశాలు ఎలా వచ్చాయి?

నేనిక్కడ మాట్లాడగలుగుతున్నానంటే మా గురువుగారు దీనరాజ్, నిర్మాత శంకర్ నాయుడు ల వల్లే. భారతీయన్స్ సినిమా నాకీ ఫ్లాట్ ఫారమ్ ను ఇచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. దీనరాజ్ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. మిస్టర్ పులావ్ ఔట్ లెట్స్ తో వ్యాపార రంగంలో ప్రవేశించాను.దీన్ని వైజాగ్ లో మొదట ప్రారంభించాను. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఫ్రాంచైజీల రూపంలో విస్తరించాను. దీనివల్ల నాకో గ్రూప్ ఏర్పడింది. అందులో ఉండే నవీన్ వర్మ అనే వ్యక్తి నుంచి సినిమా ప్రతిపాదన వచ్చింది. నీ స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగుంటుంది. మనం కలిసి సినిమా చేద్దాం అన్నాడు. అలా 2019లో నా జర్నీ షార్ట్ ఫిలింతో ప్రారంభమైంది. సారథి స్టూడియోలోనే ఆ షూటింగ్ చేశాం. దానివల్ల చాలా నేర్చుకోగలిగాను. నవీన్ అనే అతను ఆ అవకాశం ఇవ్వకపోతే నేనీరోజు ఇక్కడ ఉండకపోయేవాడినేమో. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశాను. అక్కడి నుంచి భారతీయన్స్ వరకు నా జర్నీ కొనసాగింది. ఒకసారి దీనరాజ్ గారి వద్దకు నా ఫ్రొఫైల్ వెళ్లింది. కోవిడ్ టైమ్ లో అంటే 2021లో దీనరాజ్ గారు హోటల్ కు వచ్చి నన్ను కలిసి ఆడిషన్ తీసుకున్నారు. అలా భారతీయన్స్ లో సెలక్ట్ అయ్యాను. సినిమా రిలీజ్ అయ్యేవరకు దాదాపు రెండేళ్ల జర్నీ ఇది. ఈ సినిమా రిలీజ్ కు ముందే విజయ్ అనే డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యి ఓ అవకాశం ఇచ్చారు. అది నెగిటివ్ క్యారెక్టర్. త్వరలో అది విడుదల కాబోతోంది.

హీరోనే కాకుండా ఇతర పాత్రలు కూడా చేస్తారా?

మంచి నటుడిగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అందుకే నెగిటివ్ పాత్రలు కూడా ఒప్పుకుంటున్నాను. హీరో అయితే వెల్ అండ్ గుడ్. బట్ నటుడిలాగా ఎస్టాబ్లిష్ అవ్వాలన్నదే నా కోరిక. అది హీరో అయినా ఫర్లేదు విలన్ అయినా ఫర్లేదు మంచి సినిమా చేయాలన్నదే నా కోరిక. దాని కోసమే కష్టపడుతున్నాను అలానే కథలను సెలక్ట్ చేసుకుంటున్నాను. నేను జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమానిని. ఆయనతో ఏదో ఒక రోజు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవాలని ఉంది. ఏదో ఒకరాజు ఆయనతో నటించే అవకాశం దొరుకుతుందని కోరుకుంటున్నాను. అలానే అల్లు అర్జున్ కి కూడా. వీరంతా చాలా కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చారు. ఎవరూ అంత ఈజీగా వచ్చేయలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. వీళ్లంతా ఆ పొజిషన్ లో ఉండటానికి వారు పడ్డ కష్టమే కారణం. ఏదో ఒకరోజు వీరందరితో నటించాలన్న కోరిక ఉంది. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోగొట్టుకోకుండా చేసిన మా అమ్మానాన్నలకు కూడా చాలా థ్యాంక్స్.

ఇకనుంచి సినిమాలపైనే ఇంట్రస్ట్ పెడతారా? బిజినెస్ పై కూడానా?

హండ్రెస్ పర్సంట్ సినిమాలే. చిన్నప్పట్నుంచి నా కోరిక ఇది. వెండితెర మీద ఏదో ఒకరోజు వెలిగిపోవాలనుకునేవాడిని. ఇప్పుడు నాకు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను.

Veera Simha Reddy : వీర‌సింహుని విజ‌యోత్స‌వం.. ఏపీలోని ఆ థియేట‌ర్‌లో 200 డేస్ ర‌న్ కంప్లీట్

భారతీయన్స్ తర్వాత మీకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి?

ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాను. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. నెగిటివ్ పాత్ర ఇది. సెప్టెంబరులో ఇది విడుదలవుతుంది.

తెలుగేనా, ఇతర భారతీయ భాషల చిత్రాలు కూడా చేస్తారా? 

సినిమాని ఇండియన్ సినిమా అంటున్నారుగానీ సౌత్ సినిమా, బాలీవుడ్ సినిమా, కోలీవుడ్ సినిమా అనడం లేదు. ఆర్ఆర్ఆర్ నుంచి ఆ బారియర్ తొలగిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, కాంతారా.. లాంటి వల్ల ఇండియన్ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. సో నాకు ఇండియన్ సినిమాల్లో యాక్ట్ చేయాలన్నదే నా కోరిక. నార్త్ నుంచి వచ్చి సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇది ఒక అడ్డంకి కాకూడదని నేను అనుకుంటున్నాను.

నిర్మాణ రంగంలోకి కూడా వస్తారా?

ప్రస్తుతానికైతే యాక్టింగ్ మీదే నా దృష్టి. ప్రొడక్షన్ అనేది దేవుడి నిర్ణయం. ఆ అవకాశం లేదని కూడా నేను అనను.

 మీకు పర్సనల్ గా ఎలాంటి పాత్రలంటే ఇష్టం?

నాకు విలన్ షేడ్ క్యారెక్టర్లు అంటే ఇష్టం. రావణలో ఎన్టీఆర్ లాంటి పాత్రలు, నిజం, వర్షం లాంటి చిత్రాల్లో గోపీచంద్ లాంటివారు చేసిన పాత్రలు, వారియర్ లో ఆది పినిశెట్టి పాత్ర ఇష్టం. ఇలాంటివాటిలో కొంచెం పవర్ అనేది కనిపిస్తుంటుంది. అందుకే అలాంటి పాత్రలు చేయాలని ఉంది. అందరూ పెద్ద దిగ్గజాలే. వారితో నటించాలంటే మనలో కూడా ఆ సత్తా ఉండాలి.. ఉందని నేననుకుంటున్నాను.

తెలుగులో మీరు ఇష్టపడే డైరెక్టర్లు ఎవరు?

త్రివిక్రమ్, బోయపాటి శ్రీను లాంటి వాళ్లు చాలా ఇష్టం. వీళ్ల సినిమాలు విభిన్నంగా ఉంటాయి. రాజమౌళి గారు అందరికీ ఫేవరేట్ డైరెక్టరే. ఆయన సినిమాలు అద్భుతంగా ఉంటాయి.

భారతీయన్స్ లో చాలా కష్టంగా ఈ సీన్ చేశాను అనిపించింది ఏమిటి?

నా డెత్ సీన్ ఒకటుంటుంది. అది డిఫికల్ట్ సీన్. ఆడియన్స్ కనెక్ట్ అయితేనే మనల్ని మనం ప్రూవ్ చేసుకున్నట్టు అని నా ఫీలింగ్. ఈ సినిమా అయ్యాక చిన్న సంఘటన జరిగింది. ఒక ఎనిమిదేళ్ల పాప ఆ సీన్ చూసి నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చింది. అంటే ఆమె ఆ పాత్రకు అంత కనెక్ట్ కాగలిగింది. దాంతో ఆడియన్స్ కు కనెక్ట్ కాగలుగుతున్నాననే నమ్మకం కూడా కలిగింది. చిన్న పాపనే ఆ సీన్ కదిలించింది అంటే కచ్చితంగా అన్ని వయసుల వారికీ ఆ ఫీలింగ్ కలుగుతుంది.

భారతీయన్స్ సినిమా చూశాక మీ పేరెంట్స్ కామెంట్స్ ఏమిటి?

ఆ సినిమా నాకు దొరకడం నా అదృష్టం. సినిమా చూసి బయటకు వచ్చేశాక మా ఆనందాన్ని వర్ణించలేను. మా అమ్మ అంత హ్యాపీ ఫీలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నటుడిగా నేను ఏదైనా చేయగలుగుతానన్న నమ్మకాన్ని మా అమ్మే ఇచ్చింది.