Chaurya Paatam : ‘చౌర్య పాఠం’ మూవీ రివ్యూ.. బ్యాంక్ దొంగతనానికి వెళ్తే ఏం జరిగింది..?
డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి ఈ చౌర్య పాఠం సినిమా తెరకెక్కించడం గమనార్హం.

Indhra Ram Payal Radhakrishna ThrinadhaRao Nakkina Chaurya Paatam Movie Review and Rating
Chaurya Paatam Movie Review : ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా తెరకెక్కిన సినిమా ‘చౌర్య పాఠం’. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మాణంలో నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాజీవ్ కనకాల, సలీం ఫేకు కీలక పాత్రల్లో నటించారు. చౌర్య పాఠం సినిమా నేడు ఏప్రిల్ 25న రిలీజయింది.
కథ విషయానికొస్తే.. వేదాంత్(ఇంద్ర రామ్) డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వేదాంత్ పనిచేసే సినిమాకు అనుకోకుండా ఇతని వల్ల భారీ నష్టం రావడంతో ఇతన్ని ప్రొడ్యూసర్స్ బ్లాక్ లిస్ట్ లో పెడతారు. దీంతో వేదాంత్ డైరెక్టర్ అవ్వాలంటే తనే సొంతంగా నిర్మాతగా చేయాలి. అందుకు డబ్బులు కావాలి. తన ఫ్రెండ్ సరదాగా బ్యాంక్ కి కన్నం వేయాలి అన్న మాటలను సీరియస్ గా తీసుకొని ధనిక గ్రామం, ఆదర్శ గ్రామం అయిన ధనపాలి ని టార్గెట్ పెట్టుకొని ఆ గ్రామంలో బ్యాంక్ ని దొంగతనం చేయాలని ఫిక్స్ అవుతాడు.
వేదాంత్, తన ఫ్రెండ్ లక్ష్మణ్(మ్యాడీ), సినిమాల్లో బ్లాస్ట్ లు చేసే బబ్లూ(సలీం ఫేకు), జాక్ అనే మరో వ్యక్తితో కలిసి ఆ ఊరికి వెళ్తారు. ఆ ఊళ్ళో సర్పంచ్ వసుధ(సుప్రియ), ఆ ఊరి జమిందార్(రాజీవ్ కనకాల)ల పర్మిషన్ తీసుకొని ఆ ఊరి గురించి డాక్యుమెంట్ తీస్తాం, నెల రోజులు ఉంటాము అని చెప్పి ఒప్పిస్తారు. ఆ సర్పంచ్ కి – జమిందార్ కి పడదు. సమ్మర్ కావడంతో స్కూల్ లో ఉంటాము అని చెప్పి స్కూల్ నుంచి బ్యాంక్ వరకు టన్నెల్ తవ్వుకుంటూ, బ్లాస్ట్ లు చేస్తూ వెళ్లి డబ్బులు దొంగతనం చేద్దామని పని మొదలుపెడతారు. ఈ క్రమంలో బ్యాంక్ అకౌంటెంట్ అంజలి(పాయల్ రాధాకృష్ణ) వేదాంత్ ప్రేమలో పడతారు. కింద తవ్వుకుంటూ వెళ్తుండగా ఓ చోట ఓ ఇంటి బేస్మెంట్ అడ్డు వచ్చి అందులో అన్ని అస్థిపంజరాలు ఉంటాయి. ఆ అస్థిపంజరాలు ఎవరివి? ఆ ఇల్లు ఎవరిది? వేదాంత్ అతని మనుషులు బ్యాంక్ దొంగతనం చేస్తారా? జమిందార్ కి – సర్పంచ్ కి ఎందుకు పడదు? వేదాంత్ డైరెక్టర్ అవుతాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Nani : పాపం.. సినిమా ఇండస్ట్రీలో నాని ఫస్ట్ శాలరీ.. చెక్ బౌన్స్ అయి.. ఎంత లాస్ అంటే..?
సినిమా విశ్లేషణ.. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి ఈ చౌర్య పాఠం సినిమా తెరకెక్కించడం గమనార్హం. ట్రైలర్ రిలీజయినప్పుడే ఇదేదో మనీ హైస్ట్ లాగా ఉందే అని ఆసక్తి కలిగింది. కానీ మనీ హైస్ట్ లాంటి సినిమా అన్నట్టు చూపించినా ఇంటర్వెల్ కి కథ అంతా మారిపోద్ది.
ఫస్ట్ హాఫ్ హీరో, అతని ఫ్రెండ్ పాత్రల గురించి, వాళ్ళు బ్యాంక్ దొంగతనం చేద్దామని ఫిక్స్ అయి ఊరికి వెళ్లడం, అక్కడ దొంగతనం పనులు, హీరో – హీరోయిన్ లవ్ స్టోరీలతో సాగుతుంది. ఊరికి వెళ్లేంతవరకు సినిమా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి అస్థిపంజరాలు కనిపించడంతో అవి ఎవరివి, నెక్స్ట్ ఏంటి అని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలయి చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఓ పక్క బ్యాంక్ దొంగతనం చేస్తారా? ఇంకో పక్క అస్థిపంజరాలు కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా బాగానే చూపించారు. క్లైమాక్స్ అందరూ ఊహించేది కాకుండా కొత్తగా చూపిస్తారు. అక్కర్లేని చోట పాటలు వచ్చి కథని కాస్త డిస్టర్బ్ చేస్తాయి. అక్కడక్కడా కామెడీ ట్రై చేసారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. కొత్త హీరో ఇంద్ర రామ్ బాగానే మెప్పించాడు. పాయల్ రాధాకృష్ణ క్యూట్ గా కనిపించి అలరిస్తుంది. లేడీ సర్పంచ్ పాత్రలో సుప్రియ బాగా నటించింది. సలీం ఫేకు, రాజీవ్ కనకాల.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Gymkhana : ‘అలప్పుజ జింఖానా’ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ హీరో డబ్బింగ్ సినిమా ఎలా ఉందంటే..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఆ టన్నెల్ తవ్వడం కోసం చేసిన సెటప్ కి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడ్డారు అని తెలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి సస్పెన్స్ ఫీల్ ఇస్తుంది. పాటలు యావరేజ్. లొకేషన్స్ పరంగా సినిమా అంతా ఆల్మోస్ట్ ఒకే ఊళ్ళో తీసేసారు. కొత్త కథతో ఆసక్తికర కథనంతో కొత్త డైరెక్టర్ బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘చౌర్య పాఠం’ సినిమా బ్యాంక్ ని దొంగతనం చేద్దామని వెళ్లినవాళ్లకు అస్థిపంజరాలు కనపడటంతో ఏం జరిగింది అని సస్పెన్స్ కథాంశంతో తెరక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.