హీరోయిన్ రష్మిక ఇంటి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం

హీరోయిన్ రష్మిక మందన్న ఇంటి నుంచి లెక్కలో చూపని రూ. 25 లక్షలను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. వీటితోపాటు కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేట లో ఉన్న రష్మిక ఇంటి డాక్యుమెంట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. ఆమె ఇంటికి సంబంధించి ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రష్మిక తల్లిదండ్రులు సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో అధికారులు ఆ ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతి పండగ రోజున బుధవారం నుంచి కర్ణాటకలోని కొడుగు జిల్లాలో ఉన్న రష్మిక నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కారణంలో ఈ తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం ఐటీ అధికారులు బెంగళూరు నుంచి విరాజ్‌పేటకు చేరుకున్నారు.
ఐటీ అధికారులు సోదాలకు వచ్చిన సమయంలో రష్మిక షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆమె తల్లిదండ్రులను అధికారులు ప్రశ్నించారు. అలాగే రష్మికా బ్యాంక్ ఖాతా వివరాలు, ఆస్తి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలను ఆమె తల్లి తండ్రులను అడిగి పరిశీలిస్తున్నారు.
మరోవైపు ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్ ఆమెకు సంబంధించిన లావాదేవీలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని ప్రస్తుతం తన తండ్రికి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఇక కన్నడ స్టార్ అయిన రష్మిక ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
తాజాగా రష్మిక- మహేష్‌బాబు కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం బాక్సాఫిస్ వద్ద దూసుకుపోతుంది. అలాగే తెలుగు, కన్నడం, తమిళంలో వరుస సినిమాలతో రష్మికా ప్రస్తుతం బిజీగా ఉన్నారు.