Kiran Abbavaram : 15 రోజులు దుమ్ములో డూప్ లేకుండా యాక్షన్స్ చేశా.. సినిమా రిలీజ్ హడావిడిలో ఇంటికి కూడా వెళ్లట్లేదు..
కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ క సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు.

Kiran Abbavaram Hard work for KA Movie Releasing on this Diwali
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం హీరోగా ‘క’ అనే పాన్ ఇండియా సినిమాతో అక్టోబర్ 31న రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. నయన్ సారిక, తన్వీ రామ్ ఇందులో హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరు డైరెక్టర్స్ ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ క సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు.
కిరణ్ అబ్బవరం క సినిమా గురించి మాట్లాడుతూ.. క సినిమా టైటిల్ జస్టిఫికేషన్ నా పేరు కాదు కానీ టైటిల్ అలా కుదిరింది. క ఏంటి, ఈ మూవీ కథ ఏంటి అనేది సినిమా చూడాల్సిందే. ఇలాంటి పాయింట్ తో 70వ దశకంలో కొత్తగా చూపిస్తున్నాము. షాట్ మేకింగ్ కూడా కొత్తగా ఉంటుంది. క మూవీ క్లైమాక్స్ ను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాం. ఇలాంటి క్లైమాక్స్ తో ఇంతవరకు ఏ సినిమా రాలేదు. మీరు కొత్తదనం ఫీల్ కాకపోతే నేను సినిమాలు చేయను అనే బోల్డ్ స్టేట్ మెంట్ అందుకే ఇచ్చాను. ఎవరు, ఏంటి, ఎక్కడ.. అనే మూడు పాయింట్స్ తో సినిమా సస్పెన్స్ తో సాగుతుంది. ట్విస్టులు బాగుంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఫస్ట్ డే సినిమా చూసిన వాళ్లు ట్విస్ట్ లు సోషల్ మీడియాలో రివీల్ చేస్తారేమో అనే భయం ఉంది అని అన్నారు.
క సినిమా యాక్షన్ సీక్వెన్స్ ల గురించి మాట్లాడుతూ.. సినిమా క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఎద్దుల బండి మీద చేసే ఫైట్స్, ఇంటి పై కప్పుల మీద పరుగులు పెట్టేవి.. ఇలాంటివి డూప్ లేకుండా రియల్ గా చేసాను. దాదాపు 15 రోజులు దుమ్ములో కష్టపడి చేసాము ఆ సీన్స్. ఫిజికల్ గా బాగా స్ట్రెయిన్ అయ్యాం అని అన్నారు.
సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్స్ కథ చెప్పినప్పుడే వాసుదేవ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒక క్లారిటీకి వచ్చాను. 1977లో కృష్ణగిరి ఊరిలో అభినయ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ లో నేను నటించాను. నేను కూడా విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి కథను త్వరగా రిలేట్ చేసుకోగలిగాను. నాకు తెలిసి ఊర్లల్లో ఉత్తరాలు పంచే హీరో క్యారెక్టర్ ఇటీవల రాలేదు. అందుకే వాసుదేవ్ క్యారెక్టర్ కోసం బాగా ప్రిపేర్ అయి చేశాను అని తెలిపారు.
పాన్ ఇండియా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. మనం అనుకున్న కథ ఏదో ఒక భాషలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి రెస్పాన్స్ బాగుంటే ఇక్కడ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశాం. తమిళ్, మలయాళంలో అక్కడ పెద్ద సినిమాలు ఉండటంతో కొంచెం లేట్ గా రిలీజ్ అవుతుంది. దుల్కర్ గారు మలయాళంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని తెలిపారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నాగ చైతన్య గారు గెస్ట్ గా వస్తున్నారు అని తెలిపారు కిరణ్. అలాగే ఇటీవలే తన మ్యారేజ్ అవ్వడంతో తన పెళ్లి లైఫ్ గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది నా మ్యారేజ్ జరిగింది. గత కొన్ని రోజులుగా క మూవీ రిలీజ్ హడావుడిలోనే ఉండి ఇంటికి కూడా వెళ్లట్లేదు. క రిలీజయి హిట్ అయ్యాక చిన్న బ్రేక్ తీసుకుంటాను అని తెలిపారు.