పార్టీ ఏర్పాటు పుకార్లపై హీరో విజయ్ లేఖ విడుదల

hero vijay party formation : హీరో విజయ్ పార్టీ పెట్టనున్నారంటూ జోరుగా పుకార్లు వస్తున్నాయి. తాను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ ‘విజయ్ మక్కల్ అయిక్కమ్’ ను పార్టీగా మార్చుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. హీరో విజయ్ పీఆర్ వో రియాజ్ పార్టీ ఏర్పాటు ప్రచారాన్ని ఖండించారు.
ఈ క్రమంలో విజయ్ పేరిట ఓ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ స్పందన కోరుకుంటున్న వాళ్ల కోసం ఈ అధికారిక ప్రకటన అంటూ పీఆర్‌ఓ రియాజ్ అహ్మద్ షేర్ చేసిన లేఖలో.. ‘‘మా నాన్న ఎస్‌ఏ చంద్రశేఖర్ ఈరోజు రాజకీయ పార్టీ ప్రారంభించారని మీడియా ద్వారా నాకు తెలిసింది. ఆ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు.దీని వల్ల నా అభిమానులకు, ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్న. మరో విషయం కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.
కేవలం మా నాన్న స్థాపించారన్న కారణంగా, ఈ పార్టీలో చేరమని గానీ, పార్టీ కోసం పనిచేయమని గానీ నేను చెప్పదలచుకోలేదు. మనం మొదలుపెట్టిన సేవా కార్యక్రమాల ఉద్యమానికి, పార్టీకి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. మా నాన్న పార్టీలో చేరొద్దని అభిమానులు, శ్రేయోభిషులకు నా విజ్ఞప్తి.నా పేరు, ఫొటో పేరిట జరిగే పనులతో నాకు సంబంధం లేదు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని’’ విజయ్ పేర్కొన్నట్లు ఉంది.
తమిళనాట విజయ్‌కు ఉన్న అశేష అభిమాన లోకం గురించి తెలిసిందే. దీంతో తనయుడి చేత రాజకీయ ప్రవేశం చేయించాలని గత కొన్నేళ్లుగా విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తన పేరిట ఉన్న మక్కల్ ఇయక్కం ద్వారా సేవ కార్యక్రమాలతో విజయ్ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ఇటీవల కాలంగా తెర కెక్కుతున్న విజయ్ చిత్రాలన్నీ రాజకీయాల చుట్టు తిరుగుతుండటంతో ఆయన అభిమానుల్లో రాజకీయ ఎదురు చూపులు పెరిగాయి.
ఈ పరిస్థితుల్లో విజయ్ మక్కల్ ఇయక్కంను అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం రాజకీయ పార్టీగా మారుస్తూ ఈసీకి ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ దరఖాస్తు పెట్టుకోవడం తమిళనాట చర్చకు దారి తీసింది. ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఏ చంద్రశేఖర్, కోశాధికారిగా ఆయన భార్య, విజయ్ తల్లి శోభ పేర్లను పొందు పరచి ఉండటంతో రాజకీయ చర్చ మరింతగా వేడెక్కింది.